Heart Attack: డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి.. గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థిని మృతి

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది.

Updated : 12 Aug 2023 09:40 IST

గంగాధర, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే మండలం వెంకటాయపల్లికి చెందిన గుండు అంజయ్య, శారదల కుమార్తె ప్రదీప్తి (16) ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం అభ్యసిస్తోంది. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్‌ డే సందర్భంగా తోటి విద్యార్థులతో నృత్యం చేస్తూ.. ప్రదీప్తి కుప్పకూలింది. కళాశాలలో ఉన్న వైద్య సిబ్బంది సీపీఆర్‌ చేసినా ప్రయోజనం లేకపోవడంతో కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రదీప్తికి చిన్న వయసు నుంచే గుండెకు రంధ్రం ఉందని, శస్త్రచికిత్స జరిపించాలని అప్పట్లో వైద్యులు సూచించారు. ఆర్థిక స్తోమత లేక తల్లితండ్రులు శస్త్రచికిత్స చేయించలేకపోయారు.  


అలాంటి పిల్లలు అతిగా శ్రమించొద్దు

ఈనాడు, హైదరాబాద్‌: గుండెజబ్బుతో బాధపడుతున్న చిన్నారులు ఎట్టిపరిస్థితుల్లోనూ అతిగా శ్రమించవద్దని రెయిన్‌బో హాస్పిటల్‌ పిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ కోనేటి నాగేశ్వర్‌రావు సూచించారు. తీవ్రంగా శ్రమకు గురైనప్పుడు ఉన్నట్టుండి గుండె వైఫల్యం బారినపడే ప్రమాదం ఉంటుందని తెలిపారు. కరీంనగర్‌లో ఓ విద్యార్థిని నృత్యం చేస్తూ చనిపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తేగా గుండెజబ్బుతో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన ‘ఈనాడు’కు వివరించారు. ‘‘పిల్లల్లో సుమారు 50 రకాల గుండెజబ్బులు ఉంటాయి. ఇందులో గుండెలో రంధ్రం; గుండె నుంచి శరీరానికి, ఊపిరితిత్తులకు పోయే రక్తనాళాల్లో అడ్డంకులు(బ్లాక్‌); గుండె స్పందనలో తేడాలు విపరీతంగా ఉండడం- ఈ 3రకాలను ఎక్కువగా చూస్తుంటాం. గుండెలో రంధ్రం ఉన్న బాధితులుఅతిగా శ్రమిస్తే ఊపిరితిత్తుల్లో రక్తపోటు రెండు, మూడింతలు పెరిగిపోయే ప్రమాదముంది. శ్వాసకోశాల్లో శుభ్రమవ్వాల్సిన రక్తం.. అపరిశుభ్రంగానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాగే మెదడుకు చేరుతుంది. దీంతో తలతిరిగి ఉన్నట్టుండి కింద పడిపోతారు. కొందరు చనిపోయే ప్రమాదమూ ఉంది. మిగతా రెండు రకాల బాధితులకు కూడా విపరీతమైన శారీరక శ్రమ పనికిరాదు. ఒకవేళ ఏదైనా కారణంతో చికిత్స పొందడం ఆలస్యమైతే.. కనీసం ఆర్నెల్లకోసారి అయినా వైద్యుడిని సంప్రదించాలి. ఈలోగా శారీరక శ్రమ అధికంగా ఉండే పనులు, నృత్యం, క్రీడల్లో చిన్నారులు పాల్గొనకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని వివరించారు.


గుండె జబ్బులున్న పిల్లలను తొలిదశలో గుర్తించడం ఇలా...

  • బాగా ఆయాసం వస్తూ ఉంటుంది. పాలు తాగాలనుకున్నా తాగలేరు. తక్కువ తక్కువగా తాగి నిద్రపోతుంటారు. ఎదుగుదల ఉండదు.
  • పాలు తాగేటప్పుడు బాగా చెమట కారుతుంది.తరచూ నిమోనియా బారిన పడుతుంటారు. డొక్కలు ఎగరేస్తుంటారు.
  • కొందరు నీలి రంగులో మారుతారు.
  • సాధారణ పిల్లల్లా ఆడుకోలేరు. పరుగెత్తలేరు. నీరసంగా ఉంటుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని