YSRCP leader: వివాహితపై వైకాపా నేత అత్యాచారయత్నం

రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. భర్తతో కలిసి కూలి పనులు చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళపై ఓ వైకాపా నేత కన్నేశాడు.

Updated : 11 Dec 2023 07:20 IST

కేసు నమోదులో పోలీసుల తాత్సారం

కర్లపాలెం, న్యూస్‌టుడే: రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. భర్తతో కలిసి కూలి పనులు చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళపై ఓ వైకాపా నేత(YSRCP leader) కన్నేశాడు. ఇప్పటికే ఆమెపై మూడుసార్లు అత్యాచారానికి యత్నించాడు. తాజాగా ఈనెల 4న ఆమెపై అఘాయిత్యానికి యత్నించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అలాంటి వ్యక్తికి మరికొందరు వైకాపా నేతలు మద్దతుగా నిలవడం గ్రామంలో చర్చనీయాంశమైంది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలు.. మండలంలో పెదగొల్లపాలెం పంచాయతీ పరిధిలో ఓ గ్రామానికి చెందిన మహిళ తన ఇద్దరు పిల్లలతో ఈ నెల 4న ఇంట్లో నిద్రించారు. ఆమె భర్త పనుల నిమిత్తం విజయవాడ వెళ్లారు. రాత్రి 10గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన వైకాపా నేత కమలాకరరావు వివాహిత ఇంటి కరెంటు ఫ్యూజులు తొలగించి తలుపుకొట్టాడు. ఆమె తలుపు తీయగా దగ్గరగా వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.

బాధితురాలు కేకలు వేయడంతో పారిపోయాడు. జరిగిన విషయాన్ని ఉదయాన్నే గ్రామ పెద్దలకు చెప్పగా న్యాయం చేస్తామని మాటిచ్చారు. తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈనెల 6న ఆమె ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా, ఎస్సై అందుబాటులో లేరు. అదేరోజు సాయంత్రం మళ్లీ స్టేషన్‌కు వెళ్లగా ఎస్సై శివయ్య ఫిర్యాదు తీసుకున్నారు. అప్పటినుంచి రోజూ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయారు. నిందితుడికి స్థానిక వైకాపా నేతల అండదండలు ఉండడం వల్లే తనకు న్యాయం చేయట్లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయమై ఏఎస్సై సాంబశివరావును ‘న్యూస్‌టుడే’ వివరణ అడగ్గా ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ఆదివారం రాత్రి కేసు నమోదుచేశారు. నిందితుడు గతంలో ఇదే తరహాలో ఆరుగురిపై అత్యాచార యత్నం చేయబోగా గ్రామ పెద్దలు మందలించి అపరాధ రుసుము వసూలు చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని