logo

స్వపక్షంలో విపక్షం!

అధికార భారాసలో విభేదాలు భగ్గుమన్నాయి. మొన్న పీహెచ్‌ వర్కర్ల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు, నిన్న మాస్టర్‌ప్లాన్‌లో లోటుపాట్లతో బల్దియా విషయం రాష్ట్రవ్యాప్తంగా రచ్చకెక్కింది.

Published : 01 Feb 2023 04:11 IST

బల్దియా పాలకవర్గంలో బహిర్గతమైన విభేదాలు..
నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

ధికార భారాసలో విభేదాలు భగ్గుమన్నాయి. మొన్న పీహెచ్‌ వర్కర్ల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు, నిన్న మాస్టర్‌ప్లాన్‌లో లోటుపాట్లతో బల్దియా విషయం రాష్ట్రవ్యాప్తంగా రచ్చకెక్కింది. తాజాగా.. మున్సిపల్‌ ఛైర్మన్‌పై స్వపక్షంలోని సభ్యులే అవిశ్వాసం ప్రకటిస్తుండటం పార్టీలోని వర్గపోరును మరింత తేటతెల్లం చేస్తోంది. మంత్రి సొంత నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొనడంతో ఏం జరగనుందోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇదీ జరిగింది..

పాలకవర్గం కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతుండటం, అవిశ్వాసం పెట్టేందుకు అవకాశమున్న తరుణంలో.. రెండు రోజుల కిందట పట్టణానికి చెందిన పలువురు కౌన్సిలర్లు రహస్యంగా సమావేశమయ్యారు. మున్సిపల్‌ ఛైర్మన్‌పై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారన్న సమాచారం లీకైంది. దీంతో ఛైర్మన్‌ సోమవారం రాత్రి తన వర్గీయులతో మున్సిపల్‌ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. అనంతరం అందరూ కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. నిర్మల్‌ మున్సిపల్‌లో ఎలాంటి అవిశ్వాసానికి తావులేదని, మంత్రి నేతృత్వంలో పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. వదంతులు నమ్మొద్దన్నారు. మూడేళ్లు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో కౌన్సిలర్లంతా కలిసి విహారయాత్ర వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.

వైరల్‌గా మారిన కౌన్సిలర్‌ మాటలు..

మున్సిపల్‌ ఛైర్మన్‌ చేసిన ప్రకటన అనంతరం భారాసకు చెందిన కౌన్సిలర్‌ అయ్యన్నగారి రాజేందర్‌ అర్ధరాత్రి సమయంలో వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ అవినీతి, అక్రమాలకు వంతపాడుతున్నాడంటూ తీవ్రంగా మండిపడ్డారు.  మంత్రికి, పార్టీకి చెడ్డపేరు వస్తోందని, తాము పార్టీని వ్యతిరేకించడం లేదని, ఛైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

మంత్రి రహస్య సమావేశం..

బల్దియాలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం సాయంత్రం పట్టణంలో పార్టీ కౌన్సిల్‌ సభ్యులతో రహస్య సమావేశం నిర్వహించారు. సభ్యుల మధ్య నెలకొన్న వైషమ్యాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏం చేయాలో చర్చించారు. అయితే.. విభేదాలను సద్దుమణిగింపచేసేందుకు ఏం నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని