logo

ఇసుక దోచేస్తున్నారు..

జిల్లాలోని నదులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల జిల్లా పాలనాధికారి అశిష్‌ సంగ్వాన్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Published : 23 Apr 2024 02:34 IST

ఎన్నికల విధుల్లో అధికారులు.. యథేచ్ఛగా తరలిస్తున్న అక్రమార్కులు

నిర్మల్‌-భైంసా ప్రధాన రహదారిపై లారీలో నుంచి ట్రాక్టర్‌లోకి డంప్‌ చేస్తున్న ఇసుక

న్యూస్‌టుడే, నిర్మల్‌ అర్బన్‌: జిల్లాలోని నదులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల జిల్లా పాలనాధికారి అశిష్‌ సంగ్వాన్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కొన్ని రోజులు వరుస దాడులు జరిపి ఇసుక అక్రమ రవాణా జరగకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శాఖల అధికారులు విధుల్లో బిజీగా ఉండడంతో ఇదే అనువుగా భావించి అక్రమార్కులు జిల్లాలోని స్వర్ణ వాగులోని ఇసుకను దోచేస్తున్నారు.  

జిల్లాలోని జలాశయాల్లో అత్యధికంగా ఇసుక లభ్యమయ్యేదాంట్లో ఒకటి స్వర్ణ వాగు. కురిసిన భారీ వర్షాలకు మిగులు జలాలు బయటకు వదలడంతో ఆయా ప్రాంతాల్లో ఇసుక పెద్ద మొత్తంలో వచ్చి చేరింది. సారంగాపూర్‌, దిలావర్‌పూర్‌, నిర్మల్‌ గ్రామీణం, పట్టణం, సోన్‌ మండలాల పరిధిలోని పరివాహక ప్రాంత కొన్ని గ్రామాల్లో అనధికారికంగా వేలం నిర్వహించి రూ.లక్షలు వెచ్చించి వాటిని దక్కించుకుంటున్నారు. ఒక ప్రాంతంలోనైతే ఏకంగా రూ.10 లక్షలకుపైనే పలికిందంటే ఎంతటి లాభాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్‌లో ఒక్కో ట్రాక్టర్‌ ఇసుక ధర రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు పలుకుతుండటంతో ఇదే అదునుగా భావించి అందినకాడికి దోచుకుంటున్నారు.

ప్రమాదకరంగా..

స్వర్ణ నదిలో పలు చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించడంతో నీళ్లు నిలిచి ఇసుక తీసేందుకు సదరు వ్యాపారులకు ఆటంకంగా మారింది. అయినా ట్రాక్టర్‌కు ప్రత్యేక పరికరాలు అమర్చి, భారీ పార లాంటిదానిని ఏర్పాటు చేసి నీటి అడుగుభాగంలో నుంచి వెలికితీస్తున్నారు. ఇందుకు కొందరు కూలీలకు పనులు అప్పజెబుతుండడంతో ప్రాణాలకు తెగించి వాటిని నిర్వహిస్తున్నారు.

న్నని ఇసుకను జిల్లాకు భారీ లారీల్లో తీసుకొస్తున్నారు. వీటిని ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఆయా ప్రదేశాల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. లేదానేరుగా సంబంధిత నిర్మాణ ప్రాంతానికి తరలించాలి. అలాంటి నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలోని భైంసా, ఖానాపూర్‌, ఆర్మూర్‌, ఆదిలాబాద్‌కు వెళ్లే ప్రధాన మార్గాల పక్కనే భారీ లారీలను నిలిపి అక్కడి నుంచే వ్యాపారాన్ని సాగిస్తున్నారు. కొంత మంది రోడ్లపైనే ఇసుకను నిల్వ చేసి అమ్మకాలు జరుపుతున్నారు. వాహనాలు నిలపడంతో ఆ రోడ్ల వెంట రాకపోకలు సాగించే మిగతా వాహనాల చోదకులు, ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతోంది.

సోన్‌ మండలం శాకెర గ్రామ సమీపంలో చెక్‌డ్యాం నిర్మించారు. ఆ నీళ్లు ప్రస్తుతం పట్టణ శివారులోని సిద్దాపూర్‌ దాటి మంజులాపూర్‌ శివారు వరకు వ్యాపించాయి. కురిసిన భారీ వర్షాలతో ఇసుక వచ్చి పెద్ద మొత్తంలో ఆయా ప్రాంతాల్లో నిల్వ ఉంది. దీన్ని వెలికితీసేందుకు కొందరు అనధికారికంగా కొంత మొత్తం ముట్టజెప్పి వేలం పాటలో దక్కించుకుని వెలికితీత చేపడుతున్నారు. ట్రాక్టర్‌కు తాడు, ఇనుప తీగను అమర్చి భారీ పారలాంటి పరికరంతో లోపల ఉన్న ఇసుకను బయటకు తీయిస్తున్నారు. కూలీలు ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్లి అమర్చి వాటిని ట్రాక్టర్‌కు బిగించిన యంత్రంతో బయటకు ఇలా తీస్తున్నారు. అక్కడే జల్లెడ పడుతున్నారు.

నిర్మల్‌ గ్రామీణ మండలం చిట్యాల్‌, పట్టణంలోని మంజులాపూర్‌ మధ్య ఉన్న స్వర్ణ వాగు ప్రస్తుతం ఎడారిని తలపిస్తుంది. చిట్యాల్‌ వద్ద చెక్‌డ్యాం నిర్మించినా నీటి నిల్వ మాత్రం లేదు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్న ఇసుకను యథేచ్ఛగా కొందరు అక్రమంగా తరలించడమే. దీంతో భూగర్భ జలాలు అమాంతంగా పడిపోయాయి. ఇసుక తీయడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. నిర్మల్‌- భైంసా ప్రధాన రహదారి పక్కనే, నిత్యం అధికారులు పర్యటించే ప్రాంతం సమీపంలోనే ఈ తంతు సాగుతున్నా ఆ వైపు దృష్టి సారించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని