logo

పట్టణానికి దూరం.. కావాలి ప్రత్యామ్నాయం

మంచిర్యాల ఎంసీహెచ్‌(మాతా, శిశు ఆరోగ్య కేంద్రం).. పట్టణానికి దూరంగా ఉండటంతో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అత్యవసరమైనవి.. ముఖ్యమైనవి.. ఆసుపత్రిలో చల్లదనం, సరిపడా నీటి సౌకర్యం. 

Published : 23 Apr 2024 02:37 IST

నిరంతర కుళాయి ఏర్పాటు చేస్తేనే సమస్య పరిష్కారం

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: మంచిర్యాల ఎంసీహెచ్‌(మాతా, శిశు ఆరోగ్య కేంద్రం).. పట్టణానికి దూరంగా ఉండటంతో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అత్యవసరమైనవి.. ముఖ్యమైనవి.. ఆసుపత్రిలో చల్లదనం, సరిపడా నీటి సౌకర్యం.  కానీ మంచినీటికి ఒక్కో సమయంలో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎంసీహెచ్‌ సిబ్బంది నుంచి బాధితుల వరకు నీటి సీసాలు కొనుగోలుకు అవస్థలు పడుతున్నారు. సమీపంలో దుకాణాలు లేకపోవడం, ఉన్నా ఇక్కడ నాణ్యంగా ఉంటాయో.. లేదో అనే సందేహంతో రెండు కి.మీ. దూరం వెళ్లి కొనుక్కుంటున్నారు. ఆసుపత్రి తలాపునే గోదావరి ఉన్నా మంచినీటి కోసం యాతన పడుతున్నారు.

ఎంసీహెచ్‌లో కమ్మవారి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రూ.లక్షల ఖర్చుతో నీటిని శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటుతో పాటు ఓపీ, ఐపీ విభాగాల్లో బాధితుల సౌకర్యార్థం నల్లాలు అందుబాటులో ఉంచారు. ఇటీవల సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కొరత ఏర్పడి వందలకొద్దీ చికిత్స పొందుతున్న బాలింతలతో పాటు రాకపోకలు సాగించే ఓపీ బాధితులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం యంత్రం వినియోగంలోకి రావడంతో సేవలు యధావిధిగా కొనసాగుతున్నాయి. కానీ భవిష్యత్తులోనూ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశముంటుంది.

జీజీహెచ్‌లో ఇలా..

ప్రస్తుతం ఐబీలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో శుద్ధజల ప్లాంట్‌ అందుబాటులో లేకపోయినా బాధితులకు తాగునీటి సమస్య ఏర్పడటం లేదు. ఆవరణలో 24 గంటలు సరఫరా అయ్యే పురపాలిక మంచినీటి కుళాయిలు ఉండటమే అందుకు కారణం. ఇలాంటి సదుపాయమే ఎంసీహెచ్‌లోనూ తీసుకొస్తే ఇక ఇబ్బందే ఉండదు. అప్పుడప్పుడు ప్లాంటు సేవలు నిలిచిపోయినా బాధితులు నీటి కోసం అవస్థలు పడే అవకాశముండదు. గోదావరిరోడ్‌లో నిత్యం మంచినీరు సరఫరా అయ్యే పైప్‌లైన్‌ ఆసుపత్రికి చేరువలో ఉంది. దీనికి అనుబంధంగా మరో పైప్‌లైన్‌ ఏర్పాటు చేసుకుంటే నిరంతర సరఫరా ఉంటుంది. తాగునీటి కొరత తీరుతుంది. ఆసుపత్రి నిర్వాహకులు ఈ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరముంది.

ది.. గోదావరి దారి నుంచి ఉన్న మంచినీటి పైప్‌లైన్‌. ఇటీవల సమ్మక్క జాతరలో భాగంగా భక్తుల సౌకర్యార్థం కుళాయిలు ఏర్పాటు చేశారు. అనంతరం వాటిని మూసివేశారు. ఎంసీహెచ్‌కు సమీపంలో ఉన్న ఈ మంచినీటి సరఫరా పైప్‌లైన్‌ను సద్వినియోగం చేసుకుని ఆసుపత్రి వరకు ప్రత్యేక లైన్‌ ఏర్పాటు చేసుకుంటే నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.

మ్మవారి సంక్షేమ సేవా సమితి రూ.లక్షలు ఖర్చుపెట్టి మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్‌)లో అందుబాటులోకి తీసుకొచ్చిన శుద్ధజల ప్లాంటు. దీంతోనే ఆసుపత్రి మొత్తానికి మంచినీటి సరఫరా జరుగుతోంది. శుద్ధజల ప్లాంటు ద్వారా వచ్చే నీటిని తాగేందుకు బాధితుల సౌకర్యార్థం కుళాయిలను రెండు, మూడుచోట్ల ఏర్పాటు చేయించారు. వీటి ద్వారానే ఆసుపత్రి సిబ్బంది సైతం దప్పిక తీర్చుకుంటున్నారు. ఇటీవల కొంత సమస్య తలెత్తడంతో సరఫరా నిలిచిపోయి రెండు, మూడురోజులపాటు తాగునీటికి ఇబ్బందులు కలిగాయి. మరమ్మతుల అనంతరం తిరిగి వినియోగంలోకి వచ్చి సేవలు అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని