logo

భాజపా, కాంగ్రెస్‌ అంతర్గత ఒప్పందం

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా, కాంగ్రెస్‌ అధిష్ఠానాలు అంతర్గత ఒప్పందం చేసుకున్నాయని భారాస జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌, ప్రభుత్వ విప్‌ ఆరోపించారు.

Updated : 03 May 2024 06:08 IST

భారాస జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ ఆరోపణ

మాట్లాడుతున్న భారాస జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌, పక్కన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తదితరులు

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా, కాంగ్రెస్‌ అధిష్ఠానాలు అంతర్గత ఒప్పందం చేసుకున్నాయని భారాస జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌, ప్రభుత్వ విప్‌ ఆరోపించారు. మంచిర్యాలలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపునకు భాజపా, కరీంనగర్‌లో భాజపా అభ్యర్థి విజయానికి కాంగ్రెస్‌ పార్టీలు పరస్పరం డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే స్వయంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే కాంగ్రెస్‌కు ఓట్లు వేయని పరిస్థితిలో భాజపాకు వేయాలని మాట్లాడిన మాటలను చరవాణిలో చూపించారు. దేశంలో భాజపా, కాంగ్రెస్‌లే తప్ప ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని ఆ రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఎన్నికల సంఘం మాజీ సీఎం  కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించడం అమానుషమని అన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, మ్యానిఫెస్టోలో పెట్టిన 420 హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందన్నారు. గతంలో కేసీఆర్‌ను కుటుంబ పాలన చేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్‌, వినోద్‌, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ఎన్నికల్లో పోటీ చేయడం కుటుంబ పాలన కాదా అని ఆయన ప్రశ్నించారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో కాంగ్రెస్‌కు ఎస్సీ అభ్యర్థులే దొరకలేదా అని ఎద్దేవా చేశారు. ఈ ఎస్సీ రిజర్వు స్థానాలు భవిష్యత్తులో రిజర్వేషన్‌ మారినా వారి భార్యలతో ఎన్నికల్లో పోటీ చేయిస్తారని విమర్శించారు. భారాస ప్రభుత్వ పాలనలో కేసీఆర్‌ ఇంద్రకరణ్‌రెడ్డికి రెండుసార్లు మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడం దుర్మార్గమని అన్నారు. ఈ నెల 4న మంచిర్యాలలో నిర్వహించే రోడ్‌షోలో కేసీఆర్‌ పాల్గొంటారని తెలిపారు. సింగరేణి కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ మంచిర్యాలలో నిర్వహించే కేసీఆర్‌ రోడ్‌షోకు ప్రజలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. భారాస పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అంకం నరేష్‌, నాయకులు విజిత్‌రావు, వెంకటేష్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు