logo

విద్యార్థులకు ఆన్‌లైన్‌ ప్రగతి పత్రాలు

విద్యాసంవత్సరం నేటితో ముగియనుంది. విద్యార్థులకు సంగ్రహణాత్మక(ఎస్‌ఏ2) పరీక్షలు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన ఫలితాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

Updated : 23 Apr 2024 06:29 IST

ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ
నేటితో ముగియనున్న విద్యాసంవత్సరం

బేల ప్రాథమిక ప్రాఠశాలలో అందజేసిన ఆన్‌లైన్‌ ప్రగతి పత్రాలతో విద్యార్థులు

న్యూస్‌టుడే, బేల: విద్యాసంవత్సరం నేటితో ముగియనుంది. విద్యార్థులకు సంగ్రహణాత్మక(ఎస్‌ఏ2) పరీక్షలు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన ఫలితాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. మార్కులను తెలిపే ప్రోగ్రెస్‌ కార్డుల(ప్రగతి పత్రాలు) పంపిణీ నిలిచిపోవడంతో ఆన్‌లైన్‌ ప్రగతి పత్రాలను అందించేందుకు విద్యాశాఖ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక(ఎస్‌ఏ1) పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి.

2019-20 విద్యాసంవత్సరం వరకు ప్రతి విద్యార్థికి తరగతి వారీగా ఏడాదికో ప్రోగ్రెస్‌ కార్డు  ఇచ్చేవారు. బడిలో కొత్తగా చేరిన వారికి ఉపయోగపడే సంచిత సమగ్ర నివేదికల పంపిణీ అయిదేళ్లుగా నిలిపివేయడంతో ప్రధానోపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి నిధుల నుంచి ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు ఒక కార్డు, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మరో ప్రోగ్రెస్‌ కార్డును అందించేవారు. ఈ నివేదిక విద్యార్థి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉపయోగపడేది. పాఠశాల మారితే విద్యార్థి తన వెంట ఈ కార్డు తీసుకెళ్లి కొత్తగా చేరిన పాఠశాలలో అప్పగించేవాడు. అందులో విద్యార్థి వ్యక్తిగత వివరాలు, ఫొటో, మార్కులు, గ్రేడ్లు, తరగతి వారీగా ఆరోగ్య సమాచారం, వివరణాత్మక సూచనలు, గ్రేడ్‌ వివరాలు నమోదు చేసి దానిపై తల్లిదండ్రులు సంతకాలు తీసుకునేవారు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికి విద్యార్థులకు ఒకటే ఆన్‌లైన్‌ ప్రగతి పత్రాన్ని అందించనున్నారు. గతేడాది కూడా ఆన్‌లైన్‌లో ఒకటే కార్డు అందజేశారు.

కొనసాగుతున్న ఫలితాల నమోదు

పాఠశాలలో ఇది వరకు విద్యార్థులకు నిర్వహించిన నిర్మాణాత్మక (ఎఫ్‌ఏ1, 2, 3, 4), సంగ్రహణాత్మక(ఎస్‌ఏ1, 2) మూల్యాంకనానికి సంబంధించిన ఫలితాలను ‘schooledu’  లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. పాఠశాల సముదాయంలో పని చేసే సీఆర్పీలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సహాయంతో మార్కులను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేస్తున్నారు. మండలాల వారీగా ఇంకా నమోదు చేయని వారితో విద్యాశాఖ అధికారులు వెబ్‌సైట్‌లో నమోదు చేయిస్తున్నారు. సమ్మెటివ్‌-2 పరీక్షలు కొనసాగిన రోజే జవాబు పత్రాలను ఆ రోజే దిద్దించే ఏర్పాట్లు చేయడంతో ఈ ప్రక్రియ సులువైంది. ప్రగతి పత్రంలో విద్యార్థి, పాఠశాల వివరాలు, విద్యార్థుల ప్రతిభకు సంబంధించి అన్ని వివరాలన్నీ ఇందులో ఉంటాయి.

తల్లిదండ్రుల సమావేశంలో ఇస్తాం

ప్రణీత, జిల్లా విద్యాధికారి, ఆదిలాబాద్‌

ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ ప్రగతి పత్రాలు అందించే ఏర్పాటు చేస్తున్నాం. నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక పరీక్షలకు సంబంధించిన ఫలితాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించాం. ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా ప్రోగ్రెస్‌ రిపోర్టులు జనరేట్‌ అవుతాయి. వీటిని డౌన్‌లోడ్‌ చేసి ప్రింట్‌ తీసుకుని సిద్ధంగా ఉంచి 23న తల్లిదండ్రులతో చివరి సమావేశం ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థికి అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని