logo

తాగునీటి కష్టాలు మొదలు..

గత నెల రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి గోదావరినదిలో నిర్మించిన ఇన్‌టేక్‌వెల్స్‌ వద్ద నీటిమట్టం ఇప్పటికే తగ్గిపోయింది.

Published : 29 Apr 2024 03:00 IST

మున్సిపల్‌ ఇన్‌టేక్‌వెల్స్‌ వద్ద తగ్గిన నిల్వలు

గుడిపేటలోని ఎల్లంపల్లి జలాశయంలో మున్సిపల్‌ ఇన్‌టేక్‌వెల్‌ వద్ద తగ్గుతున్న నీటి మట్టం

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: గత నెల రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి గోదావరినదిలో నిర్మించిన ఇన్‌టేక్‌వెల్స్‌ వద్ద నీటిమట్టం ఇప్పటికే తగ్గిపోయింది. చేతి పంపుల్లో నీటి నిలువలు పడిపోవడంతో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు మున్సిపల్‌ అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.

గోదావరినదికి కూతవేటు దూరంలో మంచిర్యాల పట్టణం ఉన్నా శుద్ధజలం అందించడంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. గతంలో పట్టణ ప్రజలకు రోజు విడిచి రోజు 45 నుంచి 60 నిమిషాలు తాగునీరు సరఫరా చేసేవారు. ఇప్పుడు రోజూ సరఫరా చేస్తున్నా 30 నిమిషాలే ఇవ్వడంతో సరిపోవడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముల్కల్ల గోదావరి నదిలోని మంచిర్యాల మున్సిపల్‌ పాత ఇన్‌టేక్‌వెల్స్‌ గతంలోనే కూలిపోయాయి. ఇప్పుడు అక్కడున్న బెల్లంపల్లి పురపాలిక, ఎంసీసీ కంపెనీ చెందిన ఇన్‌టేక్‌వెల్స్‌, ఎల్లంపల్లిలోని మున్సిపల్‌, మిషన్‌ భగీరథ ఇన్‌టేక్‌వెల్స్‌కు తీసుకొచ్చిన నీటిని ముల్కల్లలోని సంప్‌లో నింపుతున్నారు. అక్కడినుంచి అండాలమ్మకాలనీలో పంప్‌నకు తరలిస్తున్నారు. ఆ నీటిని జాలగుట్టపై నిర్మించిన మరో సంప్‌లోకి ఎక్కించి అక్కడి నుంచి నేరుగా పైప్‌లైన్ల ద్వారా పట్టణంలోని ట్యాంక్‌ ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే పట్టణ ప్రజలకు రోజూ తాగునీరు సరఫరా చేయడంతో చాలాచోట్ల పైప్‌లైన్లు లీకవుతూనే ఉన్నాయి.

ఎల్లంపల్లి జలాశయంలో మిషన్‌ భగీరథ ఇన్‌టేక్‌వెల్‌ చుట్టూ పూర్తిగా తగ్గిన నీరు


మంచిర్యాలలోని పోచమ్మ చెరువు కింది కాలనీ, లయన్స్‌ క్లబ్‌ భవనం ఏరియా, రాజీవ్‌నగర్‌, సాయికుంట, దొరగారిపల్లి ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఇంకా అంతర్గత పైప్‌లైన్లే నిర్మించలేదు. హమాలీవాడ నుంచి తిలక్‌నగర్‌ వరకు చేపట్టిన రహదారి విస్తరణ వివాదంలో అక్కడ పైప్‌లైన్‌ నిర్మాణ పనులు ఆగిపోవడంతో  ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. రెడ్డికాలనీ, గౌతమినగర్‌, ఒడ్డెరకాలనీ, రాళ్లపేట, పద్మశాలినగర్‌, రాంనగర్‌ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు తొమ్మిది ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌ ద్వారా రోజుకు 8 నుంచి 10 ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి ఎండల ప్రభావం ఇలాగే ఉంటే మరో రెండు వారాల్లో తాగునీటి సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.


మంచిర్యాల పట్టణంలోని వివిధ వార్డుల్లో 290 చేతి పంపులు, 306 పవర్‌ బోర్లు ఉన్నాయి. ఎండ తీవ్రతకు భూగర్భ జలాలు తగ్గుతుండటంతో చాల చోట్ల బోర్లలో నీళ్లు రావడం లేదని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


నీటి సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా
మధుకర్‌, మున్సిపల్‌ ఇంజినీరు, మంచిర్యాల

మంచిర్యాల ప్రజలకు ప్రస్తుతం రోజూ తాగునీరు సరఫరా చేస్తున్నాం. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. చాలామంది ఇంటి యజమానులు కుళాయికి ఆన్‌ఆఫ్‌ పరికరం అమర్చకుండా వృథా చేస్తున్నారు. ఇంట్లో అవసరానికి సరిపడా నీళ్లు పట్టుకున్న తర్వాత కుళాయిలను తప్పనిసరిగా బంద్‌ చేయాలి. వేసవి కాలంలో తాగునీటి సమస్య తీర్చడానికి ప్రభుత్వం రూ.23.57 లక్షలు మంజూరు చేసింది. వీటితో పవర్‌ బోర్లకు సంబంధించిన మోటార్లు తదితర పరికరాలు కొనుగోలు చేస్తాం. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం.

మొత్తం నివాస వాణిజ్య గృహాలు : 27,152
మున్సిపల్‌ నల్లా కనెక్షన్లు        : 13,200
మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లు    : 5,150

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని