logo

గొలుసుకట్టు.. అంతా కనికట్టు

మీకు స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. రోజుకు రూ.5 వేలు మొదలుకొని నెలకు రూ.లక్షపైనే ఆదాయం పొందవచ్చని నమ్మబలికింది ఓ విదేశీ ఆన్‌లైన్‌ కంపెనీ. సంప్రదింపులు లేకుండా చాటింగ్‌ ద్వారా లావాదేవీలు నడిపి పెద్ద ఎత్తున యువకులు పెట్టుబడి పెట్టేలా ఎరవేసింది.

Updated : 29 Apr 2024 05:58 IST

ఆన్‌లైన్‌ వేదికగా యువతకు రూ.లక్షల్లో కుచ్చుటోపీ  
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, బేల

మీకు స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. రోజుకు రూ.5 వేలు మొదలుకొని నెలకు రూ.లక్షపైనే ఆదాయం పొందవచ్చని నమ్మబలికింది ఓ విదేశీ ఆన్‌లైన్‌ కంపెనీ. సంప్రదింపులు లేకుండా చాటింగ్‌ ద్వారా లావాదేవీలు నడిపి పెద్ద ఎత్తున యువకులు పెట్టుబడి పెట్టేలా ఎరవేసింది. రెండు నెలల కిందట చాలామందికి డబ్బులు జమ కావడంతో.. ఎంతమందిని చేర్పిస్తే అంత కమీషన్‌ రావడంతో చాలామంది యువకులు అప్పులు చేసి మరీ డబ్బులు పెట్టి పోగోట్టుకున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా లావాదేవీలు జరగడం ప్రస్తుతం ఆ యాప్‌ పని చేయకపోవడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఆన్‌లైన్‌ గేమింగ్‌కు అలవాటు పడిన యువతే లక్ష్యంగా కాస్ట్‌కో అనే విదేశీ కంపెనీ ఆయా ఉత్పత్తులపై పెట్టుబడి పెడితే రోజువారీగా డబ్బులు వస్తాయని ఎరవేసింది. గొలుసుకట్టుగా ఇతరులను చేర్పిస్తే అదనంగా కమీషన్‌ వస్తుందంటూ వాట్సాప్‌ మాద్యమం వేదికగా ఆప్లికేషన్‌ ద్వారా ఇన్వైట్‌ పంపి సభ్యులుగా చేర్పించి అందరిని నిండా ముంచడం కలకలం రేపుతోంది. యాప్‌ వేదికగా చెల్లింపులు జరగడంతో ఏ నెంబరుకు చెల్లించారో.. ఎవరికి డబ్బులు వెళ్లాయో కూడా తెలియకుండా పోయింది. ఈ విషయమై ఫిర్యాదు సైతం చేయని పరిస్థితి నెలకొంది.

ఆన్‌లైన్‌లో చెల్లించిన నగదు

ఆ గ్రామంలో 25 లక్షలపైనే..

భీంపూర్‌ మండలంలోని ఓ గ్రామంలో 46 మంది యువకులు ఆన్‌లైన్‌ గొలుసుకట్టు వ్యాపారంలో తొలుత డబ్బులు పొంది... ఆశతో మరిన్ని డబ్బులు పెట్టి ఏకంగా రూ.25 లక్షల మేర నష్టపోయారు. ఆ గ్రామంలో ఆన్‌లైన్‌ గొలుసుకట్టు వ్యాపారంతో నష్టపోతామని పదే పదే తోటి యువకులను హెచ్చరించిన యువకుడు సైతం చివరకు రూ.5,500 పోగోట్టుకోగా.. ఆ గ్రామంలో మరో యువకుడు అత్యధికంగా రూ.1.20 లక్షలు నష్టపోయాడు. స్మార్ట్‌ఫోన్‌ లేనివారు సైతం ఇతరుల ఐడీ ద్వారా పెట్టుబడి పెట్టారు. డబ్బులు పోగొట్టుకున్న వారిలో రోజు కూలీ చేసే మహిళలు ఉన్నారంటే ఆశ ఎంత నష్టం చేస్తుందో స్పష్టమవుతోంది.


ఓ బ్యాంకు అధికారి వినియోగదారుగా..

బేల మండలంలో ఓ బ్యాంకు అధికారి వినియోగదారుగా సదరు కంపెనీలో చేరి బ్యాంకుకు వచ్చే వారిని సభ్యులుగా చేర్పించారు. మేనేజరు మాటలు నమ్మి రైతులు, యువత ఎంతోమంది ఈ గొలుసుకట్టు వ్యాపారంలోచేరి రూ.లక్షల్లో డబ్బులు నష్టపోయారు. తొలుత డబ్బులు రావడంతో.. ఆ తర్వాత ఆశతో ఎవరికి వారు తమకు తెలిసిన వారిని చేర్పించడంతో.. ఈ దందా మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించింది.


పెట్టుబడి పెట్టించారిలా!  

యాప్‌లో చేరగానే ఇలా వినియోగదారులకు ఉత్పత్తులు కనిపిస్తాయి. ఏ ఉత్పత్తి కొంటే ఎన్ని రోజుల్లో ఎంత ఆదాయం వస్తుందో చూపిస్తారు. అందుకోసం తొలుత ఉత్పత్తి విలువను చెల్లిస్తే.. ఆ తర్వాత రోజువారీగా డబ్బులు జమ చేస్తారు. చూపించే ఆదాయం ఉత్పత్తి విలువ కంటే ఎక్కువగా ఉండటంతో స్వల్పకాలంలోనే రూ.లక్షలు సంపాదించవచ్చన్న ఆశతో ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు చెల్లించి మోసపోయారు.


మోసం గుర్తించారిలా..!  

యాప్‌లో కనిపించిన డబ్బులను విత్‌డ్రా చేసుకుని సొంత బ్యాంకు ఖాతాకు మళ్లించుకుందామంటే మూడు రోజులుగా ‘క్షమించండి, మీరు డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు అనర్హులు’ అంటూ ఇలా సందేశం వస్తోంది. సమస్య పరిష్కారం కావాలంటే కస్టమర్‌ సర్వీసు మేనేజర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. వారిని వాట్సాప్‌ గ్రూప్‌లో సంప్రదిస్తే మరో ప్రొడక్ట్‌ కొనాలని చెబుతున్నారు. అవతలి వ్యక్తి ఎవరో తెలియకుండానే కేవలం చాటింగ్‌ ద్వారానే సంప్రదింపులు జరుగుతుండటంతో.. ఏం చేయలేకపోతున్నారు.


అంకెల గారడితో బురిడీ..!  

ఓ యువకుడు తొలుత రూ.50 వేల ఉత్పత్తులపై పెట్టుబడి పెట్టి తనకు తెలిసిన స్నేహితులను కాస్ట్‌కో గొలుసుకట్టు వ్యాపారంలో చేర్పించి నెల రోజుల్లో రూ.2.89 లక్షల ఆదాయం పొందాడు. ఇప్పుడు యాప్‌లో కనిపించే తన సొంత డబ్బులు విత్‌డ్రా కావడం లేదు. సదరు యువకుడు తన గ్రామంలో ఏకంగా 46 మందిని గ్రూప్‌లో చేర్పించగా.. వారంతా కలిసి దాదాపు రూ.25 లక్షల మేర పోగొట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని