logo

ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం

రెండ్రోజుల కిందట కాగజ్‌నగర్‌లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్‌ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు.

Updated : 30 Apr 2024 06:51 IST

కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల తీరిది!

ఆదివారం అర్ధరాత్రి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు

రెండ్రోజుల కిందట కాగజ్‌నగర్‌లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్‌ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంటనే మృత శిశువును శస్త్రచికిత్స చేసి తొలగించి బాలింత ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు.. 12 గంటలు ఆలస్యం చేయడంతో ఆమె ఆరోగ్యం విషమించి మృతి చెందింది. దీంతో దాదాపు ఆరుగంటల పాటు మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందినట్లు బంధువుల ఫిర్యాదు మేరకు కాగజ్‌నగర్‌ పోలీసులు ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆ ఆసుపత్రిలోని ఇద్దరు వైద్యులు సిర్పూరు(టి) సివిలాసుపత్రిలో ప్రభుత్వ వైద్యులుగా విధులు నిర్వహిస్తూ ఈ ఆసుపత్రిని నిర్వహిస్తుండటం గమనార్హం.


రెండేళ్ల కిందట కాగజ్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలోనూ కాగజ్‌నగర్‌ మండలానికి చెందిన నిండు గర్భిణి ప్రసూతి సేవలకు రాగా.. వైద్యం వికటించి బాలింత, నవజాత శిశువు మృతి చెందారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఆ వైద్యురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  


పట్టణంలోని పెట్రోల్‌పంపు ఏరియాలోనూ ఏడాది కిందట ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలోనూ ఓ గర్భిణి వైద్యం వికటించి మృతి చెందింది. పట్టణంలోని పలు పిల్లల వైద్య ఆసుపత్రుల్లోనూ కనీస సదుపాయాలు లేక నవజాత శిశువులు మృతి చెందిన ఘటనలున్నాయి.


కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: అర్హులైన వైద్యులు అందుబాటులో లేకున్నా.. ధనార్జనే ధ్యేయంగా కొందరు ఆసుపత్రులు ఏర్పాటు చేసి, అమాయకుల జేబులు గుల్ల చేస్తున్నారు. డబ్బులు పోయినా ప్రాణాలైనా దక్కుతున్నాయా అంటే అదీ లేదు. ఇష్టారాజ్యంగా పరీక్షలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో మొత్తం 27 ప్రైవేటు ఆసుపత్రులు ఉండగా.. కాగజ్‌నగర్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో రెండింటికి ఎటువంటి అనుమతులు లేనట్లు సమాచారం. వైద్యశాఖ నిబంధనల మేరకు.. పలు ఆసుపత్రులను నిర్వహించడం లేదు. కాగజ్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేటు ప్రసూతి సేవల ఆసుపత్రి మూడు అంతస్థుల్లో నిర్వహిస్తుండగా.. కనీసం లిఫ్ట్‌ సదుపాయం లేదు. ఇటీవల ఓ బాలింతను మెట్ల నుంచి తీసుకువస్తుండగా.. కిందపడటంతో వైద్యం వికటించి మృత్యువాత పడింది. సదుపాయాలు లేవని పట్టణంలోని పలువురు వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. తనిఖీలు చేసిన దాఖలాలు లేవు.

నిపుణులైన వైద్యులేరి?

పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిల్లో నిపుణులైన స్త్రీవైద్య నిపుణులు మాత్రమే మహిళలు, గర్భిణులకు ప్రసూతి సేవలు అందించాలి. కానీ పిల్లల వైద్య నిపుణులు, జనరల్‌ ఫిజీషియన్లు, ఆర్ధోపెడిక్‌, తదితర వైద్యులు కూడా గర్భిణులకు ప్రసూతి వైద్య సేవలు చేస్తున్నారు. ఇది పూర్తిగా వైద్యశాఖ నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ కొనసాగిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే.. సంబంధిత కుటుంభీకులకు కొంతమేరకు సహాయం అందించి చేతులు దులుపుకొంటున్నారు. ఉన్నతాధికారులు సదరు ప్రైవేటు ఆసుపత్రులపై శాఖపరమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

  • ఓ వ్యక్తి ద్విచక్రవాహనం నుంచి కింద పడగా కాలికి గాయమైంది. కాగజ్‌నగర్‌ పట్టణంలోని పెట్రోల్‌పంపు ఏరియాలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆర్ధోపెడిక్‌ వైద్య నిపుణుడిని సంప్రదించాడు. కాలు ఫ్రాక్చర్‌ అయిందని, ఆపరేషన్‌ చేయాలంటూ రూ.50 వేల నుంచి రూ.70వేలు అవుతుందని చెప్పి ఓ పేపర్‌లో వివరాలు రాసిచ్చాడు. అతను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. కాలికి ఫ్రాక్చర్‌ లేదని, స్వల్ప గాయంగా పేర్కొంటూ మందులు ఇవ్వడంతో నయమైంది. తదనంతరం అతను సదరు వైద్యుడు రాసిచ్చిన పత్రాలతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆ వైద్యుడు బాధితుడికి కొంత నగదు అప్పజెప్పి, కేసును ఉపసంహరించుకునేలా చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని