logo

దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై

ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం.

Updated : 30 Apr 2024 06:50 IST

అనిశాకు పట్టుబడుతున్న వారిలో యువతరమే అధికం


జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్లు. కానీ.. వ్యక్తిత్వం కోల్పోతే సర్వం పోగొట్టుకున్నట్లే

స్వామి వివేకానంద


పూలపరిమళం గాలివాటానికే వెళ్తుంది. కానీ మనిషి మంచితనం నలుదిక్కులా ప్రసరిస్తుంది

చాణక్యుడు


ఏ వ్యక్తైనా పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా ఎప్పటికీ అతడిని విడువని నీడలాగా ఆనందం వెన్నంటే ఉంటుంది

గౌతమ బుద్ధుడు


నిర్మల్‌ పట్టణం/మామడ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. అలాంటి వాటిని దక్కించుకొని నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తున్న వ్యక్తుల్లో కొందరు తమకొచ్చే వేతతం చాలదని, తాము చేయాల్సిన పనులను పూర్తిచేసేందుకు లంచాల కోసం అర్రులు చాస్తున్నారు. చిరుద్యోగులు, రైతులు, కాయకష్టం చేసుకునేవారు.. ఇలా ఒకటేమిటి మూడుపూటలా తిండి తినడమే అదృష్టమని భావిస్తున్న వారినీ వదలకుండా తమ సంపాదన కోసం వేధిస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్నారు. నలుగురిలో నవ్వులపాలవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ మధ్యకాలంలో అనిశా దాడుల్లో పట్టుబడ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

సంతృప్తి ముఖ్యం..

నడుచుకుంటూ వెళ్తున్నామని కాదు.. కాళ్లు లేక నడవలేకపోతున్నవారిని చూసి మన అదృష్టానికి ఆనందించాలి. సైకిల్‌పై వెళ్తున్న వారు కాలినడకన పోతున్న వారిని చూసి సంతృప్తి పడాలి. సైకిల్‌మోటారుపై వెళ్తున్న వారు సైకిల్‌పై వెళ్లే వారికన్నా మనం నయమనుకోవాలి. కారులో ప్రయాణించే వారు ద్విచక్రవాహనదారున్ని చూసి వాళ్లకన్నా మనం మంచి స్థితిలో ఉన్నామన్న విషయాన్ని గమనించాలి. అయితే.. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లాలనుకోవడంలో తప్పులేదు. అందుకు సక్రమమైన మార్గాన్ని ఎంచుకోవాలి. నిజాయతీగా, ధర్మబద్ధంగా సంపాదించిన సొమ్ముతో ఎదిగే ప్రయత్నం చేయాలి. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎదుగుదలంతా పారదర్శకంగా ఉందనిపించాలి. అంతే తప్ప ఆకాశమంత ఎదగాలని అవినీతితో మెట్లు కడితే అవి కూలిపోకతప్పదు. మనం బోర్లాపడక తప్పదు.

పనిచేసే వారికీ చెడ్డపేరు..

ప్రభుత్వ ఉద్యోగం.. నెల తిరిగేసరికి చక్కని వేతనం.. బాదరబందీ లేని జీవితం.. ఇలాంటి స్థితిలో ఉద్యోగులెవరైనా సంతృప్తిగా బతకొచ్చు. కానీ ఎందుకో కొంతమందికి అది సరిపోవడం లేదు. అన్నం బదులుగా డబ్బులే తినేస్తున్నారా అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రతి చిన్నపనికీ ఎంతోకొంత ఆశపడుతున్నారు. ఎదుటి వ్యక్తులను పీడిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరైనా అవినీతి నిరోధక శాఖకు చిక్కినప్పుడల్లా సామాన్యులు ఇలా మండిపడుతున్నారు. కాలానుగుణంగా వేతనాలు పెరిగినా, కొందరు చేస్తున్న అవినీతి మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొస్తోంది. ఫలితంగా అక్కడక్కడా నీతి నిజాయతీలతో పనిచేసే ప్రభుత్వోద్యోగులు సైతం లంచావతారుల మూలంగా మాటలు పడాల్సి వస్తోంది.

ప్రతిభతో వచ్చి.. తల దించుకోవాలా..

  • ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేసిన ఓ ఎస్సై గతంలో అనిశాకు చిక్కారు. కొద్దిరోజుల తర్వాత అందరూ ఆ విషయం మర్చిపోయారు. అయితే.. ఆయన బ్యాచ్‌కు చెందిన వారంతా సీఐలుగా పదోన్నతి పొందినా, ఆయనకు మాత్రం రాలేదు. కారణం.. అనిశాకు చిక్కిన సందర్భంలో జతకూడిన సర్వీస్‌ రిమార్క్‌. ఈ కారణంగానే.. ఆయనకన్నా తక్కువ వయసున్న వారూ పైఅధికారులుగా వస్తున్నా అతడు మాత్రం ఇంకా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వెలితి జీవితకాలమంతా ఉంటుంది. పనిచేసే సమయంలో కక్కుర్తిగా వ్యవహరించకుండా నిజాయతీగా ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా.

పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం రావడమంటే మాటలు కాదు. ఎంతో ప్రతిభ ఉండాలి. పోటీ పరీక్షల్లో ఎందరినో వెనక్కినెడితే కానీ ఉద్యోగం రాదు. అది సాధిస్తే చాలా గర్వంగా ఉంటుంది. దాన్ని కాపాడుకోవాలి. ఉద్యోగంలోకి వచ్చాక వేతనంతో సంతృప్తి పడకపోతే, ఆయాచితంగా వస్తుంది కదా అని అవినీతికి అలవాటు పడితే కడుపుమండిన వారిలో ఎవరో ఒకరు భరతం పట్టిస్తారు. అనిశాకు చిక్కిస్తారు. అప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా కుటుంబానికి, బంధువులకు అందరికీ తలవంపులు తెచ్చే బదులు న్యాయంగా వచ్చే వేతనంతో బతకలేమా అనే కోణంలో ఆలోచించినా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవు.


యువ‘తరమే’ అధికం..

ఈ మధ్యకాలంలో చోటుచేసుకుంటున్న అనిశా దాడుల్లో పట్టుబడుతున్న వారిలో యువతరం అధికంగా ఉండటం గమనార్హం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు ఎస్సైలు, ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ఉద్యోగి, రెవెన్యూ అధికారి.. ఇలా ఉద్యోగ జీవితం కొత్తగా ప్రారంభించిన తొలినాళ్లలో వారే కావడం గమనార్హం. అక్రమమార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఉద్యోగ జీవితాన్ని దెబ్బతీసుకుంటున్నారు. తర్వాత బదిలీలు, పదోన్నతులు వచ్చినా ఇప్పుడు వచ్చిన చెడ్డపేరు మాత్రం దూరం కాదు కదా. కొత్త ప్రదేశంలోనూ వారిని అదేరీతిలో గుర్తిస్తారు. హోదా, అధికారం ఉన్నా.. దక్కాల్సినంత గౌరవం దక్కదు.


కలాంలా ఆలోచించాలి..

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను అభిమానించని వారుండరు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవితంలోని ఓ సంఘటన మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆగస్టు 2014లో తమిళనాడులోని ఈరోడ్‌లో పుస్తక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో కలాం పాల్గొన్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతుంటే సౌభాగ్య గ్రైండరు ఉత్పాదక సంస్థ తరఫున గ్రైండరును కానుకగా ఇస్తే తిరస్కరించారు. ధర చెల్లిస్తానంటే నిరాకరించిన సంస్థ నిర్వాహకులు అభిమానంతో బలవంతంగా అందించారు. కొద్ది రోజుల తర్వాత కలాం కార్యాలయం నుంచి ఆ సంస్థకు రూ.4850 చెక్కు అందింది. కలాం సంతకం చేసిన చెక్కు కావడంతో వారు భద్రంగా దాచుకున్నారు. అయితే.. చెక్కు నగదుగా మార్చుకోకుంటే గ్రైండర్‌ తిప్పి పంపిస్తామని కార్యాలయం నుంచి ఫోన్‌చేసి చెప్పడంతో వారు చెక్కు నకలును దాచుకొని, అసలు దాన్ని నగదుగా మార్చుకున్నారు. సంస్థ ఎండీ ఆదికేశవ్‌ ఓ సందర్భంలో ఈ విషయం స్వయంగా వెల్లడించారు. చాలా మంది డబ్బుతో పాటు లంచంగా కానుకలనూ కోరుతున్న వారు కలాం కచ్చితత్వాన్ని గుర్తు చేసుకుంటే మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని