logo

అనర్హులకు అందలం..!

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

Published : 19 May 2024 03:00 IST

డిగ్రీ పరీక్షల్లో ఇష్టారీతిన ఇన్విజిలేషన్‌ బాధ్యతలు

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థుల ప్రతిభాపాటవాలను వెలికితీయాల్సిన పరీక్షల్లో పారదర్శకత లోపిస్తోంది. కొన్ని యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. సరైన అర్హత లేకపోయినా ఇన్విజిలేషన్‌ విధులను కేటాయిస్తూ మొక్కుబడి తంతుగా మారుస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ తతంగం యథేచ్ఛగా సాగిపోతోంది.

నిబంధనలేంటంటే..

ఏపీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ప్రాక్టీస్‌ అండ్‌ అన్‌ఫెయిర్‌మీన్స్‌ యాక్ట్‌-1997 ప్రకారం.. పరీక్షల్లో ఇన్విజిలేషన్‌ విధులు నిర్వహించేందుకు కొన్ని నిబంధనలున్నాయి. సదరు కళాశాలలో పనిచేసే అధ్యాపకులు మాత్రమే వీటిని నిర్వర్తించాలి. ఒకవేళ చాలినంత మంది అందుబాటులో లేకపోతే సర్దుబాటు కోసం ఉన్నతాధికారుల అనుమతితో పరీక్ష కేంద్రం లేని కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు విధులు కేటాయించాలి. ఇందుకోసం సదరు కళాశాల ప్రిన్సిపల్‌కు రాతపూర్వకంగా సమాచారం అందించాలి. అనంతరం ఆ అధ్యాపకులు తాము పనిచేసే కళాశాలలో విధుల నుంచి రిలీవై, పరీక్షకేంద్రంలో రిపోర్ట్‌ చేయాలి. అలా కూడా అందుబాటులో లేకపోతే.. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవచ్చు. అదీ మండల విద్యాధికారి అనుమతితో. ఇదీ కుదరకపోతే స్థానికంగా ఉండే పోలీసు ఉద్యోగులను నియమించుకునే వెసులుబాటుంది. ఇదంతా పక్కాగా జరగాలి. కానీ, చాలాచోట్ల ఇదేమీ కనిపించడం లేదు. అధ్యాపకులుగా పనిచేయని వారిని, ప్రభుత్వ ఉద్యోగులు కానివారిని, పూర్వ విద్యార్థులను ఎడాపెడా నియమించుకుంటున్నారు. ఫలితంగా కట్టుదిట్టంగా జరగాల్సిన పరీక్షలను తూతూమంత్రంగా కొనసాగిస్తూ అపహాస్యం చేస్తున్నారు.

బాధ్యులెవరు.. చర్యలెవరిపై..?

ప్రభుత్వ ఉద్యోగులు, కళాశాలలో పనిచేసే అధ్యాపకులు ఎవరైనా ఇన్విజిలేషన్‌ విధుల్లో పొరపాట్లు చేసినా, ఏవైనా అవకతవకలకు పాల్పడినా వారిని బాధ్యులు చేయొచ్చు. ఉద్యోగం తొలగింపు, వేతనం నిలుపుదల, సస్పెన్షన్, జైలుశిక్ష లాంటి తదితర చర్యలు తీసుకునే అవకాశముంది. కానీ, ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు విధులను అప్పగించడం వల్ల పరీక్షలు పారదర్శకతను కోల్పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బయటి వ్యక్తులపై చర్యలు తీసుకోవడం అంతగా కుదరని పని. అంతలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అదే సమయంలో మాల్‌ప్రాక్టీస్‌ను ప్రోత్సహించడం, పేపర్‌ లీక్‌ చేయడం, అసలు విద్యార్థులు కాకుండా ఇతరులతో పరీక్షలు రాయించడం వంటి దుశ్చర్యలకు పాల్పడేందుకు అవకాశాలుంటాయి. ఇది వారి వ్యక్తిగతంగానే కాకుండా కళాశాల యాజమాన్యాలకూ అన్నివిధాలా ప్రయోజనం చేకూరుతోంది. అదే సమయంలో ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. కోరుకున్నచోట పరీక్ష కేంద్రాలు కేటాయించడం, జంబ్లింగ్‌ విధానం పూర్తిస్థాయిలో అమలుచేయకపోవడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. అనర్హులకు విధులు కేటాయించడం వల్ల కళాశాల యాజమాన్యాల మధ్య జరిగే అంతర్లీన ఒప్పందాలకు అనుగుణంగా పనిచేసేందుకు ఆస్కారమెక్కువ.

తనిఖీలేవీ..!

ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులొస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన విశ్వవిద్యాలయ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, రూట్‌ అధికారులు పరీక్ష కేంద్రాలను అప్పుడప్పుడూ సందర్శిస్తున్నా.. పరీక్షలు జరుగుతున్నాయా లేదా అనేదానిపైనే దృష్టిసారిస్తున్నారు. అక్కడ ఇన్విజిలేషన్‌ విధులు నిర్వహిస్తున్నది సరైన వారేనా, అర్హత ఉందా లేదా అనే విషయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పరీక్షల నియంత్రణాధికారి, అదనపు నియంత్రణాధికారి స్థాయి కల్గిన అధికారులు క్షేత్రస్థాయిలో రికార్డులు పరిశీలించడం లేదని, ఈ అంశాలేవీ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రతీ పరీక్ష కేంద్రాన్ని విధిగా పూర్తిస్థాయిలో తనిఖీ చేయాల్సి ఉన్నా అది నామమాత్రమవుతోంది. ఫలితంగానే ఈ విధానానికి నియంత్రణ కరవైంది. పరీక్ష పూర్తయితే చాలు, ఎవరు విధులు నిర్వహిస్తే ఏంటనే భావనతోనే వారు నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నారనే వాదనలూ లేకపోలేదు. వసతులు పరిశీలించకుండా, పరీక్ష కేంద్రాలను ఇష్టారీతిన కేటాయిస్తూ, యాజమాన్యాల ప్రయోజనాలకు సహకరిస్తుండటంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందనే ఆరోపణలున్నాయి. పకడ్బందీగా నిర్వహిస్తూ, ప్రతిభగల విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాల్సిన అధికారులు ఇకనైనా తమ పనితీరు మార్చుకుంటారో లేదో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని