logo

జగన్‌ జమానాలో నైపుణ్యం లేదు.. నయవంచనే!

ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి.

Published : 30 Apr 2024 03:27 IST

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను నిర్వీర్యం చేసిన వైకాపా
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత చిత్తు
ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, పాడేరు/పట్టణం, రంపచోడవరం, అచ్యుతాపురం

ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి. యువతలో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసి వారికి శాశ్వతమైన స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య కేంద్రాలుగా మారిపోయాయి. నిధుల లేమి, సరైన పర్యవేక్షణ లేక వెలవెలబోతున్నాయి.

నాడు..

తెదేపా పాలనలో యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.. వారి ఆసక్తి చూపిన రంగాల్లో నైపుణ్యం కల్పించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో (సెజ్‌) రూ. 110 కోట్లతో అత్యాధునిక వసతులు, యంత్రాలతో 20 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు చూపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్లు (వైటీసీ) ఏర్పాటు చేసి గిరిజన యువతలో నైపుణ్యాన్ని వెలికితీశారు. వాటికి అదనంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధిని చూపించారు. అవకాశాలు దక్కని యువతకు నిరుద్యోగ భృతిని అందించి ఆర్థికంగా ఆదుకున్నారు.

నేడు..

వైకాపా పాలనలో యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాలకు స్కిల్‌ హబ్‌లుగా పేరుమార్చారు. నిధులివ్వకుండా మొక్కుబడి శిక్షణలతో మమ అనిపించేశారు. ఏజెన్సీలో వైటీసీలను ఇతర శాఖలకు అప్పగించేసి యువజన శిక్షణా కేంద్రాలను నిర్వీర్యం చేసేశారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు లేవు.. ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి లేక నైరాశ్యంలో చిక్కుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో గంజాయి, మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతూ పక్కదారి పడుతున్నారు.

ఏటా పాడేరు మన్యం 11 మండలాల నుంచి 3 వేలమందికి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకుని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ పని చేసింది.

రంపచోడవరం నైపుణ్య శిక్షణ కేంద్రం (వైటీసీ)

ముందుచూపంటే ఇదీ..

2014లో రాష్ట్ర విభజన జరిగింది. అప్పటివరకు హైదరాబాద్‌ కేంద్రంగా ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ కేంద్రం ఉండేది. విభజన తర్వాత ఆంధ్రాలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అచ్యుతాపురంలో ఏర్పాటు చేయించారు. కంపెనీలకు ఎటువంటి కార్మికులు, ఉద్యోగులు కావాలో తెలుసుకొని వారి ఆలోచనలకు అనుగుణంగా యువత మెదడు పదునెక్కించే శిక్షణ అందిస్తోంది. ఈ కేంద్రాన్ని ఉపయోగించుకుని వేలాది మంది స్థానికంగానే ఉపాధి అవకాశాలు పొందారు. నాడు ఈ కేంద్రం ఏర్పాటు చేయకుంటే ఇక్కడ యువత పొట్ట చేతపట్టుకుని వలసలు పోయే పరిస్థితి వచ్చేది.

నయవంచన అంటే ఇదీ..

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అంటూ యువతను ఆశలపల్లకీ ఎక్కించారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగ ప్రకటనలకు మంగళం పాడేసి యువత రెక్కలు విరిచేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను కూడా సక్రమంగా నడపలేక వైకాపా సర్కారు చేతులేత్తేసింది. ఏజెన్సీలోని వైటీసీ కేంద్రాలు వేర్వేరు శాఖలకు ఇచ్చేసింది. పాడేరు వైటీసీని కలెక్టరేట్‌కు, పెదబయలు వైటీసీని ఏకలవ్య పాఠశాలకు, అరకులోయ వైటీసీని క్రీడా పాఠశాలకు, చింతపల్లి వైటీసీని మరోక శాఖకు అప్పగించేశారు. రంపచోడరం డివిజన్‌లో పలు వైటీసీ కేంద్రాలు మూతపడ్డాయి. తెదేపా హయాంలో శిక్షణ ఇచ్చిన సంస్థలు, భోజనం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు రూ.లక్షలు నేటికి బకాయిలు చెల్లించలేదు. సీమెన్స్‌ సంస్థ అందించిన సాఫ్ట్‌వేర్‌, పరికరాలనే ఉపయోగించుకుంటూ స్కిల్‌ హబ్‌గా పేరుమార్చి శిక్షణలిస్తోంది.  ఆయా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందిని జీతభత్యాలివ్వకుండా తొలగించేశారు. మొత్తంగా నిరుద్యోగ యువతను నయవంచనకు గురిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని