logo

ప్రాణాంతక వ్యాధులపై ఇంటింటి సర్వే

ప్రాణాంతక వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

Published : 19 May 2024 01:46 IST

రోగులకు బీపీ పరీక్షలు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ప్రాణాంతక వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అంటువ్యాధులు కాని (ఎన్‌సీడీ) రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ రోగులను గుర్తించి, వాటిని అదుపులో ఉంచడమే ధ్యేయంగా ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ వ్యాధులు ఉన్న వారికి పరీక్షలు చేపట్టేందుకు వైద్యారోగ్య శాఖ ఇంటింటి సర్వే నిర్వహించనుంది. దీనిపై ఇప్పటికే ఆ శాఖ అధికారులు సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో ఎక్కువగా అతిసారం, అమ్మవారు (చికెన్‌ఫాక్స్‌) తదితర వ్యాధులతో జనం ప్రాణాలు కోల్పోయేవారు. ప్రస్తుతం మారిన ప్రజల జీవనశైలితో బీపీ, సుగర్‌ వంటి వ్యాధులు సర్వసాధారణమవుతున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, మెదడు స్ట్రోక్, పక్షవాతం వంటి వాటితో ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధులను అదుపులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇంటింటి సర్వేతో ఈ రోగాలు ఉన్న వారిని గుర్తించాలని నిర్ణయించారు.

30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి...

జిల్లావ్యాప్తంగా 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. మే నెల 17, ప్రపంచ రక్తపోటు (బీపీ) అవగాహన దినం నేపథ్యం సైతం ఈ కార్యక్రమానికి ఊతమిస్తోంది. దీనిలో భాగంగా ఉన్నతాధికారులు, సిబ్బంది అంతా ఈ పరీక్షలు పూర్తి చేసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉన్నతాధికారులు గూగుల్‌ సమావేశాల ద్వారా దీనిని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలిస్తున్నారు.
 ఈ నెల 28న సిబ్బందికి శిక్షణ: అసంక్రమణ వ్యాధుల గుర్తింపు కార్యక్రమంపై ఈ నెల 28న ఏఎన్‌ఎం, తదితర ఆరోగ్య సిబ్బందికి శిక్షణ తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి ఉన్నతాధికారులు గూగుల్‌ సమావేశాలు చేపట్టి అందరినీ ముందస్తుగా సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే వెలువడనున్న మార్గదర్శకాల ప్రకారం ఇంటింటి సర్వే ప్రారంభించనున్నారు. తరవాత గుర్తించిన రోగులకు ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందించి, వ్యాధులు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

డాక్టర్‌ వీరజ్యోతి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, నర్సీపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని