logo

రగులుతున్న.. అసంతృప్తి ..!

వైకాపాలో ఇవన్నీ బయటకు కనిపించే విభేదాలు. కానీ అంతర్గతంగా కుమిలిపోతున్న కార్యకర్తలు, నాయకులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్నారు. ఉయ్యూరు జడ్పీటీసీ సభ్యురాలు యలమంచిలి పూర్ణిమ రాజీనామాతో అంతర్గతపోరు ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది.

Updated : 17 Aug 2022 09:42 IST

గన్నవరంలో నిత్యం అసమ్మతి రాగాలాపన..
మైలవరంలో మట్టితవ్వకాల కుమ్ములాటలు..
నందిగామలో కౌన్సిలర్లందరూ వేరు కుంపటి
విజయవాడ పశ్చిమలో మాజీ మంత్రికి వ్యతిరేక సమావేశం..
బెజవాడ సెంట్రల్‌లో ముగ్గురు కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధం..
బందరులో ఎంపీ బాలశౌరిని అడ్డగించిన మాజీ మంత్రి పేర్ని అనుచరులు..
ఈనాడు, అమరావతి

నందిగామ పురపాలక సంఘంలో ఒకేసారి కౌన్సిలర్లందరూ బాయ్‌కాట్‌ చేసి వేరు కుంపటి పెట్టారు. తమకు పనులు అప్పగించడం లేదని ప్రధాన ఆరోపణ. మొదట్లో ఎమ్మెల్యేకు, ఛైర్‌పర్సన్‌కు మధ్య పొసగలేదు. కౌన్సిలర్ల తిరుగుబాటు తర్వాత పార్టీ జోక్యంతో సద్దుమణిగింది.


విజయవాడ తూర్పులో నేతల మధ్య సఖ్యత లేదు. ఇంచార్జిగా దేవినేని అవినాష్‌ ఉండగా నగర అధ్యక్షుడిగా భవకుమార్‌ వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి వర్గాల మధ్య డివిజన్లలో ఆధిపత్య పోరు నడుస్తోంది.


గన్నవరం నిత్యం అసంతృప్తి రగిలే జ్వాల. తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ వైకాపాలో చేరడంతో ఇక్కడ రగడ ప్రారంభమైంది.  యార్లగడ్డ వెంకట్రావ్‌, దుట్టా రామచంద్రరావు మరో వర్గంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పలుసార్లు సీఎం దగ్గరకి పంచాయతీ చేరినా.. పరిష్కారం మాత్రం కనుగొనలేదు.


వైకాపాలో ఇవన్నీ బయటకు కనిపించే విభేదాలు. కానీ అంతర్గతంగా కుమిలిపోతున్న కార్యకర్తలు, నాయకులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్నారు. ఉయ్యూరు జడ్పీటీసీ సభ్యురాలు యలమంచిలి పూర్ణిమ రాజీనామాతో అంతర్గతపోరు ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. పనిచేసే వారికి పార్టీ, ప్రభుత్వంలో విలువ ఇవ్వకపోవడం, అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలదే పెత్తనం... తదితర కారణాలతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇంకా రెండేళ్లు అధికారం ఉండటంతో మౌనంగా భరించాల్సి వస్తోందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఉయ్యూరు జడ్పీటీసీ రాజీనామా పార్టీలో చర్చనీయాంశమైంది. పూర్ణిమ భర్త కోటయ్యచౌదరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వైకాపాలో పార్థసారథి వెంట నడిచారు. ఆ గ్రామంలో ఆయన కుటుంబం మాత్రమే వైకాపాలో ఉంది. ప్రత్యర్థులు తమసామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేశారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో అధిష్టానం దృష్టికి వెళ్లిన సమస్యలు పరిష్కరిస్తున్నారు. కొన్ని జిల్లాకే పరిమితం అవుతున్నా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది.

మట్టి తవ్వకాల్లో ఆధిపత్యం..!

మైలవరం నియోజకవర్గంలో మట్టి తవ్వకాల్లో వైకాపా కార్యకర్తల మధ్య బాహాబాహీ జరిగింది. వెల్వడంలో  రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అనుచరులు మట్టి  తవ్వకాల ద్వారా రూ.లక్షలు ఆర్జించారని, పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించారని నిరసన వ్యక్తం చేశారు. జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లోనూ మట్టి తవ్వకాలుపైనే గ్రామాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇబ్రహీపంట్నం కొండపల్లి నగరపంచాయతీ ఎన్నిక విషయంలోనూ ఎమ్మెల్యే, ప్రత్యర్థి వర్గానికి విభేదాలు పొడచూపాయి. ఇక్కడ మంత్రి జోగి రమేష్‌ సోదరుడు అంతర్గతంగా ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనేది పార్టీలో ఆరోపణ.

* జగ్గయ్యపేటలో రేషన్‌ బియ్యం, ఇసుక విక్రయాల్లో ఆధిపత్యం నడుస్తోంది. ఇక్కడ షాడో ఎమ్మెల్యేదే ఆధిపత్యం. దీంతో కొంతమంది కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.

* విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఏకంగా ముగ్గురు కార్పొరేటర్లు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడ్డారు. ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటున్నారని, కనీసం అక్రమ కట్టడాల మామూళ్లు రావడం లేదని బహిరంగంగా గళం విప్పడం చర్చనీయాంశమైంది. డివిజన్లలో పనులు తమకు ఇవ్వడం లేదని ఆరోపణలకు దిగారు.  

* పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ భాజపా నుంచి వైకాపాలోకి చేరిన విషయం తెలిసిందే. వైకాపా ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ తెదేపాలో చేరారు. అనంతరం పరిణామాల్లో వెల్లంపల్లి మంత్రి అయ్యారు. మంత్రి హయాంలో అసలైన వైకాపా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని నిరసన సమావేశం పెట్టి గళం విప్పారు. కొంతమంది కార్పొరేటర్లలోనూ అసంతృప్తి రగులుతోంది.

* కంకిపాడులోనూ జడ్పీటీసీ, ఎంపీపీకి మధ్య పొసగడం లేదు.

* బందరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్‌ ఎంపీ మధ్య విభేదాలు ఇటీవల వెలుగు చూశాయి. కొంమతందిపై పోలీసు కేసు వరకు వెళ్లింది.

* పెడనలో మంత్రి జోగిరమేష్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక మామ ఉప్పాల రాంప్రసాద్‌కు మధ్య విభేదాలు బహిరంగమే. గత సాధారణ ఎన్నికల నుంచి ఇవి కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని