logo

హక్కు చట్టంతో.. ఆస్తులకు కాళ్లొస్తాయ్‌!

దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనివిధంగా... ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. తాజాగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారు.

Updated : 04 May 2024 05:04 IST

వైకాపా సర్కారు నిర్ణయాలతో అన్ని వర్గాల్లో ఆందోళన
కొనుగోలుదారులకు జిరాక్స్‌ కాపీలే దిక్కు
భీమవరం పట్టణం, న్యూస్‌టుడే

దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనివిధంగా... ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. తాజాగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు స్థలం కొనుగోలు సమయంలో ఒరిజినల్‌ పత్రాలుండేవి. ఇకపై కేవలం జిరాక్స్‌ పత్రాలు మాత్రమే ఇవ్వనున్నారు. అదీకూడా ఆర్‌.ఎస్‌.నంబరు ఉంటేనే రిజిస్ట్రేషన్‌ అవుతుంది. లేకపోతే ఆ భూమిపై యజమాని హక్కు కోల్పోయినట్లే. ఇలాంటి ఆంధ్రప్రదేశ్‌ భూహక్కుల చట్టం-2022తో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇకపై ఎంపిక చేసిన సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు కేవలం జిరాక్స్‌ కాపీలు మాత్రమే ఇచ్చేలా వైకాపా ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. తద్వారా సొంత ఆస్తులపై యజమాని హక్కుల్లేకుండా చేసింది. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని గత కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేసినా... ఫలితం లేకుండా పోతోంది. తమ ఆస్తులపై యజమాని హక్కును హరించేలా చట్టాన్ని రూపొందించడంపై అన్నివర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

నాడు

గతంలో తమ భూహక్కులకు సంబంధించి ఏవైనా వివాదాలు రేగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. న్యాయస్థానాలు వాదోపవాదాలు విని... నిజమైన యజమానులకు న్యాయం చేసేవి. ఒకవేళ తీర్పు ఆలస్యమైనా యజమానికి ఇబ్బంది ఉండేది కాదు.

నేడు

భూహక్కుల అభ్యంతరాలను రిజిష్టర్‌లో నమోదైన రెండేళ్లలోపు మాత్రమే గుర్తించాలి. తమ ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేశారో లేదో యజమానులు కార్యాలయానికి వెళ్లి తెలుసుకోవాలి. అందులో అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు వ్యక్తం చేయాలి. లేదంటే వాటిని ప్రభుత్వం ఎవరిపేరున రిజిస్ట్రేషన్‌ చేస్తుందో వారికే చెందుతుంది.

నిరసన దీక్ష శిబిరంలో పాల్గొన్న న్యాయవాదులు (పాతచిత్రం)

ప్రదక్షిణలు చేయాల్సిందే...

రాష్ట్ర ప్రభుత్వం నియమించే ల్యాండ్‌ టైటిలింగ్‌ అధికారికి భూములు, ఆస్తుల వివరాలు నమోదుచేసే హక్కు ఉంటుంది. రిజిష్టర్‌లో ఒక్కసారి భూహక్కుదారుని పేరు నమోదైతే వాటిపై న్యాయస్థానానికి వెళ్లేందుకు అవకాశముండదు. ఏవైనా అభ్యంతరాలుంటే జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసే జిల్లా ట్రిబ్యునల్‌లో మాత్రమే తేల్చుకోవాలి. అక్కడ న్యాయం జరగకపోతే తీర్పు వచ్చిన 15 రోజుల్లోపు రాష్ట్రస్థాయి ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చు. అక్కడా సమస్య పరిష్కారం కాకుంటే హైకోర్టులో భూహక్కును నిర్ధారించుకోవచ్చు.

హక్కు కోల్పోయినట్లే

ప్రశ్నించే హక్కులేకుండా చేసేందుకు వైకాపా ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. భూహక్కుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా చేసిన నల్లచట్టమిది. ఇలాంటి చట్టం దేశంలో ఎక్కడా లేదు. భూమిపై హక్కును కోల్పోయే ప్రమాదమున్న ఈ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకించాలి. 

ఎం.వి.రమణరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, భీమవరం

ఏకపక్ష నిర్ణయమిది

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును తక్షణం రద్దు చేయాలి. రెవెన్యూ అధికారుల పరిధిలో కాకుండా పాత విధానమైన సివిల్‌ కోర్టులోనే భూవివాద కేసులు పరిష్కరించేలా చూడాలి.

పాకా రమేష్‌, బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, భీమవరం

చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి

కొత్త చట్టంతో కొద్దిపాటి ఆస్తిని సైతం కోల్పోయే ప్రమాదముంది. ఈ చట్టంతో తాతముత్తాత కాలం నుంచి కొనసాగుతున్న భూ హక్కును కోల్పోయే అవకాశముంది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలి.

చెల్లబోయిన రంగారావు, ఐ.ఎ.ఎల్‌.జిల్లా అధ్యక్షుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని