ఘట్‌కేసర్‌ వైపు.. బడ్జెట్‌కు తగ్గట్టు

హైదరాబాద్‌కి తూర్పు వైపు ఉన్న పోచారం, ఘట్‌కేసర్‌ ప్రాంతాలు గృహ నివాసాలకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ కార్యాలయాల అతి పెద్ద క్యాంపస్‌ ఉంది.

Updated : 04 May 2024 10:33 IST

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌కి తూర్పు వైపు ఉన్న పోచారం, ఘట్‌కేసర్‌ ప్రాంతాలు గృహ నివాసాలకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ కార్యాలయాల అతి పెద్ద క్యాంపస్‌ ఉంది. సంస్కృతి టౌన్‌షిప్‌ కొన్నేళ్ల క్రితం ఏర్పాటైంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలు వెలుస్తున్నాయి. వ్యక్తిగత గృహాలు నిర్మించుకుంటున్నారు. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఔటర్‌ లోపల అనువైన ప్రాంతాల్లో పోచారం, ఘట్‌కేసర్‌ ఒకటిగా ఉన్నాయి. నగరం విస్తరించడంతో మున్సిపాలిటీగా మారడం, ఎక్స్‌ప్రెస్‌ వే వస్తుండటం, మాస్టర్‌ ప్లాన్‌లో వంద అడుగుల రహదారి నిర్మాణం పూర్తి కావడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది.

  • మెట్రోతో ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, మియాపూర్‌ చుట్టుపక్కల ప్రాంతాలు నివాస అనుకూలంగా మారాయి. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌ వే వంతు వచ్చింది. ప్రస్తుతం ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు 6.2 కి.మీ ఎక్స్‌ప్రెస్‌ వే పనులు జరుగుతున్నాయి. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్‌ వరకు ఉన్న 11.6 కి.మీ ఎక్స్‌ప్రెస్‌ వే తర్వాత ఇదే రెండో అతి పెద్దది. వరంగల్‌, యాదాద్రి ఔటర్‌ నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్‌ రద్దీ లేకుండా సిటీలోకి వెళ్లేందుకు ఆరు వరుసల పైవంతెన కడుతున్నారు. వరంగల్‌ జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తిచేశారు. పైవంతెన రాకతో పోచారం చుట్టుపక్కల ప్రాంతాలకు ఎక్కువ మేలు జరగనుంది. పైవంతెన దిగగానే పోచారం వస్తుంది. పది నిమిషాల వ్యవధిలో ఉప్పల్‌ చేరుకోవచ్చు. పోచారం, నారపల్లి, చౌదరిగూడ, జోడిమెట్ల, అన్నోజిగూడ, ఘట్‌కేసర్‌, శివారెడ్డిగూడ, యంనంపేట, ప్రాంతాలకు మరింత డిమాండ్‌ పెరుగుతుందని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు.

ఏం ఉన్నాయంటే..

  • అన్నింటికి మించి ఇల్లు కొనేవారు చుట్టుపక్కల పాఠశాలలు ఎక్కడ ఉన్నాయని చూస్తుంటారు. పేరున్న పలు పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి.
  • షాపింగ్‌, వినోదం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాతీయ రహదారి పక్కనే అన్నోజిగూడ ప్రాంతాల్లో రిటైల్‌మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. కొత్తవి కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, డ్రైవ్‌ ఇన్‌లు, ప్రైవేటు క్రీడా మైదానాలు ఉన్నాయి.
  • నీటి వసతి మెరుగు పర్చేందుకు ప్రభుత్వం పనులు చేపట్టింది.
  • నారపల్లిలో నందవనం పార్కు ఉంది.
  • ఘట్‌కేసర్‌ వరకు ఎంఎంటీఎస్‌ రైలు అందుబాటులో ఉంది.

అందుబాటులో..

ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల నివాసాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులు సైతం చేపడుతున్నారు. విల్లాలు కడుతున్నారు. రూ.3 కోట్ల వరకు విల్లాల ధరలు పలుకుతున్నాయి. విస్తీర్ణాన్ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి. అపార్ట్‌మెంట్లలో ఫ్లాటు రూ.70 లక్షల నుంచి దొరుకుతున్నాయి. చదరపు అడుగు రూ.5000లకు కొంత అటుఇటుగా విక్రయిస్తున్నారు. వ్యక్తిగత ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన రహదారి నుంచి లోపలికి వెళ్లేకొద్దీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. చదరపు గజం రూ.25 వేల నుంచి రూ.40 వేల మధ్య చెబుతున్నారు. ప్రధాన రహదారికి చేరువగా వచ్చే కొద్దీ ధరలు ఎక్కువగా ఉన్నాయి. లోపలికి వెళితే ధర కొంత తక్కువకు దొరుకుతాయి. చాలావరకు గ్రామ పంచాయతీ లేఅవుట్లకు సంబంధించిన ఇంటి స్థలాలు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉందా? లేదా? ఆ మార్గంలో మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదిత 100 అడుగుల రహదారి ఏమైనా ఉందా? అనేది చూసుకోవాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని