logo

‘పోతిన మహేశ్‌ అక్రమాల పుట్ట’

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను విమర్శించే అర్హత పోతిన మహేశ్‌కు లేదని, హద్దుమీరితే అతని అక్రమాలను వెలికితీస్తామని జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు.

Published : 22 Apr 2024 05:10 IST

భవానీపురం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను విమర్శించే అర్హత పోతిన మహేశ్‌కు లేదని, హద్దుమీరితే అతని అక్రమాలను వెలికితీస్తామని జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు. భవానీపురంలోని ఓ కల్యాణమండపంలో విలేకరుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. వాసు మాట్లాడుతూ పోతిన మహేశ్‌ అధ్యాపకుడిగా పనిచేసే సమయంలో అతడి జీతం రూ.5వేలు మాత్రమేనని, అతడు ఏవిధంగా జనసేన పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడన్నారు. కీర్తిరాయినిగూడెం, బుడమేరు వద్ద ఏవిధంగా అక్రమాలకు పాల్పడ్డారో కరపత్రాల రూపంలో వెల్లడిస్తామన్నారు. బుడమేరును పూడ్చి కబ్జా చేశారన్నారు. స్థలాల డబుల్‌ రిజిస్ట్రేషన్లు అనేకం చేసినట్లుగా ఆరోపించారు. శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు అవినీతి గురించి మహేశ్‌కే ఎక్కువ తెలుసని, ఐదేళ్లుగా అతడి గురించి విలేకరుల సమావేశాలు పెట్టి విమర్శించారన్నారు. ఇప్పుడు వైకాపాలో చేరగానే పునీతుడు అయిపోయాడా అని విమర్శించారు. జనసేన పార్టీలో ఉంటూ వైకాపా కోవర్టుగా పని చేశారని ఆరోపించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలిపించుకోలేకపోయారన్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాలు, ఆస్తుల గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, మున్ముందు ఆ విధంగా చేస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందన్నారు. జనసేన పార్టీ నాయకులు తిరుపతి అనూష, ఎం.విజయలక్ష్మి, బి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని