logo

వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..

భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి.

Published : 23 Apr 2024 06:26 IST

పట్టించుకోని వైకాపా ఎమ్మెల్యే
 కలగానే ఆరోగ్య కేంద్రం

కోళ్లఫారం రోడ్డులో  అధ్వానంగా నిలిచిన డ్రెయిన్‌ నిర్మాణం, బాలభాస్కర్‌ నగర్‌లో రహదారి కంటే ఎత్తుగా నిర్మించిన కాలువ

భవానీపురం, న్యూస్‌టుడే: భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. కరకట్ట ప్రాంతాల్లోని నివాసాలను రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని హామీలు గుప్పించారు. తర్వాత హడావుడి తప్ప కార్యాచరణ లేదు. మరోవైపు 40వ డివిజన్‌ పరిధిలో కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. డ్రెయినేజీ వ్యవస్థ, రహదారులను అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదు. ఫలితంగా అధ్వానంగా మారాయి.

రిజిస్ట్రేషన్లు  ఎప్పుడు...

బాలభాస్కర్‌నగర్‌, అల్లుడుపేట, కరకట్ట ప్రాంతాల్లోని నివాసాలను రిజిస్ట్రేషన్లు చేయిస్తామని అధికార పార్టీ నాయకులు హామీలు గుప్పించారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న తమ సమస్య పరిష్కారానికి నోచుకుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంబరపడ్డారు. అయినా... అయిదేళ్లలో అడుగు పడలేదు. అలాగే నలభై గజాల స్థలాల్లో నివాసం ఉండే వారు న్యాయం కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. వారి స్థలాలు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఎన్నికల సమయంలో పాలకులు హామీలు గుప్పిస్తున్నారు తప్పితే పరిష్కరించటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

  • డివిజన్‌లోని బాలభాస్కర్‌నగర్‌, అల్లుడుపేటలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. అక్కడ చిన్నపాటి కాలువలు మాత్రమే ఉన్నాయి. కొన్నిచోట్ల మురుగునీరు వెళ్లే అవకాశం లేకపోవడంతో సిమెంటు రహదారులను సైతం తవ్వేశారు. ప్రధాన రహదారి వెంబడి కాలువలను ఎత్తుగా నిర్మించారు. చిన్నపాటి వర్షం వచ్చినా రహదారిపై మురుగునీరు నిలుస్తోంది.
  • తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది. లారీస్టాండులో ట్యాంకు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాగునీటి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. కోళ్లఫారం రోడ్డు, డాల్ఫిన్‌బార్‌ రోడ్డు, తదితర ప్రాంతాల్లో తాగునీరు కలుషితంగా వస్తోంది. అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోతుంది.

నిర్మాణానికి నోచుకోని  ఆరోగ్య కేంద్రం...

ప్రజల కోసం లారీ స్టాండులో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి గతంలో శంకుస్థాపన చేశారు. గట్టువెనుక ప్రాంతాల్లోని మహిళలకు సౌకర్యంగా ప్రసూతి కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఆరోగ్య కేంద్రం ఉంటుందని ప్రకటించారు. అయితే.. ఆరోగ్య కేంద్రం కొన్నేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. డివిజన్‌ పరిధిలో ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.


నివాసాలకు రిజిస్ట్రేషన్లు చేయించాలి - జి.సురేష్‌

బాలభాస్కర్‌ నగర్‌, అల్లుడుపేట ప్రాంతాల్లోని నివాసాలకు రిజిస్ట్రేషన్లు చేయిస్తామని శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. అధికారులను తీసుకువచ్చి చూపించారు. త్వరలోనే చేయిస్తామంటూ ప్రకటించారు. అయిదేళ్లు గడిచినా రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రస్తుతం ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. ఈ ప్రాంతంలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.


మురుగునీరు వస్తోంది - పి.రాము

నేను డాల్ఫిన్‌బార్‌ రోడ్డులో నివాసం ఉంటున్నా. మా వీధిలో కొన్నాళ్లుగా తాగునీటి పైపులైన్లలో మురుగునీరు వస్తోంది. నగరపాలక సంస్థ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. మురుగునీటి కారణంగా అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. తాగునీటి పైపులైన్ల లీకేజీ కారణంగానే మురుగునీరు వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని