logo

ఎత్తిపోతలూ ఎండగట్టారు

వైకాపా అయిదేళ్ల పాలనలో ఎత్తిపోతల పథకాలు మూలకు చేరాయి.  వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు విదల్చకపోవడంతో మూడేళ్లుగా పథకాలన్నీ మూతపడి లంక భూముల రైతులు గొల్లుమంటున్నారు.

Published : 28 Apr 2024 03:58 IST

అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యం
న్యూస్‌టుడే, అవనిగడ్డ

వైకాపా అయిదేళ్ల పాలనలో ఎత్తిపోతల పథకాలు మూలకు చేరాయి.  వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు విదల్చకపోవడంతో మూడేళ్లుగా పథకాలన్నీ మూతపడి లంక భూముల రైతులు గొల్లుమంటున్నారు. మామిడి, నిమ్మ, జామ వంటి తోటలకు బోర్లు వేసుకొని ఉప్పు నీటితో తడులు పెట్టుకుంటున్నారు. సముద్ర జలాలు ఆటుపోట్లకు చొచ్చుకురావడంతో లంక భూములు చౌడుబారిపోయి పంటలు పండడం లేదు. 1995వ సంవత్సరంలో తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో జిల్లా గ్రామీణాబివృద్ధి సంస్థ సహకారంతో రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి అవనిగడ్డ, పులిగడ్డ, బందలాయి చెరువు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. కొంత కాలం నడిచిన తర్వాత అప్పట్లో విద్యుత్తు బిల్లులు కట్టడం భారం కాగా అవనిగడ్డ, పులిగడ్డ పథకాలు మూత పడ్డాయి. బందలాయిచెరువు పథకం మాత్రం రైతుల ఐక్యతతో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత 2004లో వచ్చిన రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుద్దు ఇస్తున్నప్పుడు ఎత్తిపోతల పథకాలకు బిల్లులు ఏమిటని, వాటికి కూడా ఉచిత విద్యుద్దు సరఫరా చేయడంతో 2009లో వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఏపీఐడీసీ, నాబార్డు నిధులు సమకూర్చాయి. అప్పటి నుంచి ఈ పథకాలు పంట కాలువలోని మంచినీటిని లంక భూములకు అందిస్తున్నాయి. అవనిగడ్డ పథకం కింద 650 ఎకరాలు, పులిగడ్డ, అవనిగడ్డ పథకం కింద మరో 650 ఎకరాలు, బందలాయిచిచెరువు పథకం కింద 350 ఎకరాల లంక భూముల్లో సాగుకు మంచినీటిని అందిస్తున్నాయి. వైకాపా అధికారం లోకి వచ్చిన తర్వాత అయిదేళ్లుగా ఈ పథకాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందక పోవడం, అవనిగడ్డ పథకం మూడేళ్లుగా, పులిగడ్డ పథకం రెండేళ్లుగా పూర్తిగా మూతపడ్డాయని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు పైపులు, తొట్టెలు దెబ్బతిని ఆ ప్రాంతంలో అధిక నీరు చేరడంతో సంబంధిత రైతులు కూడా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీ మామిడి తోటల్లో ఏర్పాటు చేయడంతో ఆ కాలనీ మధ్య నుంచి వెళ్తున్న నీటి సరఫరా పంట బోదులు మూతపడటం మరో కారణంగా రైతులు చెపుతున్నారు. దీంతో ఈ ఏడాది మామిడి, నిమ్మ, జామ, తదితర సాగు రైతులు సొంతంగా బోర్లు వేసుకొని ఉప్పు నీటితో పాలాలకు నీటిని అందిస్తున్నారు. దీని ప్రభావంతో దిగుబడులు తగ్గడం, భూములు చౌడుబారుతున్నాయని రైతులు భయపడుతున్నారు.


వెంటనే వినియోగంలోకి తేవాలి

 - దామెర్ల సతీష్‌, రైతు, అవనిగడ్డ

ఎత్తిపోతల పథకాలను వెంటనే వినియోగంలోకి తేవాలి. మూడేళ్లుగా నీరు అందక ఉప్పునీరు పెట్టుకుంటున్నాం. భూములు చౌడుబారిపోయే ప్రమదం ఏర్పడింది. కాలువలకు లైనింగ్‌ పూర్తిగా ఏర్పాటు చేసి నీటి వృథా అరికట్లాలి. మోటార్లు మరమ్మతులు చేయాలి. మంచి నీరు ఇచ్చి లంక రైతులను ఆదుకోవాలి. 


లంక రైతుల్ని పట్టించుకోలేదు

- గాజుల మురళీకృష్ణ, అవనిగడ్డ

అయిదేళ్లుగా లంకరైతుల గోడు పట్టించుకోలేదు. మూడేళ్లుగా అవనిగడ్డ, పులిగడ్డ లంక భూములకు ఎత్తిపోతల పథకాల ద్వారా చుక్క నీరు అందలేదు. పథకాల మోటార్లు కూడా పనిచేస్తాయో లేదో తెలియని పరిస్థితి. సముద్ర జలాలు రావడం వలన లంక భూములకు మంచి నీరు అందడం లేదు. మామిడి రైతులకు కనీసం ఒక తడి కూడా ఇవ్వలేని దుస్థితి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని