logo

యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా

ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన పెద్దపప్పూరు మండలంలోని చిన్నపప్పూరు గ్రామ పరిధిలో అశ్వర్థ ఆలయ సమీపంలోని పెన్నానదిలో బుధవారం చోటుచేసుకుంది.

Published : 01 Dec 2022 06:09 IST

గణేష్‌ (పాతచిత్రం)

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన పెద్దపప్పూరు మండలంలోని చిన్నపప్పూరు గ్రామ పరిధిలో అశ్వర్థ ఆలయ సమీపంలోని పెన్నానదిలో బుధవారం చోటుచేసుకుంది. అతడి కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రి పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన గణేష్‌ (24) కుటుంబ సభ్యులతో కలసి చిన్నపప్పూరులోని అశ్వర్థ ఆలయంలో బంధువుల కేశఖండన వేడుకకు హాజరయ్యాడు. వేడుకలో బంధువులతో కలసి సందడిచేసిన గణేష్‌ తన స్నేహితులతో కలసి పెన్నానదిలోకి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ అకస్మాత్తుగా లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయాడు. స్థానికులు, స్నేహితులు అరగంట పాటు గాలించి నీట మునిగిన యువకుడిని బయటకు తీశారు. అప్పటికే అతడు మృతిచెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎనిమిదేళ్ల క్రితం భర్త దూరమై.. కొడుకే జీవితంగా బతుకుతున్న గణేష్‌ తల్లి పెద్దక్క రోదన పలువురిని కలచివేసింది. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వేలాది భక్తులు వచ్చే అశ్వర్థ ఆలయ సమీపంలోని పెన్నానదిలో గుంతల్లో అధిక లోతు నీరు ఉన్నా ఆలయ సిబ్బంది ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని