logo

బండ్లపల్లి యువతి.. అంతర్జాతీయ ఖ్యాతి

నార్పల మండలం బండ్లపల్లికి చెందిన బి.అనూష అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఆమె బౌలింగ్‌ చేస్తే బంతి గింగిరాలు తిరిగి వికెట్‌ను ముద్దాడుతుంది.

Updated : 13 Jun 2023 05:36 IST

అనూష

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: నార్పల మండలం బండ్లపల్లికి చెందిన బి.అనూష అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఆమె బౌలింగ్‌ చేస్తే బంతి గింగిరాలు తిరిగి వికెట్‌ను ముద్దాడుతుంది. బ్యాటింగ్‌ చేస్తే పరుగుల వరద పారాల్సిందే. ఇక ఫీల్డింగ్‌ విషయానికొస్తే మైదానంలో పాదరసంలా కదిలి బంతిని బౌండరీకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మురిపిస్తున్న 19 ఏళ్ల ఈ గ్రామీణ యువతి అంతర్జాతీయ పోటీలకు తొలిసారిగా ఎంపికైంది. దేశవాళీ పోటీల్లో అత్యుత్తమ ఆల్‌రౌండ్‌ ప్రతిభ చూపిన ఆమె హాంకాంగ్‌లో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న అండర్‌-23 క్రికెట్‌ పోటీలకు ఎంపికైంది. ఆర్డీటీ క్రికెట్‌ పోటీల్లో అరంగేట్రం చేసిన ఈ బాలిక అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. గ్రామస్థాయి క్రికెట్‌ నుంచి హాంకాంగ్‌ పర్యటనకు ఎలా ఎంపికైందో తెలుసుకోవాల్సిందే..

బ్యాటింగ్‌ చేస్తూ..

చదువు: బీకాం చివరి సంవత్సరం,

కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయమే, బౌలింగ్‌ శైలి: ఎడమచేతి వాటం స్పిన్నర్‌, బ్యాటింగ్‌: ఎడమచేతి బ్యాటింగ్‌ (ఆల్‌రౌండరు)

ప్రవేశం: 2014-15 సీజన్‌లో తొలిసారిగా ఆర్డీటీ క్రికెట్‌ పోటీల్లో ప్రాతినిథ్యం. బండ్లపల్లి బాలికల జట్టును ఒంటిచెత్తో విజేతగా నిలిపింది.

ప్రాతినిథ్యం: 2015-16 నుంచి వరుసగా ఆంధ్ర జట్టుకు ఎంపిక. అండర్‌-16 నుంచి సీనియర్స్‌ వరకు వివిధ విభాగాల జట్లకు ప్రాతినిథ్యం. అండర్‌-17 విభాగంలో జాతీయ పాఠశాల క్రికెట్‌ పోటీలకు ఎంపిక. ఆంధ్ర జట్టుకు మూడోస్థానం రావడానికి అద్భుత ప్రదర్శన. బెంగళూరు, పుదుచ్చేరి, అసోం, గ్వాలియర్‌, హైదరాబాద్‌, కొచ్చిన్‌, బరోడాల్లో జరిగిన దేశవాళీ పోటీల్లో ప్రతిభ చాటింది.

ప్రోత్సాహం: ఆర్డీటీ అకాడమీలో చేరిన తర్వాత దశ తిరిగింది. ప్రతిభకు పదును పెట్టడంతో జిల్లా నుంచి వరుసగా ఆంధ్ర జట్టులో స్థానం సాధించింది. ఆర్డీటీ, జిల్లా క్రికెట్‌ సంఘం ప్రోత్సాహంతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంది.

నేడే తొలి మ్యాచ్‌: హాంకాంగ్‌ పర్యటకు వెళ్లిన అండర్‌-23 భారత మహిళా జట్టు మంగళవారం హాంకాంగ్‌తో తలపడుతుంది. ఈనెల 15న థాయ్‌లాండ్‌తో, 17న పాకిస్థాన్‌తో మనదేశ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో సాధించే విజయాలను బట్టి సెమీఫైనల్‌, ఫైనల్‌ అవకాశాలుంటాయి.

ఉత్తమ ప్రదర్శన

దక్షిణ మండల సీనియర్స్‌ మహిళా క్రికెట్‌ టీ20 పోటీల్లో 10 వికెట్లు, వన్‌డే పోటీల్లో 27 వికెట్లు పడగొట్టింది. బీసీసీఐ ఇంటర్‌జోన్‌ వన్‌డే పోటీలు, ఛాలెంజర్‌ ట్రోఫీ, బీసీసీఐ సీనియర్‌ ఛాలెంజర్స్‌ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని