logo

జీబీసీపై కన్నెత్తి చూడని జగన్‌

గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌(జీబీసీ)ను జగన్‌ సర్కారు ఈ ఐదేళ్లలో కన్నెత్తి చూడలేదు. ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు, కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంత రైతులకు జీబీసీ వరం లాంటిది.

Published : 29 Apr 2024 03:50 IST

ఆధునికీకరణకు నోచుకోని సాగునీటి కాలువ

ఉరవకొండ-రాయంపల్లి సమీపంలో శిథిలమైన అండర్‌ టన్నెల్‌

ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌(జీబీసీ)ను జగన్‌ సర్కారు ఈ ఐదేళ్లలో కన్నెత్తి చూడలేదు. ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు, కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంత రైతులకు జీబీసీ వరం లాంటిది. దీనికి హెచ్చెల్సీ నుంచి తుంగభద్ర జలాలు అందిస్తారు. గత తెదేపా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఫేజ్‌-1 ఆధునికీకరణ పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఫేజ్‌-2 ఆధునికీకరణను అటకెక్కించింది. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరు ప్రశ్నార్థకంగా మారింది.

ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద తుంగభద్ర ఎగువ కాలువ నుంచి గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌(జీబీసీ) ప్రారంభం అవుతుంది. ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు మండలాల మీదుగా కర్నూలు జిల్లా వైపు ప్రవహిస్తుంది. దీని కింద రైతులు మిరప, పత్తి, వరి పంటలు అధికంగా పండిస్తారు. 2017లో తెదేపా ప్రభుత్వం రూ.120 కోట్లతో ఫేజ్‌-1 ఆధునికీకరించింది. 28వ కిలోమీటరు నుంచి ఫేజ్‌-2 ప్రారంభం అవుతుంది. దీని ఆధునికీకరణకు గత తెదేపా ప్రభుత్వం రూ.118కోట్లు మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడే నాటికి కాలువ మట్టి లైనింగ్‌తోపాటు నాలుగు కిలోమీటర్లు సిమెంటు లైనింగ్‌ పూర్తయ్యింది. ఇక అంతే ఈ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. ఫలితంగా కాలువ ఎక్కడికక్కడ శిథిలం అయ్యింది. 48వ కిలోమీటరు వరకు కూడా నీరు రావడం లేదు. ఏటా ఖరీఫ్‌లో రైతులు చందాలు వేసుకుని కాలువను సరి చేసుకుని అరకొర నీటితో పంటలు పండించుకుంటున్నారు.

విడపనకల్లు మండలం పొలికి సమీపంలో కాలువ దుస్థితి

అండర్‌ టన్నెళ్లు, అక్విడెక్టులు శిథిలం

జీబీసీ 0 కి.మీ. నుంచి 59.5 కిలోమీటర్ల వరకు కాలువ పొడవునా 20 వరకు అండర్‌ టన్నెళ్లు, అక్విడెక్టులు ఉన్నాయి. ఫేజ్‌-1 ఆధునికీకరణ పనుల్లో ప్రధానంగా కాలువ లైనింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అండర్‌ టన్నెళ్లు, అక్విడెక్టుల పనులు పూర్తి కాలేదు. ఐదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. వాటి వద్ద కొన్నేళ్లుగా 200 క్యూసెక్కుల వరకు సాగునీరు వృథాగా పోతున్నాయి.

చివరి ఆయకట్టు ప్రశ్నార్థకం

జీబీసీ 59.5 కిలోమీటర్లు పొడవు ఉండగా, అందులో నీరు 30 కిలోమీటర్ల దూరం వెళ్లడం కష్టంగా మారింది. కారణం శిథిలమైన అండర్‌ టన్నెళ్లు, అక్విడెక్టుల నుంచి భారీగా జలాలు వంకల పాలవుతున్నాయి. దానికితోడు ఫేజ్‌-2 ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ఐదేళ్లుగా చివరి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇదంతా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు చూస్తున్నా తమకేదీ పట్టునట్లు ఉంటున్నారు. 15వ కిలోమీటరు వద్ద తరచూ అక్విడెక్టుకు భారీ రంధ్రాలు పడటంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

  • సాగునీటి పథకం: గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌(జీబీసీ)
  • కాలువ పొడవు: 59.5 కిలోమీటర్లు
  • ఆయకట్టు: 15,800 ఎకరాలు
  • ఫేజ్‌-1 ఆధునికీకరణకు వ్యయం: రూ.120 కోట్లు
  • ఫేజ్‌-2కు నిధుల మంజూరు: రూ.118 కోట్లు (తెదేపా ప్రభుత్వ హయాంలో)
  • ఐదేళ్ల వైకాపా పాలనలో ఒక్క పని చేయలేదు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని