logo

జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!

ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్‌..

Published : 19 Apr 2024 02:58 IST

ఏటా జాబ్‌ క్యాలండర్‌ హుష్‌కాకి
ఖాళీల భర్తీపై మాట తిప్పి.. నిరుద్యోగులకు టోపీ పెట్టి..
ఇద్దరి పని ఒకరితో..  
ఉద్యోగులపై అదనపు భారం, ఒత్తిడి
న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్‌, విద్య, నగరం

ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్‌.. నిరుద్యోగ యువతకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని కథలు చెప్పారు.. వారు గుడ్డిగా నమ్మి ఓట్లేశాక మొండిచేయి చూపారు.. 2019లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ తప్ప.. మిగతా శాఖల్లో రెగ్యులర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ విస్మరించారు.. ప్రభుత్వ శాఖల్లో ఇద్దరి పనిని ఒకరితో చేయిస్తున్నారు. అదనపు భారం మోపుతున్నారు.. ఫలితంగా ఆయా శాఖల్లో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది.. ఇలా ఉద్యోగులపై గుదిబండ వేసి మరీ ఐదేళ్ల పాలన పూర్తిచేస్తున్నారు జగన్‌.

2,700కిపైగా ఉపాధ్యాయ ఖాళీలు..

జిల్లాలోని జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో 2,700కి పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు. దీంతో ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతోంది. పని ఒత్తిడితో వారు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వివిధ యాప్‌లు.. ఇతరత్రా బోధనేతర పనులతో ఇప్పటికే వారు సతమతమవుతున్నారు. తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక మధనపడుతున్నారు. కొందరు ఆస్పత్రుల పాలై నెలల తరబడి సెలవులో వెళ్లిన సందర్భాలున్నాయి. విద్యా శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ ఆకస్మిక తనిఖీలతో టీచర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఆయన గతంలో జిల్లా పర్యటన సందర్భంలో ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు గజగజా వణికిపోయారు. ఉపాధ్యాయులు సరిగా పనిచేయడం లేదని, సస్పెండ్‌ చేస్తామని జులుం ప్రదర్శించారు. పలు మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు.  

సచివాలయాల్లోనూ అదే పరిస్థితి..

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు 612 ఉన్నాయి. వీటిలో 6,624 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం 4,920 మంది పనిచేస్తున్నారు. 1,704 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఉన్నచోట.. పక్క సచివాలయాలకు చెందిన సిబ్బందితో పని చేయించుకుంటున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర వేదనలో ఉన్నారు. ఇప్పటికే రకరకాల నివేదికలతో సతమతమవుతుంటే అదనపు భారం మరింత కుంగదీస్తోందని వాపోతున్నారు.

డీఎస్సీ ప్రకటన.. ఎన్నికల స్టంట్‌

నాలుగున్నరేళ్లలో ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వని సర్కారు.. ఎన్నికలకు హడావుడిగా 184 ఖాళీల భర్తీకి డీఎస్సీ ప్రకటన ఇచ్చింది. నిరుద్యోగ అభ్యర్థులు అప్పులు చేసి మరి దరఖాస్తు రుసుము చెల్లించారు. సాంకేతిక కారణాలతో పరీక్షలు నిర్వహించలేరని తెలిసీ.. ఉద్యోగుల్ని మభ్యపెట్టింది వైకాపా సర్కారు.

అన్ని శాఖల్లోనూ..

పుర, నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్‌ విభాగంలో అనేక ఖాళీలు భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో ఉన్న సిబ్బందితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో అటెండర్‌ నుంచి ఏవో హోదా వరకూ 320 ఖాళీలు ఉన్నాయి. ఉన్న సిబ్బందిపైనే ఎక్కువ భారం మోపుతున్నారు. ర.భ.శాఖలోనూ ఏఈలు, అటెండర్ల కొరత ఉంది.


నాలుగేళ్లలో ఒక్క నోటిఫికేషన్‌ లేదు
- మంజునాథ్‌, డీఎస్సీ అభ్యర్థి

ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నాలుగేళ్ల కాలంలో ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా నోటిఫికేషన్‌ ఇచ్చారు. చివరకు పరీక్షలు జరపలేదు. ఇక్కడే తెలుస్తోంది పాలకుల తీరేంటో?


ఖాళీల భర్తీ ఎప్పుడు?
- అనిల్‌, డీఎస్సీ అభ్యర్థి

ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాలి. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్షలు జరపకపోవడం శోచనీయం. నిరుద్యోగుల్ని మళ్లీ మభ్యపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని