logo

బలి తీసుకునే పన్నాగం.. ఇంటింటా పంపిణీకి ఎగనామం

తనలాంటి మానవతావాది, దయార్ద హృదయుడు లేడని మాటల్లో చెప్పే ముఖ్యమంత్రి జగన్‌.. ఆచరణలో మాత్రం ఆమడదూరంలో ఉన్నారు. పేదలకు పంపిణీ చేసే పింఛను నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తానని చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

Updated : 01 May 2024 04:55 IST

బస్సులు లేని ఊళ్ల నుంచి బ్యాంకులకు ఎలా రావాలని వృద్ధుల ఆవేదన  
వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పి.. లబ్ధి పొందాలని జగన్‌ కుతంత్రం
ఈనాడు, చిత్తూరు

తనలాంటి మానవతావాది, దయార్ద హృదయుడు లేడని మాటల్లో చెప్పే ముఖ్యమంత్రి జగన్‌.. ఆచరణలో మాత్రం ఆమడదూరంలో ఉన్నారు. పేదలకు పంపిణీ చేసే పింఛను నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తానని చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వైకాపా అధినేత అయిన జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఆయన బాటలోనే పంచాయతీరాజ్‌ అధికారులు నడిచి వృద్ధులు,  వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలను బ్యాంకుల వద్దకు నడిపించేందుకు  సన్నద్ధమయ్యారు.

జిల్లావ్యాప్తంగా 1,92,021 మంది పింఛనుదారులు మే నెల పెన్షన్‌ను బ్యాంకుల వద్దకు వెళ్లి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రామీ ణ ప్రాంతాల్లోని పండుటాకులు, వితంతువులు అనివార్యంగా బ్యాంకుల వద్దకు ఎండలో ప్రయా ణం చేయాలి. అష్టకష్టాలు పడి అక్కడకు చేరుకున్నా అరకొర సిబ్బంది కారణంగా ఒకేరోజు వందలాది మందికి పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు.

మండుటెండలో ముళ్లబాటలో..

జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ పరిస్థితిలో వృద్ధులు 10 నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణం సాగించాలి. బ్యాంకుల వద్ద నిరీక్షించాలి. జిల్లాలోని అనేక గ్రామాలకు బస్సు, ఆటోల సౌకర్యం లేదు. ఈ గ్రామాల్లోని లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరం. అలాగే కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం ఉన్నా గుంతల దారిలో ప్రయాణించడం అంత తేలిక కాదు. తమను ఎండలో వేధించి ఏమైనా జరిగితే ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టేందుకు జగన్‌ కుట్ర చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.


బైరెడ్డిపల్లె మండలం ధర్మపురి గ్రామానికి చెందిన సుశీలకు వితంతు పింఛను వస్తోంది. మే నెల పింఛను నగదు బ్యాంకులో జమ చేస్తే పది కిలోమీటర్ల దూరంలోని కొలమాసనపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు వెళ్లాలి. అక్కడకు వెళ్లేందుకు తమ గ్రామం నుంచి బస్సు సదుపాయం లేదని, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లోనే కొలమాసనపల్లికి చేరుకోవాలని వాపోతోంది. అక్కడకు చేరుకున్న తర్వాత మరుసటి రోజు రమ్మని చెబితే వ్యయప్రయాసలు తప్పవు.


యాదమరి మండలంలో 566 పింఛన్లున్నాయి. వీటిలో 364 మందికి  బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. వీరిలో వయోవృద్ధులు, దివ్యాంగులు ఉన్నారు. వీరంతా పది కి.మీ.దూరంలోని కాశిరాళ్ల సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు వెళ్లాలి. అక్కడి నుంచి వెళ్లేందుకు ఈ గ్రామం నుంచి బస్సు సౌకర్యం లేదు. అంత దూరం వెళ్లి బ్యాంకులో నిలబడి తీసుకోవాలంటే ఇబ్బందులు తప్పవని  వాపోతున్నారు.


పెనుమూరు మండలం శాతంబాకం పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన పింఛనుదారులకు గ్రామంలో బ్యాంకు అందుబాటులో లేదు. వారు గ్రామం నుంచి సుమారు పది కి.మీ.దూరంలోని ఉగ్రాణంపల్లె సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు రావాల్సి ఉంది. సరే వెళ్దామనుకున్నా ఆ గ్రామం నుంచి బస్సు సౌకర్యం లేదు. ఆటోల్లో కానీ.. నడిచిగానీ రావాల్సిందే. దీంతో వారికి ఎదురయ్యే కష్టాలు అన్నీఇన్నీ కావు.


సమీపంలోనే సచివాలయాలున్నా..

పింఛను నగదును గత, ప్రస్తుత ప్రభుత్వం నగదు రూపంలో నేరుగా చేతికి అందిస్తోంది. దీంతో బ్యాంకు ఖాతాలున్నా వృద్ధులు వినియోగించడంలేదు. ఖాతా తెరిచే సమయంలో ఏటీఎం కార్డు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేదని పక్కన పడేశారు. ఈ క్రమంలో లావాదేవీలు జరగక పలువురి ఖాతాలు క్రియాశీలకంగా లేవు. మరికొందరైతే బ్యాంకుకే నగదు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటువంటి వ్యక్తుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తే బ్యాంకర్లకే ప్రయోజనం. కొందరి కార్డులు చదువుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లిన మనవళ్లు, మనవరాళ్లు ఉపయోగిస్తున్నారు. ఆధార్‌ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలోనే నగదు జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున లింక్‌ అయిందో లేదో తెలుసుకునేందుకు అనివార్యంగా రెండు- మూడు కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు వెళ్లాలి. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సులు లేకపోతే నడిఎండలో నడుచుకుంటూ ప్రయాణం సాగించాలి.


పొదుపు సంఘాల మహిళలతో నిండి..

ప్రతి నెలా మొదటి వారం బ్యాంకులు పొదుపు సంఘాల మహిళలతో రద్దీగా ఉంటాయి. విశ్రాంత ఉద్యోగులూ పింఛన్ల కోసం బారులు తీరుతారు. ఇదే సమయంలో వృద్ధులూ వెళ్తే అనేక ఇబ్బందులు పడతారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఒకట్రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరగాలి.


సాధారణ రోజుల్లోనే రెండు గంటలు  

బైరెడ్డిపల్లెలోని ఇండియన్‌ బ్యాంకుకు ఖాతాదారుడు సాధారణ రోజుల్లో వెళితే బయటకు వచ్చేందుకు రెండు గంటలు పడుతోంది. పింఛనుదారులూ అక్కడికే చేరుకుంటే నగదు చేతికి అందడానికి నాలుగైదు రోజులవుతుంది.


మృతుల ఖాతాల్లోనూ జమ


 

వరెవరికి బ్యాంకుల్లో, ఇంటింటికి వెళ్లి నగదు అందజేయాలనే వివరాలను ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చింది. చనిపోయిన వ్యక్తులను జాబితాలో నుంచి తీసే అధికారం ఇప్పుడు అధికారులు, ఉద్యోగులకు లేదు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇలా 100- 120 మంది వరకు ఉంటారని అంచనా. జిల్లావ్యాప్తంగా 700- 850 మంది మృతుల ఖాతాల్లో డబ్బు పెడితే ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్టేనని సచివాలయ ఉద్యోగులే అంటున్నారు. ః మే 1న ఏడు నియోజకవర్గాల్లోని 80,843 మందికి ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ము ఇవ్వాలని అధికారులు చెప్పారు. తక్కువ మొత్తమే అయినందున మంగళవారం మధ్యాహ్నానికి దాదాపు జమ అయింది. వీరికి బుధవారం పంపిణీ చేస్తారు. ః మే 1న బ్యాంకులకు సెలవు. ఎక్కువమంది వృద్ధులు, వితంతువులు బ్యాంకుల వద్దకు వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని