logo

ఈ ఆస్పత్రుల్లో ఎలా జగన్‌..

ప్రభుత్వాసుపత్రుల్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. రోగులకు సరిపడా గదులు లేవు.. వరండాల్లోనే వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి.

Published : 23 Apr 2024 05:22 IST

సౌకర్యాలు కరవు
రోగులకు తప్పని తిప్పలు
న్యూస్‌టుడే, చిత్తూరు(వైద్యం), పెనుమూరు, వెదురుకుప్పం

ప్రభుత్వాసుపత్రుల్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. రోగులకు సరిపడా గదులు లేవు.. వరండాల్లోనే వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి.. తాగునీటికి తిప్పలు తప్పడం లేదు.. మరుగుదొడ్లు లేక మలమూత్ర విసర్జనకు దూరంగా వెళ్లాల్సిన దయనీయ స్థితి.. అధికారంలోకి రాగానే రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు వసతులు కల్పిస్తామని గొప్పలు చెప్పినా ఆచరణలో మాత్రం ఆమడదూరంలో ఉంది.. రోగుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్లు ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెరగడం లేదు.. మరోవైపు మందుల కొరతా వేధిస్తోంది.. చెట్ల కింద వరండాల్లో ఉండాల్సి వస్తోంది.. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు, వైద్యసిబ్బంది ఎదుర్కొంటున్న అవస్థలు.. సౌకర్యాలు కల్పనపై నిర్ణయం తీసుకోవాల్సిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ.. మొక్కుబడి సమావేశాలతో మమ అనిపించేస్తోంది.


  • చిత్తూరు నగర శివారు ప్రశాంత నగర్‌లో చేపట్టిన పీహెచ్‌సీ పనులు నేటికీ పూర్తికాలేదు. ప్రజలకు వైద్య సేవలు అందించాలని నిర్మాణం చేపట్టినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణం పూర్తికాకనే అర్ధాంతరంగా నిలిపేశారు. అసలు ఈ పనులు పూర్తయ్యేదెన్నడు.. ఈ ఆస్పత్రి వినియోగంలోకి వచ్చేదెన్నడోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు.      
  • వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం ఆసుపత్రిలో రోజుకు 150 మందికి పైగా రోగులు వైద్యసేవల నిమిత్తం వస్తుంటారు. ఇక్కడ కనీసం రోగుల సేవకులకు అవసరమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు. తాగునీటికీ ఇబ్బందులు తప్పడంలేదు.
  • పెనుమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజు దాదాపు రెండు వందల మంది రోగులు వస్తున్నారు. వీరిలో అతిసార రోగులు సైతం ఎక్కువగా ఉంటారు. వారికి వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక గదులు లేవు. దీంతో ఆసుపత్రి వరండాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నారు. మంజూరైన యాబై పడకల ఆసుపత్రి నిర్మాణం పునాదులైనా దాటలేదు.

ఆసుపత్రి విస్తరించాలి..

-చంగల్రాయరెడ్డి, ఎర్రగుంట్లపల్లె, వెదురుకుప్పం మండలం

పచ్చికాపల్లం ప్రభుత్వాసుపత్రికి రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందుకు తగ్గట్లు సౌకర్యాలు మాత్రం పెరగడం లేదు. దీంతో నిత్యం పలు సేవల నిమిత్తం ఇక్కడకు వచ్చే రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. తాగునీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. గుక్కెడు నీటికోసం బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.


అతిసార రోగులకు ప్రత్యేక గదులు ఉండాలి

-శివశంకర్‌, పెనుమూరు

వేసవికాలం కావడంతో ఆసుపత్రికి అతిసార రోగులు ఎక్కువగా వస్తుంటారు. వారికి ప్రత్యేక గదులు లేవు. ఆసుపత్రి వరండాల్లోనే వైద్య సేవలు అందించాల్సి వస్తోంది. ఫలితంగా రోగుల అవస్థలు చెప్పనలవికావు. మరోవైపున ఆసుపత్రి నిర్మాణం నత్తనకడన సాగుతోంది. ఇది ఎప్పటికి పూర్తవుతుందో వేచిచూడాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని