logo

మేనమామనన్నావ్‌.. మా కిట్లు ఆపేశావ్‌

చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెరుగైన వైద్యసేవలందిస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ‘మీ మేనమామగా చెబుతున్నా.. అంటూ పలు సందర్భాల్లో సీఎం జగన్‌ ప్రకటించుకుంటున్నా అప్పుడే పుట్టిన బుజ్జాయిలపై శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

Published : 04 May 2024 08:02 IST

బేబీ కిట్ల పంపిణీకి వైకాపా ప్రభుత్వం మంగళం

 

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం: చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెరుగైన వైద్యసేవలందిస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ‘మీ మేనమామగా చెబుతున్నా.. అంటూ పలు సందర్భాల్లో సీఎం జగన్‌ ప్రకటించుకుంటున్నా అప్పుడే పుట్టిన బుజ్జాయిలపై శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2017 నుంచి తెదేపా ప్రభుత్వం అందజేసిన ఎన్‌టీఆర్‌ బేబీ కిట్లకు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళం పాడేసి బాలింతలపై ఆర్థిక భారం మోపింది.

ఉమ్మడి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం జీజీహెచ్‌లు, సీహెచ్‌సీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏడాదికి 15 వేలకు పైగా ప్రసవాలు జరుగుతాయి. రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలోనే నెలకు 400కు పైగా ప్రసవాలు జరుగుతుంటాయి. జన్మించిన శిశువులకు గత ప్రభుత్వ హయాంలో  రూ.1,500 విలువ చేసే బేబీ కిట్లను పంపిణీ చేసేవారు. ఇంటికెళ్లిన తరువాత బిడ్డ సంరక్షణకు ఇవి ఎంతో ఉపయోగపడేవి.

నాడు ఇలా ఉండేది..

తెదేపా హయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం పోసుకున్న మహిళలకు రూ.1,000-1,500 విలువైన దుప్పటి, తువ్వాలు, సబ్బు, బ్యాగు, దోమ తెర, పరుపు ఇచ్చేవారు. ప్రస్తుతం ఇవి లేకపోవడంతో సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవాలకు వచ్చేవారికి అదనపు ఆర్థిక భారం తప్పడం లేదు.

రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో ప్రైవేటుగా కొనుగోలు చేసిన కిట్టులో చిన్నారి

పేరు మార్చేసి.. పథకం ఆపేసి..

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకం పేరు మార్చేసి.. పాత కిట్లనే కొన్నాళ్లు పంపిణీ చేశారు. అనంతరం పథకాన్ని మూలకు చేర్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుళ్లు పోసుకునేవారు దాదాపు నిరుపేదలే. కిట్లు అందకపోవడంతో రూ.వందల్లో వెచ్చించి కొనుగోలు చేసుకుంటున్నామని వాపోతున్నారు. రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి మన్యం ప్రాంతం నుంచి అధికంగా ప్రసవాలకు వస్తుంటారు. వారికి కిట్లు లేక.. కొనుగోలు చేసుకునే స్థోమత లేక వస్త్రాల్లోనే ఉంచుకుని బిడ్డలను సంరక్షించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.


తప్పని ఆర్థిక భారం

వారం కిందట రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో పురుడు పోసుకున్నా. 2018లో మొదటి బిడ్డ పుట్టినప్పుడు పరుపు, టవల్‌, ఇతర సామగ్రితో కూడిన బేబీ కిట్టు ఇచ్చారు. ప్రస్తుతం పంపిణీ లేకపోవడంతో మేమే రూ.1,100 వెచ్చించి కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది.

లక్ష్మమ్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని