logo

ఏడాదిలోపే.. నాణ్యత లోపాలు

శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనంతోపాటు మెరుగైన వసతిని తితిదే నుంచి ఆశిస్తారు.

Published : 23 Apr 2024 05:29 IST

తిరుమలలో గదుల ఆధునికీకరణ తీరిది

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనంతోపాటు మెరుగైన వసతిని తితిదే నుంచి ఆశిస్తారు. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా వసతి గదుల నిర్వహణలో మెరుగైన ఏర్పాట్లు, వాటి ఆధునికీకరణ ఫలితాలు మాత్రం భక్తులకు అందడం లేదు. గుత్తేదారుల అవినీతి, ఇంజినీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం, తితిదే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి కారణంగా వసతి భవనాల్లోని లోటుపాట్లు భక్తులకు శాపంగా మారాయి.

తిరుమల వ్యాప్తంగా ఉన్న పాత వసతి కేంద్రాలను ఆధునికీకరించేందుకు ఇంజినీరింగ్‌ అధికారులు రూ.110 కోట్లతో టెండర్లను ఆహ్వానించి పనులు దాదాపు పూర్తిచేశారు. 7,400 గదులున్న తిరుమలలో పనులు దశలవారీగా కరోనా సమయం నుంచి నిర్వహిస్తున్నారు. పాత కాటేజీల్లోని మరుగుదొడ్ల మరమ్మతులు, గదుల్లో సదుపాయాల మెరుగుదల చాలావరకు పూర్తిచేశారు. శీతాకాలంలో భక్తులు ఇబ్బందిపడకుండా ప్రతిగదిలో గీజర్‌ ఏర్పాటు చేశారు. గదుల్లో ఫ్లోరింగ్‌, విద్యుత్తు తీగల మార్పు, మూత్రశాలలు, మరుగుదొడ్ల ఆధునికీకరణ, ప్లంబింగ్‌ తదితర పనులు చేపట్టారు. వీటితోపాటు పెయింటింగ్‌ పూర్తిచేశారు. అయితే గదుల ఆధునికీకరణ చేపట్టి ఏడాదికాకముందే పలు గదుల్లో నాణ్యతాపరమైన లోపాలు బయటపడుతున్నాయి.


లీకేజీలు.. పాచిపట్టిన గదులు

డ్రైనేజీ పైపుల లీకేజీలు, మరోవైపు పాచిపట్టిన గదులు పాత భవంతులను తలపిస్తున్నాయి. త్వరగా పూర్తిచేయాలనే ధోరణితో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టారు. వాటిని పర్యవేక్షించాల్సిన తితిదే ఇంజినీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యంతో పనుల్లో నాణ్యత కరవైనట్లు స్పష్టమవుతోంది. డ్రైనేజీ పైపుల నుంచి లీకేజీలు, పాచిపట్టిన గదులతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏఎన్‌సీ, ఎస్‌ఎంసీ, ఎస్‌ఎన్‌సీ గదుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.


గది మార్చుకోవాల్సి వచ్చింది

- సురేష్‌కుమార్‌, చిత్తూరు

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చాం. ఏఎన్‌సీలో గదిని తీసుకున్నాం. దాని నిర్వహణ దారుణంగా ఉంది. నీటి లీకేజీ, బూజుపట్టడం తోడు గదిని శుభ్రం చేయలేదు. ఏఎన్‌సీ విచారణ అధికారుల దృష్టికి తీసుకెళ్లి గదిని మార్చుకున్నాం. తితిదే ఉన్నతాధికారులు ఇటువంటి గదులపై దృష్టిసారించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని