logo

మాటల్లో బాగా.. చేతల్లో దగా..

అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేలా ఫిట్‌మెంట్‌ ఇస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.. సీఎం అయ్యాక జగన్‌ ఉద్ధరిస్తారని భావిస్తే నమ్మకంగా ముంచేశారని వాపోతున్నారు.

Updated : 23 Apr 2024 06:00 IST

మడమ తప్పి ముంచేసిన జగన్‌
జిల్లాలో ఉద్యోగ వర్గాలకు రూ.250 కోట్లు నష్టం

పుత్తూరుకు చెందిన గెజిటెడ్‌ అధికారి బ్రహ్మయ్య కొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఆయన మూలవేతనం రూ.1.79 లక్షలు. ప్రభుత్వం ఆయనకిస్తున్న ఐఆర్‌ కంటే 4 శాతం తగ్గించి ఫిట్‌మెంట్‌ ఖరారు చేశారు. దీంతో నెలకు రూ.7,160 వరకు కోత పడింది. ఈ లెక్కన ఆయనకు ఏడాదికి రూ.85,920.. వేతనంలో కోత పడటం గమనార్హం. ఇలా గెజిటెడ్‌ ఉద్యోగులందరూ రూ.లక్షల్లో నష్టపోయారు.


చిత్తూరుకు చెందిన ఎల్లయ్య రోడ్లు, భవనాల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌. ఆయన మూలవేతనం రూ.40 వేలు. ప్రభుత్వం అతనికి ఇస్తున్న ఐఆర్‌ కంటే నాలుగు శాతం తగ్గించి ఫిట్‌మెంట్‌ ఖరారు చేశారు. ఈ లెక్కన నెలకు రూ.1,600 కోత పడింది. ఏడాదికి రూ.19,200 వరకు కోత విధించారు. ఇలా కిందస్థాయి సిబ్బంది రూ.వేలల్లో నష్టపోవడం గమనార్హం.

పుత్తూరు, చిత్తూరు(విద్య):  అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేలా ఫిట్‌మెంట్‌ ఇస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.. సీఎం అయ్యాక జగన్‌ ఉద్ధరిస్తారని భావిస్తే నమ్మకంగా ముంచేశారని వాపోతున్నారు. ఐఆర్‌ 27 శాతం ఇస్తుంటే ఫిట్‌మెంట్‌ను 23 శాతానికి కుదించడంతో వారు నాలుగు శాతం నష్టపోయారు. దీనికితోడు మున్సిపాలిటీల్లో 14.5 శాతమున్న ఇంటి భత్యం  12 శాతానికి తగ్గించారు. నగరపాలక సంస్థలో 20శాతం నుంచి  16 శాతానికి తగ్గించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది.. ఫలితంగా దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు రూ.లక్షల్లో వేతనాల్లో కోత పడింది..
తమ నిరసన తెలియజేయడంతో పీఆర్సీ సమయం వరకు ఉన్న డీఏ బకాయిలు అందులో చూపి ఒక్కో ఉద్యోగికి రూ.3 వేల నుంచి 4 వేలు పెరిగిందని డప్పు కొట్టడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు 31,600 మంది పనిచేస్తున్నారు. అందులో గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌, కింద స్థాయి సిబ్బంది ఉన్నారు. గత ఎన్నికల సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయులకు మంచి ఫిట్‌మెంట్‌ ఇస్తామని నమ్మబలికి పీఆర్సీ కమిటీ నియమించారు. అప్పటికే మధ్యంతర భృతి కింద మూలవేతనంపై 27 శాతం ఇస్తున్నారు. దీంతో అశుతోష్‌ మిశ్రా కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మిశ్రా కమిటీ ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్‌ 27 శాతాన్ని ఫిట్‌మెంట్‌గా ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదించింది. వాస్తవానికి ఐఆర్‌ కంటే 1 నుంచి 2 శాతం అధికంగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. అయితే మిశ్రా కమిటీ 27శాతం సిఫార్సు చేసింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కోత విధించాలని నిర్ణయించి ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇస్తున్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయిు. తాము జీతాలు తీసుకోబోమని మొండికేశారు. ఈ ఇంటి అద్దె భత్యంలోనూ కోత విధించారు. పట్టణాల్లో 2.5 శాతం, నగరపాలికల్లో నాలుగు శాతం కోత విధించారు. ఈ నేపథ్యంలో జీతాల బిల్లులు పెట్టలేదు. దీంతో ప్రభుత్వం గతంలో చెల్లిస్తున్న వేతనాలను బట్టి వారి ఖాతాల్లోకి రాత్రిరాత్రికి వేసేశారు. తద్వారా జిల్లాలోని ఉద్యోగులకు ఏడాది రూ.250 కోట్లు వరకు కోత పడింది.


తగ్గింపు దారుణం..

- పవన్‌కుమార్‌రెడ్డి, జిల్లా నాయకులు, ఎస్టీయూ

ఏ ప్రభుత్వమైనా గతం లో ఇస్తున్న ఐఆర్‌ను దృష్టిలో ఉంచుకుని కమిటీ ఇచ్చిన నివేదిక దగ్గర పెట్టుకుని ఫిట్‌మెంట్‌ 1 నుంచి 2 శాతం పెంచడంఆనవాయితీ. ఇస్తున్న మధ్యంతర భృతి కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గించడం తన సర్వీసులో ఇదే ప్రథమం. దీనికితోడు ఇంటి భత్యంలో కోత విధించారు. ఇది ఏ మాత్రం తగదు. ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఇది ఆమోదయోగ్యంగా లేదు.


ఇంటి అద్దె భత్యంలో కోతతో నష్టం..

- గాజుల నాగేశ్వరరావు, ఎస్టీయూ నేత

ఉద్యోగ, ఉపాధ్యాయులకు మూలవేతనం ఆధారంగా ప్రతి పీఆర్సీలోను ఇంటి అద్దె భత్యం పెంచేవారు. గత పీఆర్సీలో 20 నుంచి 16శాతానికి, 14.5 నుంచి 12శాతానికి తగ్గించడంతో పాటు దశాబ్దాల తరబడి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి అద్దె 10 శాతం పెంచకపోవడం ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి. మూలవేతనం ఆధారంగా ఇంటి అద్దె అలవెన్స్‌ సీలింగ్‌ విధించడంతో తీవ్ర నష్టం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్దెలు భాగా పెరిగాయి. వచ్చే పీఆర్సీలో అయినా హెచ్‌ఆర్‌ఏ పెంచాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని