logo

కుమారుడి కోసమే ‘కరుణ’

సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్‌రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు.

Published : 24 Apr 2024 03:19 IST

తితిదే ఇళ్ల స్థలాల పంపిణీపై వైకాపా నేత కొత్తరాగం  
నిబంధనలు పాటించకుండా కూటమి కుట్రగా దుష్ప్రచారం

పట్టాల ప్రదానంలో కరుణాకర్‌రెడ్డి (పాతచిత్రం)

 సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్‌రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట ఎన్నికల్లో ఆయాచిత లబ్ధిపొందాలని అర్రులు చాచినా కనీస నిబంధనలు విస్మరించడంతో కథ అడ్డం తిరిగింది. దీన్ని కప్పి పుచ్చుకునేందుకు కూటమి కుట్ర అంటూ కొత్త రాగం పాడటాన్ని అందరూ తప్పుబడుతున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి..? వీరేం చేశారు..? వాస్తవమేమిటో ‘న్యూస్‌టుడే’ కథనం.

 న్యూస్‌టుడే, తిరుపతి (నగరపాలిక)

వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద 3,518 మంది ఉద్యోగులకు 2023 సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇక్కడ రెండు విడతలుగా స్థలాలు పంచినా ముందుగా ల్యాండ్‌ కన్వర్షన్‌ పట్టించుకోలేదు. తుడా అనుమతికీ దరఖాస్తు చేయలేదు. ‘ఈనాడు’లో ఫిబ్రవరి 5న కథనం వచ్చిన తర్వాత తితిదే ఆఘమేఘాలపై తప్పు సరిదిద్దుకుంది. 29న ల్యాండ్‌ కన్వర్షన్‌ పొందడం గమనార్హం. ఆ తర్వాతా తితిదే తీరు మారలేదు.

స్థలం సేకరించకనే నిధులు

మార్చి 12న మూడో విడతగా ఏర్పేడు మండలం పల్లం వద్ద 400 ఎకరాలు సేకరించి 723 మంది ఉద్యోగులకు, 3,277 మంది పింఛనుదారులకు ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. ఇక్కడ స్థల సేకరణ  పూర్తి కాకుండానే అభివృద్ధికి రూ.90 కోట్లు నిధులు కేటాయించడం గమనార్హం. దీనికి ల్యాండ్‌ కన్వర్షన్‌, తుడా అనుమతుల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఇక్కడ మరో 2,580 మంది ఉద్యోగులకు పట్టాలు అందజేస్తామని చెప్పుకొచ్చారు.

పేదలను ఎందుకు ఉద్దరించలేకపోయారో?

తిరుపతిలోని పేదలకు 2020 డిసెంబరులో జగనన్న ఇంటి పట్టాలు పంపిణీ చేయగా.. సుమారు ఆరు వేల మంది ఇప్పటివరకు ఇంటి స్థలాలు కళ్లజూడలేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తాము చేకూర్చిన లబ్ధి ‘రూ.6 లక్షలు విలువైన సెంటు స్థలం’ అంటూ వైకాపా నేతలు వారి ఇంటికి పంపే కరపత్రం చూసి కన్నీళ్లు పెట్టుకుంటు న్నారు. ఇప్పుడైనా ఇంటి జాగా చూద్దామంటే తిరుపతికి 30-35 కి.మీ దూరం ఉండటం, అక్కడికి బస్సు సౌకర్యం లేకపోవడం.. కష్టపడి వెళ్లినా  లేఆవుట్‌లో కనీసం హద్దు రాళ్లు లేకపోవడంతో వైకాపా నేతల మోసాన్ని తలచుకుని మదనపడుతున్నారు. రూ.3 లక్షలతో పేదల కంటే మూడు రెట్లు అధిక విస్తీర్ణం ఉన్న ప్లాట్‌ తీసుకున్నామన్న సంతోషం తమకు ఎక్కువ కాలం ఉండేలా లేదని తితిదే ఉద్యోగులకు అర్థమైంది. ఈ క్రమంలో వారి నుంచి వ్యతిరేకత రాకుండా వైకాపా నేతలు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

నాలుగో విడత కూడా అంతేనా?

పల్లం వద్ద మరో వంద ఎకరాల భూమికి అదనంగా 200 ఎకరాలు కొనుగోలు చేసి నాలుగో విడత పట్టాలు అందజేస్తామని తితిదే ప్రకటించింది. ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలకు రూ.240 కోట్లు వ్యయం చేయగా.. తితిదే ఉద్యోగుల నుంచి రూ.వంద కోట్ల వరకు సేకరిం చినట్లు సమాచారం.

అధ్యక్షా.. మోసగిస్తున్నదెవరు?

ఇంటి నిర్మాణానికి స్థలం కొనుగోలు చేసినప్పుడు దాని మాస్టర్‌ప్లాన్‌లో వ్యవసాయ, పారిశ్రామిక, రహదారి అవసరాల విభాగంలో ఉందా? నిషేధిత భూముల జాబితాలో ఉందో గుర్తించాలి. దానికి అనుగుణంగా తుడాకు నివేదించి భూమి స్థితి మార్చేందుకు దరఖాస్తు చేయాలి. ఆపై అప్రూవల్‌ పొందిన తర్వాతే పట్టాలివ్వాలి. ఇవేవీ చేయకుండా నేరుగా పట్టాలివ్వడం పట్టణాభివృద్ధి సంస్థల నిబంధనలకు విరుద్ధం. తితిదే ఈ ప్రక్రియ పాటించిందా.. అధ్యక్షా మీరే చెప్పాలి? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హడావుడిగా, ఆర్భాటంగా ఇస్తున్న ప్రొసీడింగ్స్‌ జగనన్న కాలనీల తరహాలో ఏళ్ల తరబడి సమస్యాత్మకంగా ఉంచాలన్నదే మీ లక్ష్యమా..? అని తితిదే ఉద్యోగులు, విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని