logo

నమ్ముకుంటే.. మోసపోయాం

రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్‌ నాడు హామీ ఇచ్చారు.

Published : 24 Apr 2024 03:25 IST

 గాల్లో దీపంలా భవిష్యత్తు
జగన్‌ మోసంపై గోపాలమిత్రల మండిపాటు

పశువులకు వైద్యం చేస్తున్న గోపాలమిత్రలు (పాత చిత్రం) 

న్యూస్‌టుడే, పెనుమూరు, పుత్తూరు : రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్‌ నాడు హామీ ఇచ్చారు.. దీంతో గోపాలమిత్రలు ఎంతో సంబరపడ్డారు.. తమ జీవితాలకు వెలుగు వస్తుందని ఆశపడ్డారు.. చివరకు వారి ఆశలు అడియాశలుగానే మిగిలాయి.. పాదయాత్ర చేసి ఏడేళ్లు, పదవిలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు వారికి ఇచ్చిన హామీలు పట్టించుకున్న పాపాన పోలేదు.. ఉద్యోగ భద్రత అటుంచితే తమను ఉంచుతారో లేదో అన్న అనుమానం వారిలో కలుగుతోంది.

చంద్రబాబు పథకమనే నిర్లక్ష్యం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు సకాలంలో వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గోపాలమిత్ర పథకాన్ని తెచ్చారు. గత ఎన్నికలకు ముందు రూ.3 వేలు ఇస్తున్న వేతనాన్ని.. చంద్రబాబు రూ.6,500కు పెంచారు. ఆ సమయంలో గోపాలమిత్రల సంఘం నాయకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే వీరికి నేడు సీఎం జగన్‌ అన్యాయం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఉద్యోగ భద్రత ఏదీ..?

గత ఇరవై ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పాడి సంతతి పెపొందించేందుకు ఎంతో కోసం కష్టపడి పనిచేస్తున్నాం. ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు నేరవేరలేదు. కనీసం వేతనాలు పెంచుతారని ఆశిస్తే అందులోనూ నిరాశే ఎదురైంది.

చంద్రబాబు పుత్తూరు


ఉపాధికి గండికోట్టారు

తమకు కనీసం వేతనం కింద రూ.15 వేలు ఇవ్వాలి. తాము అధికారంలోకి వస్తే గోపాలమిత్రలను క్రమబద్ధీకరి స్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి ఐదేళ్లు పూర్తయి మళ్లీ ఎన్నికలు వస్తున్నా ఇప్పటివరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తమకు 20 ఏళ్లు అనుభవం ఉన్నా.. తమను కాదని సచివాలయాల్లో డిప్లొమో చేసిన వారిని వీహెచ్‌ఏలుగా నియమించడంతో తమ ఉపాధికి గండి పడింది. దీంతో మా కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడింది.

జయరామిరెడ్డి, తిమ్మాపురం


పట్టించుకోకపోవడం దారుణం..

పాదయాత్రలో ఓట్లకోసం మాట ఇచ్చి తరవాత తమ సమస్యలు పట్టించుకోలేదు. కనీసం మా విజ్ఞప్తిని పరిశీలించలేదు. మా నాయకులను కలిసేందుకు వెళ్లినా వారు సైతం సమయం ఇవ్వకుండా దాటవేశారు. వేతనం పెంచడం మాట అటుంచితే ఉద్యోగ భద్రతపై ఆశలు ఉండటం లేదు.    

గోపాలమిత్రలు, పెనుమూరు మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని