logo

వైఎస్‌ఆర్‌ బీమా.. జగన్‌ డ్రామా

సీఎం జగన్‌ వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు.

Published : 25 Apr 2024 03:21 IST

రెండేళ్లుగా అందని సాయం
ఎదురుచూపుల్లో దరఖాస్తుదారులు

న్యూస్‌టుడే, పుత్తూరు, పెనుమూరు, పూతలపట్టు: సీఎం జగన్‌ వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. అయితే గత రెండేళ్లుగా బీమా సాయం ఇవ్వడం లేదు. ఈ సాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. ఈలోగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఇక సాయంపై బాధితులు ఆశలు వదులుకుంటున్నారు. అసలు తమకు ఈ సాయం ఎప్పటికి అందేనో అని ఆందోళన వ్యక్తం చస్తున్నారు.

  • పుత్తూరు మున్సిపాలిటీలోని మేదరవీధికి చెందిన చెంచయ్య రోడ్డు ప్రమాదంలో ఏడాదిన్నర క్రితం మృతి చెందాడు. అయితే ఇప్పటివరకు అతడికి వైఎస్‌ఆర్‌ బీమా కింద సాయం అందలేదు. అదే తెదేపా హయాంలో మృతి చెందిన వెంటనే దహన క్రియల కోసం రూ.10వేలు సాయం అందించేవారు. అనంతరం పూర్తి స్థాయిలో క్లెయిమ్‌ అందించేవారు. ప్రస్తుతం వేచి చూడాల్సిన పరిస్థితి.
  • వెదురుకుప్పం మండలం కురివికుప్పం గ్రామానికి మంగయ్య తిరుపతికి వస్తూ ప్రమాదవశాత్తూ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. అతడు కూలికెళ్తే తప్ప జీవనం సాగదు. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఇప్పటివరకు వైఎస్‌ఆర్‌ బీమా అందించకపోవడం గమనార్హం.

ఏడాదిగా నిరీక్షిస్తున్నాం..

నా భర్త మురుగేష్‌ గతేడాది అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు. వై.ఎస్‌.ఆర్‌ బీమా కోసం సచివాలయ సిబ్బంది ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. రూ.లక్ష వస్తుందని చెప్పారు. అదిగోఇదిగో అంటున్నారే తప్ప తమకు బీమా మొత్తం అందలేదు. నిరీక్షణ తప్ప ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో కచ్చితంగా చెప్పేవారు లేరు.

కృష్ణమ్మ, జీడీనెల్లూరు

దరఖాస్తు తిరస్కరించారు..

మా అమ్మ రాజేశ్వరి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె వై.యస్‌.ఆర్‌ బీమా పథకంలో సభ్యత్వం ఉంది. ఆమె మరణానంతరం బీమాకు దరఖాస్తు చేసుకున్నాం. కొద్దిరోజుల తరవాత సచివాలయంలో ఆరా తీస్తే దరఖాస్తు తిరస్కరించారని, డెత్‌ సర్టిఫికెట్‌, ఇతర ధ్రువపత్రాలు సరిగ్గా లేవని చెప్పారు. మళ్లీ కొత్తగా ధ్రువపత్రాలు తీసుకుని దరఖాస్తు చేసుకున్నాం. అయినా తిరస్కరణకు గురైనట్లు తెలియడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం.

ఆశ, పలమనేరు

బాధితులకు సాయం ఏదీ..

మిట్టపల్లూరు గ్రామం నుంచి పుత్తూరుకు వెళ్లే సమయంలో ప్రమాదం జరిగింది. తల, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్‌ఆర్‌ బీమా ప్రీమియం చెల్లించాం. అయినా తనకు ఇప్పటివరకు బీమా సాయం అందించలేదు. తెదేపా హయాంలో రోజుల వ్యవధిలోనే చంద్రన్న బీమా అందించేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక వైఎస్‌ఆర్‌ బీమా ఇవ్వడం లేదు.

కార్తిక్‌, మిట్టపల్లూరు, పుత్తూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు