logo

జగన్‌ బీ‘మాయ’

ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది.

Updated : 25 Apr 2024 06:17 IST

వచ్చీరాగానే కోతలు.. ఒకరికే అంటూ పరిమితులు
అరకొర పరిహారం సైతం అందించలేక చతికలు
రెండేళ్లలో వేల కుటుంబాలకు ఎగనామం

ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. పథకానికి అర్హత సాధించలేక.. పరిహారం అందక వేల కుటుంబాలు కకావికలమయ్యాయి. బకాయిలు ఎంతకూ చెల్లించకపోవడం.. వేలల్లో ఉన్న క్లెయిమ్‌ల సంఖ్య వందల్లోకి పడిపోవడం జగనన్న ఎత్తుగడల్లో భాగమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా బాధిత కుటుంబాలు మరింత అఘాతంలోకి కూరుకుపోతున్నాయి.

న్యూస్‌టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ), పూతలపట్టు

కన్నీటి నివేదన..

తన భర్త నాలుగేళ్ల కిందట ప్రమాదంలో గాయపడి చనిపోయారు.. అయినా వైకాపా ప్రభుత్వం తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని, ఇప్పటివరకు బీమా సొమ్ము రాలేదని గూడూరు ప్రాంతానికి చెందిన షాబీరా.. ఇటీవల చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మహిళలతో నిర్వహించిన సమావేశం సందర్భంగా కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్త చనిపోయి మూడేళ్లవుతున్నా ప్రభుత్వం నుంచి సాయం అందలేదని ఇదే కార్యక్రమంలో మణెమ్మ అనే మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

  • పూతలపట్టు మండలానికి చెందిన క్రిష్ణయ్య(49) కిడ్నీ వ్యాధితో రెండేళ్ల క్రితం మృతి చెందాడు. వైఎస్సార్‌ బీమా పథకంలో సభ్యుడు. దరఖాస్తు చేసుకుని ఏడాదిన్నరైనా ఇప్పటివరకు బీమా మంజూరు కాలేదు.
  • పలమనేరులోని పార్వతమ్మ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వైఎస్సార్‌ బీమా మంజూరు కోసం ఆమె కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తుతో పాటు అప్‌లోడ్‌ చేసిన ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా లేవని తిరస్కరించారు. ఈ బీమా ఆదుకుంటుందని ధీమాగా ఉన్నవారికి చివరకు నిరాశే మిగిలింది.

బియ్యం కార్డులు తెచ్చి.. కోతలు పెంచి

వైకాపా కొత్తగా తీసుకొచ్చిన బియ్యం కార్డులు జిల్లాలో 5,32,407 కార్డులకుగాను 66,654 కుటుంబాలకు బీమా అర్హత లేకుండా చేశారు. తిరుపతి జిల్లా గూడూరు మండలంలో 10,123 బియ్యం కార్డులుంటే ఇక్కడ 1,157 కార్డుదారులకు అర్హత లేదని తేల్చారు.

  • జిల్లాలోని ఓ మహిళ భర్త చనిపోగా ఆమెకు బీమా నిధులు రాలేదు. ముగ్గురు ఆడపిల్లలతో ఆమె జీవనం సాగించాల్సిన పరిస్థితి. ఆదుకోండని ప్రభుత్వ అధికారుల చుట్టూ అనేకమార్లు తిరిగినా నిధులు రాకుంటే తాము చేసేది ఏమీలేదని చేతులెత్తేస్తున్నారు. కుటుంబ పోషణ కోసం కూలీలుగా మారుతున్నారు. పస్తులుండి జీవనం సాగిస్తున్నారు.

తెదేపా సానుభూతిపరుడని..

బంగారుపాళ్యానికి చెందిన కస్తూరి(47) వైఎస్సార్‌ బీమా పథకంలో ప్రీమియం చెల్లించి మూడేళ్ల క్రితం సభ్యత్వం తీసుకుంది. ఆమె అనారోగ్యంతో ఏడాదిన్నర క్రితం మరణించింది. నామినీగా ఆమె కుమారుడు ప్రశాంత్‌ నమోదై ఉన్నాడు. సచివాలయ సిబ్బంది ద్వారా బీమా మంజూరుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఎలాంటి అతీగతీ లేదు. రూ.లక్ష ఎప్పుడు మంజూరవుతుందని సచివాలయ సిబ్బందిని బాధిత కుటుంబ సభ్యులు అడిగితే తమకూ తెలియదని, వస్తే మీ ఖాతాకే జమవుతుందని దాటవేత ధోరణితో సమాధానం చెబుతున్నారని ప్రశాంత్‌ కుటుంబ సభ్యులు వాపోయారు.


  • రెండేళ్లు ఆలస్యం చేసి 2021 జులై నుంచి జగనన్న బీమా పథకం అమలు చేయగా కుటుంబంలో ఒకరికే బీమా చేసే అవకాశం కల్పించి కోతలు విధించారు. 2022-23లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2,115 మంది మరణించగా 850 మందికి మాత్రమే పరిహారం అందించింది.
  • రహదారుల దుస్థితి వల్లనో మరేతర కారణాలతోనో నిరుపేదలు అనేకమంది ప్రమాదాల్లో గాయపడటంతోపాటు మరణిస్తున్నారు. అటువంటి కుటుంబాలకు బీమా సొమ్మును చెల్లించి వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం పరిహారం సొమ్ము సకాలంలో చెల్లించకుండా వారి ఉసురు పోసుకుంటోంది. చివరకు అన్ని అర్హతలున్నా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు.
  • వైఎస్‌ఆర్‌ బీమా పథకం కింద సహజ మరణం కింద రూ.లక్ష, ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తిగా వైకల్యం చెందినా రూ.5 లక్షలు చెల్లించాలి. బీమా క్లెయిమ్‌ చేసిన 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం సొమ్మును నేరుగా బీపీఎల్‌ కుటుంబానికి జమ చేస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని