logo

అయ్యోర్లపై అధికార బెత్తం

  చిత్తూరు గ్రామీణ మండలం మాపాక్షి జడ్పీ ఉన్నత పాఠశాలను ఇటీవల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఏడో తరగతిలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు.

Published : 29 Apr 2024 03:23 IST

  పిల్లలు రాయకపోతే టీచర్లకు తాఖీదులు
  బాధ దిగమింగుకుంటున్న ఉపాధ్యాయులు 
 చోద్యం చూస్తున్న జగన్‌ సర్కారు

చిత్తూరు సంతపేట ప్రాథమిక పాఠశాలలో అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌(పాత చిత్రం)

చిత్తూరు గ్రామీణ మండలం మాపాక్షి జడ్పీ ఉన్నత పాఠశాలను ఇటీవల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఏడో తరగతిలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. రాత పుస్తకాలు ఎందుకు ఆంగ్ల మాధ్యమంలో రాయలేదని హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదని ప్రశ్నించారు. పక్కనే ఉన్న కలెక్టర్‌ షన్మోహన్‌ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ ఘటనతో హెచ్‌ఎం అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

  గంగవరం మండలం మేళ్‌మాయి జడ్పీ ఉన్నత పాఠశాలను ముఖ్య కార్యదర్శి తనిఖీ చేసే సమయంలో అక్కడ పాత పాఠ్య పుస్తకాలు కన్పించాయి. ఇవి ఇక్కడ ఎందుకు ఉన్నాయి.. పిల్లల నుంచి ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించారు. అయితే ఆ హెచ్‌ఎం సెలవు రోజుల్లోనూ పాఠశాలలోనే ఉంటారని, మొక్కలు నాటడం తదితర పనులు చూసుకుంటారని, జిల్లాలో మంచిపేరు ఉందని పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

న్యూస్‌టుడే, చిత్తూరు విద్య

ఆయనో విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారి.. శని, ఆదివారాలు వస్తే ఉపాధ్యాయుల్లో గుండె దడ, భయం, ఆందోళన మొదలవుతాయి.. ఏ జిల్లాకు, ఏ పాఠశాలకు వస్తారో ఎవరిపై చర్యలు ఉంటాయో, ఎవరిపై మండిపడతారోనని జిల్లా అధికారి నుంచి ఉపాధ్యాయుడి వరకు ఉత్కంఠ.. విద్యార్థులు రాత పుస్తకం రాయకపోయినా, హోం వర్క్‌ చేయకపోయినా, ఏకరూప వస్త్రాలు ధరించకపోయినా, పాఠ్య పుస్తకాలు తీసుకురాకపోయినా సంబంధిత ఉపాధ్యాయుడే బాధ్యత వహించాలన్నది విద్యాశాఖ వాదన.. బోధనేతర పనులు, వివిధ రకాల యాప్‌ల అప్‌లోడ్‌ తదితర పనులతో సతమతమవుతుంటే అధికారులు మాత్రం తమపై చర్యలు తీసుకుంటున్నారనేది ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఆవేదన.. జిల్లాకు మొదటిసారిగా వచ్చినప్పుడు చౌడేపల్లె, పుంగనూరు మండలాల్లో ఆ రోజు రాత్రి 2గంటల వరకు తనిఖీలో ఉన్నారు.. పాఠశాల ముగిసిన తర్వాత పిల్లలు ఇంటి వద్ద ఉంటారని అక్కడికి వెళ్లి రాత పుస్తకాలు, హోం వర్క్‌ పరిశీలించి అక్కడ తప్పు ఉంటే సంబంధిత అధికారి నుంచి ఉపాధ్యాయుడు వరకు ప్రశ్నిస్తూ వారిపై మండిపడటËం గమనార్హం.

వరుస నోటీసులతో బెంబేలు..

చిన్నచిన్న తప్పిదాలకు ఉపాధ్యాయులకు నోటీసులు ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఒక్క ముఖ్య కార్యదర్శి తనిఖీలతోనే ఉపాధ్యాయులు బెంబేలెత్తుతుంటే మరోవైపున జిల్లా అధికారులు సైతం తనిఖీల పేరిట ఆందోళన రేకెత్తిస్తున్నారు. ముఖ్య కార్యదర్శి పర్యటన అనంతం జిల్లా వ్యాప్తంగా 60 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు, మెమోలు ఇవ్వడం గమనార్హం. ఇవికాక.. ఈ విద్యా సంవత్సరంలో 28 మంది ఉపాధ్యాయులకు డీఈవో నోటీసులు ఇవ్వడం విశేషం. ఇలా వరుస నోటీసులతో ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.


తప్పొప్పులు సరిదిద్దాలే గాని..

వ్యవస్థలో తప్పొప్పులు సవరించడం ఎంత అవసరమో.. వ్యవస్థ నిర్వీర్యం కాకుండా చూడటం ప్రధానం. ఆ దిశగా ఉన్నతాధికారుల వ్యవహార శైలి ఉండాలి. నడిబజారులో విద్యా వ్యవస్థ మొత్తాన్ని నిలబెట్టిన పరిస్థితి వచ్చింది. యావత్‌ విద్యాలోకం అంటే ఆర్జేడీ నుంచి క్షేత్రస్థాయి వరకు అందరు దోషులేనని ప్రచారం చేయడం చాలా బాధాకరం. విద్యావ్యవస్థలో ఉపాధ్యాయుడు సమాజ వృక్షానికి వేరులాంటి వారు. ప్రతి వేరు చచ్చుబడిందని అనడం అమానవీయం.

-జీవీ రమణ, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్‌


స్నేహపూరిత వాతావరణం ఉండాలి..

ఉన్నతాధికారులు తనిఖీ చేయాలి అక్కడ ఉన్న లోపాలను సరిదిద్ది మంచి పలితాలు రాబట్టాలి. చిన్న తప్పిదాలను భూతద్దంలో చూసి ప్రచార అర్బాటాల కోసం ఉపాధ్యాయులను వేధించడం సరికాదు. పిల్లల ముందరే టీచర్లను మందలించడం, మాట్లాడడం టీచర్లకు ఏమాత్రం గౌరవం ఉంటుంది. నిర్మాణాత్మకమైనటువంటి తనిఖీలు, పర్యవేక్షణను ఎప్పుడు స్వాగతిస్తాం.

-మోహన్‌, జిల్లా ప్రధానకార్యదర్శి, ఎస్టీయూ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని