logo

దాడులు, అరాచకమే ఎజెండా

అరాచకమే ఎజెండాగా ఎన్నికల్లో నెగ్గాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా అంటే తాజా పరిస్థితులను పరిశీలిస్తే సందేహమనే సమాధానం వస్తోంది.

Published : 29 Apr 2024 03:30 IST

ఎన్నికల కోడ్‌ వచ్చినా ఆగని వైకాపా ఆగడాలు  
 పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి కుయుక్తులు

 ఈనాడు, చిత్తూరు: అరాచకమే ఎజెండాగా ఎన్నికల్లో నెగ్గాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా అంటే తాజా పరిస్థితులను పరిశీలిస్తే సందేహమనే సమాధానం వస్తోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైకాపా నేతల అరాచకాలపై ఎదురుతిరిగిన వ్యక్తులపై దాడులు చేసి కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన తర్వాతా పోలీసుల తీరులో మార్పు రాకపోవడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.

పోలింగ్‌ నాటికి ఎవరూ ఉండకూడదనే..  

వరుసగా మూడుసార్లు గెలిచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎలాగైనా అమాత్యుడిని ఓడించాలనే కసితో ఉన్నారు. గ్రామాల్లో స్వచ్ఛందంగా తెదేపాలో చేరుతున్నారు. ప్రధానంగా పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో ఎన్నడూ లేనివిధంగా తెదేపా అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలు మంత్రికి, వైకాపా శ్రేణులకు మింగుడుపడటం లేదు. ప్రజాబలం లేదని అర్థం కావడంతో పోలింగ్‌ నాటికి విపక్ష కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని  దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు పెట్టి జైళ్లకు పంపించాలని యత్నిస్తున్నారు. మొత్తంగా పోలింగ్‌ నాటికి తెదేపాకు ఏజెంట్లు లేకుండా చేయాలని కుయుక్తులు పన్నుతున్నారు.

ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా

షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచే ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలి. సమస్యాత్మక ప్రాంతమైన పుంగనూరులో ఎక్కువ మంది సిబ్బందిని మోహరించాలి. తరచూ గొడవలకు దిగుతున్న వైకాపా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తేనే మిగిలిన వారూ రెచ్చిపోకుండా ఉంటారు. ఇటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం విపక్షాలపైనే కక్ష కట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహసించే యత్నాలు జరుగుతున్నాయి.

చౌడేపల్లె మండలం ఆమినిగుంట చెరువులో వైకాపా నేతలు పరిమితికి మించి మట్టి తవ్వడాన్ని గతనెల 21న తెదేపా మండల అధ్యక్షుడు రమేష్‌రెడ్డి అడ్డుకున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు రమేష్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఈనెల 17న పుంగనూరులో కూరగాయలు తీసుకెళ్తున్న తెదేపా కార్యకర్త హేమాద్రిని వైకాపా నేత నాగభూషణం అనుచరులు కిడ్నాప్‌ చేసి ఆయన ఇంట్లోకి తీసుకెళ్లి దాడి చేసేందుకు యత్నించారు. విపక్ష కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో బాధితుడు తప్పించుకున్నారు.

ఏప్రిల్‌ 26న పుంగనూరు మండలం మాగాండ్లపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ ప్రచారం చేస్తుండగా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రచార వాహనం అద్దాలు పగులగొట్టారు.

శనివారం రాత్రి చౌడేపల్లె మండలం బోయకొండ క్రాస్‌ వద్ద తెదేపా మండల అధ్యక్షుడు రమేష్‌రెడ్డి ఆయన అనుచరులను వైకాపా శ్రేణులు రెచ్చ గొట్టాయి. ఎదురు తిరిగినందుకు కర్రలు, రాళ్లతో వాహనాన్ని ధ్వంసం చేయడంతోపాటు కార్యకర్తలను కొట్టారు.

ఉన్నతాధికారులు స్పందిస్తేనే..

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌, ఎస్పీ మణికంఠ, ఎన్నికల పరిశీలకులు చొరవ తీసుకొని.. పుంగనూరు నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తే అధిక సంఖ్యలో కేంద్ర బలగాలు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఓటర్లు ఎటువంటి భయభ్రాంతులకు గురవ్వకుండా తమ హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటారు.


ఏజెంట్లు లేకుండా చేయాలనే..

ఎన్నికల్లో తెదేపా తరఫున ఏజెంట్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మంత్రి పెద్దిరెడ్డి   వైకాపా శ్రేణులతో దాడులు చేయిస్తున్నారు. పోలీసులతో కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారు. గతంలో ఒకేరోజు 140 మంది తెదేపా కార్యకర్తలపై రౌడీషీˆట్లు తెరిచారు. కొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు.. మంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మాపై ఎన్ని కేసులు నమోదు చేస్తే అంతగా బలపడతాం.

- చల్లా రామచంద్రారెడ్డి, పుంగనూరు తెదేపా అభ్యర్థి


ఓటమి భయంతోనే దాడులు

ఓడిపోతానన్న భయంతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబీకులు, వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. చౌడేపల్లె మండలంలో గువ్వల రమేష్‌రెడ్డిని అడ్డు తొలగించుకుంటే ఎవరూ ఎదురు తిరగరనే ధీమాతో రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ప్రజలు ఓటుతో మంత్రి పెద్దిరెడ్డిని ఓడించి సత్తా చూపాలి.

  శ్రీరాం చినబాబు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని