logo

అయిదేళ్లలో ఆర్టీసీ ఆస్తవ్యస్తం

జగన్‌ పాలనలో అన్ని వ్యవస్థల మాదిరిగానే ఆర్టీసీ సైతం చితికిపోయింది. ప్రభుత్వంలో విలీనం పేరిట ఆశలు కల్పించిన సీఎం.. తర్వాత అచేతన స్థితిలో వదిలేశారు. 

Updated : 28 Apr 2024 04:02 IST

కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన

వీకే రాయపురం వద్ద చక్రాలు బయటకు రావడంతో ఆగిపోయిన బస్సు

న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్‌(కాకినాడ): జగన్‌ పాలనలో అన్ని వ్యవస్థల మాదిరిగానే ఆర్టీసీ సైతం చితికిపోయింది. ప్రభుత్వంలో విలీనం పేరిట ఆశలు కల్పించిన సీఎం.. తర్వాత అచేతన స్థితిలో వదిలేశారు.  డొక్కు బస్సులు..పనిచేయని గేర్లు, అరిగిపోయిన టైర్లు..  వెరసి మధ్యలోనే మొరాయిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులకు తిరిగి పైపైన మరమ్మతులు చేపట్టి రోడ్లపై నడుపుతుండటంతో అవి ఎప్పుడు ఆగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది.  

ఇటీవల ఘటనలిలా..:  ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ఫిబ్రవరిలో కాకినాడ నుంచి శాంతి ఆశ్రమం వెళ్తున్న బస్సు సామర్లకోట రోడ్డులోని వీకే రాయపురం వద్ద నిలిచిపోయింది. బస్సు వెనుక వైపు చక్రాలు బయటకు వచ్చేశాయి.  అమలాపురం వైపు వెళ్తున్న హైవే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కారణంగా కాకినాడ వైఎస్సార్‌ కూడలి వద్ద అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. సామర్లకోట వద్ద పల్లె వెలుగు బస్సు టైర్ల నుంచి పొగలు రావడంతో డ్రైవర్‌ అప్రమత్తమై నిలిపివేశారు.

సామర్లకోట వద్ద బస్సు టైర్లలో పొగలు రావడంతో నీరు చల్లుతున్న సిబ్బంది

వేధిస్తున్న మెకానిక్‌ల కొరత..

జిల్లా పరిధిలోని ఆర్టీసీ గ్యారేజీల్లో సరిపడా సంఖ్యలో మెకానిక్‌లు లేరు.  పొరుగు సేవల విధానంలో తీసుకున్నప్పటికీ చాలావరకు ఖాళీలున్నాయి. ఒక మెకానిక్‌ రోజుకు 4 బస్సుల వరకు కండీషన్‌ను పరిశీలించి మరమ్మతులు చేయాలి. అంతకన్నా ఎక్కువ పని అప్పగిస్తుండటంతో ఒత్తిడికి గురవుతున్నారు. సిబ్బంది పనిచేసేందుకు అవసరమైన పనిముట్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. కొన్ని బస్సులకు ఆకస్మికంగా మరమ్మతులకు గురైతే వాటి స్థానంలో కొత్త పరికరం వేయాల్సి ఉంటుంది. ఇవి స్థానికంగా లభ్యం కాకపోవడం మరో సమస్యగా మారింది. విడి భాగాల కొరత వెంటాడుతోంది.

అధ్వాన రహదారులు:  జిల్లా వ్యాప్తంగా రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. దీంతో బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.  యాక్షన్‌ కట్టర్లు, కమాన్‌కట్లు మూన్నాళ్లకే దెబ్బతింటున్నాయి. టైర్లు పాడవ్వడంతో పాటు మధ్యలో బస్సులు ఆగిపోతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని