logo

డబ్బు.. బిర్యానీ చూపి జనానికి ఎర

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేటలో సోమవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభ నిర్వహించనున్నారు.

Published : 29 Apr 2024 06:05 IST

బండిపై వచ్చేవారికి పెట్రోలు ఫ్రీ
ఇదీ ముఖ్యమంత్రి నేటి సభకు నాయకుల సన్నద్ధం

న్యూస్‌టుడే, అమలాపురం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేటలో సోమవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభ నిర్వహించనున్నారు. ఇది ఆ నియోజకవర్గ స్థాయి సభ అయినప్పటికీ అమలాపురం, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం.. ఇలా అన్నిచోట్ల నుంచీ 30 వేలమందిని తరలించేందుకు వైకాపా నాయకులు ప్రణాళిక రచించారు. ముఖ్యమంత్రి సోమవారం మధ్యాహ్నం 1 గంటకు చేరుకొని సభలో పాల్గొంటారు. ఈ నెల 11న కూటమి ఆధ్వర్యంలో అంబాజీపేట కేంద్రంగా నిర్వహించిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ బహిరంగసభ విజయవంతమైంది. కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ నామినేషన్‌కు అంచనాలకు మించి వచ్చారు. ఇది వైకాపా శ్రేణుల్లో వణుకు పుట్టించింది. దీంతో సీఎం సభపై దృష్టిపెట్టారు. జనాలను తరలించేందుకు రూ.500 చొప్పున నగదు ఇస్తున్నారు. రాజోలు, అమలాపురం నుంచి వచ్చే వారికి డబ్బులతో పాటు పెట్రోల్‌ కూపన్‌లు పంపిణీ చేశారు. బిర్యానీ, మజ్జిగ, నీటిప్యాకెట్‌లను సిద్ధం చేస్తున్నారు. ఉపాధిహామీ కూలీలకు ఉపాధి పని చేసినట్లు మస్టర్లు వేసిన తరువాత సభకు వచ్చేలా చూస్తున్నారు.

దుకాణాలు మూసేయాలట..

అంబాజీపేటలో ఉదయం 10 గంటల వరకే వ్యాపారాలు చేసుకోవాలని.. అనంతరం దుకాణాలు, వ్యాపారసంస్థలను మూసివేయాలని.. పోలీసు అధికారులు నోటీసులిచ్చారు. యజమానుల పేర్లు, కార్మికుల వివరాలు రాసుకున్నారు. నాలుగురోడ్ల కూడలికి సమీపంలోని దినేష్‌ట్రావెల్స్‌ మలుపు వద్ద సీఎం వాహనంపై నుంచి మాట్లాడుతారు. ఈ ప్రాంతంలో ఉన్న విద్యుత్తు తీగలను తొలగించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల పాటు విద్యుత్తు నిలిచిపోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని