logo

మూగబోయిన జీవితాలు

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం శివారు హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.

Published : 29 Apr 2024 06:16 IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు
సీఎం సభ ఏర్పాట్లకు వెళ్తుండగా ఘటన

వినోద్‌కుమార్‌, ప్రభాకర్‌ (పాత చిత్రాలు

చాగల్లు, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం శివారు హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభకు సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు పట్టణంలోని సత్రంపాడుకు చెందిన మెండెం వినోద్‌కుమార్‌(32) సీఎం సభలు, సమావేశాలకు సౌండ్‌ సిస్టమ్‌ నిర్వహిస్తుంటారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో సోమవారం సీఎం సభ జరగనుంది. దానికి సౌండ్‌ సిస్టం ఆపరేట్‌ చూసేందుకు వినోద్‌కుమార్‌, మరో ఎనిమిది మంది సహాయకులను తీసుకుని చోడవరం బయలుదేరారు. కొవ్వూరు మండలం కాపవరం సమీపంలోకి వచ్చేసరికి వీరు వాహనం ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొంది. దీంతో వినోద్‌కుమార్‌తో పాటు, దారబోయిన ప్రభాకర్‌(21) వ్యానులోనే మృతిచెందారు. డ్రైవర్‌ తిరుపతిరావుతో పాటు మిగిలిన ఆరుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు. కొవ్వూరు గ్రామీణ ఎస్సై కె.సుధాకర్‌ సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. క్షతగాత్రుడు టి.డేవిడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అందరికీ అండగా..

వినోద్‌కుమార్‌(32)కు మూడేళ్ల క్రితం స్వరూపారాణితో వివాహమైంది. వీరికి ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. వృద్ధులైన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు సోదరుడి కుటుంబానికి సైతం ఆర్థికసాయం చేస్తుంటారు. అతని మృతితో తమకు దిక్కు ఎవరంటూ వినోద్‌కుమార్‌ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. అతని దగ్గర ఉపాధి పొందుతున్న కుటుంబాలు కూడా బాధలో మునిగిపోయాయి.

సోదరి పెళ్లి కోసం పనిలోకి..

ప్రభాకర్‌ చిన్నతనం నుంచి తల్లి ఆలనలోనే పెరిగాడు. కుటుంబానికి తానే అండగా నిలిచాడు. సోదరి పెళ్లి బాధ్యత తాను తీసుకున్నాడు. అందుకోసం పదితోనే చదువు ఆపేసి, వినోద్‌కుమార్‌ దగ్గర సౌండ్‌ సిస్టం నిర్వహణ నేర్చుకున్నాడు. అతని దగ్గరే పనిచేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాకర్‌ మృతితో తల్లి, సోదరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్న ఒక్కగానొక్క ఆధారం పోవడంతో వారికుటుంబం దిక్కులేనిది అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని