logo

పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి

కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు.

Published : 19 May 2024 03:19 IST

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

ఇన్నీస్‌పేట శాఖా గ్రంథాలయంలో బాలలకు శిక్షణ

కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. కొందరికి లెక్కలంటే చెప్పలేనంత భయం.. ఇంకొందరు ఆంగ్లంలో మాట్లాడేందుకు తడబడతారు. వీరందరినీ ఓచోట చేర్చి ఉపాధ్యాయులు శిక్షణ అందిస్తున్నారు. ఈనెల 15 నుంచి నగరంలోని పలు గ్రంథాలయాల్లో వేసవి ఉచిత శిక్షణ తరగతులు మొదలయ్యాయి. సెలవులు వృథా కాకుండా సమీపంలోని గ్రంథాలయాల్లో జరుగుతున్న శిబిరాలకు పిల్లలు హాజరు కావొచ్చని గ్రంథాలయాధికారులు చెబుతున్నారు.

పిల్లల్లో పఠనాశక్తిని పెంచేందుకు గ్రంథాలయంలో వారికి నచ్చిన పుస్తకం తీసుకుని చదువుకునేలా ప్రోత్సహిస్తారు. ఉపాధ్యాయులు నీతి కథలు చెప్పడంతోపాటు పిల్లలకు తెలిసిన కథలు చెప్పిస్తారు. తద్వారా పదిమందితో ఎటువంటి బెరుకూ లేకుండా పిల్లలు మాట్లాడతారు. తెలుగు పద్యాలు చదవడం, వాటి భావార్థం తెలియజేయడం, శ్లోకాల పఠనం నేర్పిస్తారు. వేద గణితం తరగతిలో సులభంగా లెక్కలు చేయడంలో శిక్షణ ఇస్తారు. సంగీతం, నృత్యంపై ఆసక్తి కలిగిన పిల్లలకు సంప్రదాయ నృత్యం, లలిత సంగీతంలోనూ తర్ఫీదునిస్తారు. పిల్లలకు ఆసక్తి కలిగించేలా చిన్నపాటి వస్తువులు, రంగుల కాగితాలతో అందమైన బొమ్మలు తయారు చేయడం నేర్పిస్తారు.

గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో శిక్షణకు హాజరైన విద్యార్థులు

సమయాలు ఇవి...

నగరంలోని గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంతోపాటు ఇన్నీస్‌పేట, సీతంపేట, దానవాయిపేట తదితర శాఖా గ్రంథాలయాల్లో వేసవి ఉచిత శిబిరాలు జరుగుతున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు ఉంటాయి.


సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నా

ఇన్నీస్‌పేట శాఖా గ్రంథాలయంలో అందిస్తున్న శిక్షణకు హాజరై నాకు నచ్చిన కథలు చదువుకుంటున్నా. క్రాఫ్ట్‌ తరగతిలో కొత్త ఆలోచనలతో అందమైన బొమ్మలు చేస్తున్నా. నాకిష్టమైన సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నా. వివిధ పాఠశాలల్లో చదువుకునే తోటి విద్యార్థులతో మంచి స్నేహం కుదిరింది. సంతోషంగా విజ్ఞానదాయకమైన అంశాలు నేర్చుకునే అవకాశం దొరికింది. 

ఎం.నిహారిక, ఏడోతరగతి


వేద గణితం, బొమ్మల తయారీ బాగున్నాయ్‌..

మాకు తరగతి పాఠాల్లో నీతికథలు, చిత్రలేఖనం, సంగీతం వంటివి ఉండవు. కొని చదువుకునేందుకు సమయం దొరకదు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో మాకు దగ్గరలోని సీతంపేట శాఖా గ్రంథాలయంలో జరుగుతున్న శిక్షణకు హాజరవుతున్నా. వేద గణితం, సంగీతం, బొమ్మల తయారీ వంటివి ఆసక్తిగా ఉన్నాయి. ప్రత్యేకించి నాకు నచ్చిన కథలు ఇక్కడ చదువుకోవడం మరీ నచ్చింది.

కౌషిక్, ఏడోతరగతి


శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి..

గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో ఈనెల 15నుంచి మొదలైన వేసవి శిక్షణ శిబిరం జూన్‌ 7వ తేదీ వరకు జరుగుతుంది. పిల్లలు విజ్ఞాన అంశాలను నేర్చుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని గ్రంథాలయాలకు పంపించేందుకు ప్రోత్సహించాలి. కథలు చదివించడం, సమీక్షలు నిర్వహించడం, వేదగణితం, పేపర్‌ క్రాఫ్ట్, స్పోకెన్‌ ఇంగ్లీష్‌ తదితర విభాగాల్లో నిపుణులైన ఉపాధ్యాయులు శిక్షణ అందిస్తున్నారు. ప్రముఖ నాయకుల జీవిత చరిత్రలు చదవడం ద్వారా పిల్లల్లో చక్కటి వ్యక్తిత్వం అలవడేందుకు దోహదం చేస్తుంది. 

ఘంటా శ్రీదేవి, గ్రంథాలయాధికారిణి, గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని