logo

స్పందన అర్జీలు గుణాత్మకంగా పరిష్కరించాలి

స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీ మళ్లీ రీవోపెన్‌ కాకూడదని, సమస్యను నిర్దేశిత సమయంలోగా గుణాత్మకంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌

Updated : 24 May 2022 05:11 IST

దుకాణం ముందు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారంటూ ఫొటోను చూపుతున్న మాధవి, శ్రీనివాస్‌లు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీ మళ్లీ రీవోపెన్‌ కాకూడదని, సమస్యను నిర్దేశిత సమయంలోగా గుణాత్మకంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అర్జీలు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా తిరస్కరణకు గురికాకుండా చూడాలన్నారు. డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో ఒక్క ఫోన్‌ కాల్‌ను కలెక్టర్‌ మాట్లాడారు. అనంతరం ప్రజల నుంచి సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, డీఆర్‌వో కె.చంద్రశేఖర్‌రావు, ప్రత్యేక కలెక్టర్‌ వినాయకం అర్జీలను స్వీకరించారు. స్పందనకు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

2016లో చేరిన స్టాఫ్‌ నర్సుల డేటా లేదంట..: ప్రభుత్వాసుపత్రిలో 2016లో స్టాఫ్‌ నర్సులుగా చేరిన వారి డేటా లేదంటున్నారంటూ స్టాఫ్‌ నర్సులు సోమవారం స్పందన కార్యక్రమానికి తరలివచ్చారు. ఒప్పంద పద్ధతిన 2016లో 160 మంది స్టాఫ్‌ నర్సులుగా ఉద్యోగంలోకి వచ్చామని, ఇటీవల ప్రభుత్వం తమను రెగ్యులర్‌ చేసే ప్రక్రియలో భాగంగా వివరాలు పంపాలనడంతో సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి అడిగితే అసలు మీ డేటా లేదని చెబుతున్నారని వారు వాపోతున్నారు. 2016లో వచ్చిన తమ వివరాలు నమోదు చేయకుండా మా స్థానంలో 2020లో చేరిన వారి డేటాను నమోదు చేస్తున్నారన్నారు. జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు పలువురు నర్సులు.

దుకాణాలకు అడ్డుగా పార్టీ బ్యానర్‌ ఏర్పాటు: తుళ్ళూరు గ్రామం లైబ్రరీ సెంటర్‌లో తమ దుకాణాలకు అడ్డుగా పార్టీ బ్యానర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వాపోతూ గ్రామానికి చెందిన రావెల మాధవి, శ్రీనివాస్‌లు స్పందనలో అర్జీ అందించారు. దుకాణాలు తీసేందుకు వీల్లేకుండా బ్యానర్‌ను ఏర్పాటు చేస్తున్నారని, తొలగించమని పంచాయతీ అధికారులను కోరితే వారు కూడా స్పందించడం లేదని, అదేమంటే దుకాణానికి రోడ్లు భవనాల శాఖ అనుమతి తీసుకోలేదని చెబుతున్నారని వాపోయారు. ఆ తర్వాత బ్యానర్‌ తొలగించినా సీఆర్‌డీఏ అనుమతి లేదని, దుకాణంలో వ్యాపారానికి అనుమతి లేదని, వీటిలో వ్యాపారం నిషిద్ధమని బ్యానర్లను మళ్లీ కట్టారన్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా షట్టరుకు నోటీసు అంటించి దుకాణానికి సీల్‌ వేశారన్నారు. అధికారులు స్పందించి తమ దుకాణాల ముందున్న బ్యానర్‌ తొలగించి, దుకాణాలు నిర్వహించేందుకు అనుమతించాలని కోరారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు

టీటీడీ అటవీ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలి:  టీటీడీ అటవీ ఉద్యోగుల న్యాయమైన సమస్యను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు కోసం టీటీడీ అటవీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం ‘స్పందన’ కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. ధర్నాలో సీఐటీయూ తూర్పు, పశ్చిమ నగర కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు, ఉపాధ్యక్షులు కె.బాబుప్రసాద్‌, బాగ్యరాజ్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని