logo

ఉడకని జీడిపప్పు

వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు.

Published : 20 Apr 2024 05:32 IST

వేటపాలెంలో పరిశ్రమకు కొరవడిన ప్రోత్సాహం

ప్రత్యేక క్లస్టర్‌ ఏర్పాటు హామీ  ప్రకటనలకే పరిమితం

వేల మందికి  కొరవడిన ఉపాధి

 

చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే: వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. రాను రాను స్థానికంగా ముడిసరకు దొరకడం కష్టంగా మారడంతో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వాటిని దిగుమతి చేసుకుని పప్పు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణం కారణంగా ఏప్రిల్‌ రెండో వారం వచ్చినా ముడిసరకు అందుబాటులో లేక నెల రోజులుగా వ్యాపారం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దాదాపు రూ.3 కోట్ల టర్నోవర్‌ నిలిచిపోయిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్‌లోనే కాదు.. ఏటేటా పరిశ్రమకు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కొరవడింది. ఆ ప్రభావం దీనిపై ఆధారపడిన వందల మందిపై ప్రభావం చూపుతోంది.

ఉడకబెట్టే యంత్రాలకు రాయితీ రుణాలేవీ?

మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశ్రమలోకి యంత్రాలు వచ్చేశాయి. విత్తనాలు కాల్చడం వలన ఏర్పడే కాలుష్యం ప్రభావంతో చుట్టుపక్కల వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వీటిని మార్పుచేయాలని సూచించడంతో ఒక్క వేటపాలెం ప్రాంతంలో ఉన్న వ్యాపారులు 70 శాతం వరకు గింజలు ఉడకబెట్టి పప్పు తీసి విక్రయిస్తున్నారు. గింజలను ఉడకబెట్టి పప్పు తయారు చేయడానికి సంబంధించిన యంత్రాలు కొనుగోలుకి రాయితీపై రుణాలు అందించాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ముడిపప్పు రావడంతో ఎక్కువ మంది వ్యాపారులు దీనిపై ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు దాదాపు 5 వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవించే ఈ పరిశ్రమ మీద ప్రస్తుతం రెండువేల మందికి మాత్రమే ఉపాధి పొందుతున్నారు. అంతే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పప్పు ఎటువంటి ఆంక్షలు లేకుండా రావడంతో అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ దుకాణాలకు పంపుతున్నారు.

అనుబంధ పరిశ్రమలకు అవకాశం

ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఈ పరిశ్రమ నుంచి ఆదాయం వస్తోంది. అయినా పరిశ్రమ అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అంతే కాకుండా ఎటువంటి రాయితీలు, ప్రోత్సాహాకాలు కూడా ఇవ్వని పరిస్థితి. వ్యాపారుల క్లస్టర్‌గా ఏర్పడితే ప్రభుత్వపరంగా సాయం అందిస్తామని కొత్తగా జిల్లా ఏర్పడిన తరువాత పరిశ్రమల శాఖాధికారులు స్థానిక వ్యాపారులతో సమావేశాలు నిర్వహించారు. దీని కోసం కనీసం 20 ఎకరాల స్థలాన్ని వ్యాపారులే సమకూర్చుకోవాలని అధికారులు చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో స్థలానికి విపరీతమైన గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో అంత స్థలాన్ని కొనుగోలు చేయడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో క్లస్టర్‌ ఏర్పాటు ప్రతిపాదన అటకెక్కింది. క్లస్టర్‌ ఏర్పడితే అనుబంధంగా పప్పు తయారీతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. వేల మందికి ఉపాధి లభిస్తుంది. కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసింది.


తోటల పెంపుపై దృష్టి ఏదీ?

ఉమ్మడి జిల్లాలో బాపట్ల జీడిమామిడి పరిశోధనా సంస్థ, ముత్తాయిపాలెం, ప్యార్లీ, ఈపూరుపాలెం, వేటపాలెం, కడవకుదురు, తెట్టు, నాయునిపల్లి, చినగంజాం, పెదగంజాం, ఈతముక్కల ప్రాంతాల్లో దాదాపు 20 వేల ఎకరాల్లో జీడితోటలు రెండు దశబ్దాల క్రితం వరకు ఉండేవి. స్థిరాస్తి వ్యాపారం రాకతో పలుప్రాంతాల్లో వీటిని తొలగించి ఇళ్ల స్థలాలుగా మార్చారు. స్థానికంగా వేరుసెనగ పంట ఆశాజనకంగా ఉండటంతో తోటలను తీసివేశారు. క్రమేపి వీటి విస్తీర్ణం తగ్గిపోతుందని గ్రహించిన గత ప్రభుత్వం ఉద్యానవనశాఖ ద్వారా వీటిని పెంచడానికి మొక్కలు, వాటిని నాటడానికి తీసిన గుంతలు, ఎరువులు, రెండేళ్ల పాటు సంరక్షించేందుకు రైతులకు రాయితీలు కూడా ఇచ్చింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఈ తోటల పెంపకం పెరిగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితి లేకపోవడంతో ఎక్కడ కూడా కొత్తగా తోటల పెంపకం అనేది లేకపోవడం గమనార్హం.


వేటపాలెంలో జీడిపప్పు  కర్మాగారాలు: 10
దుకాణాలు: 33
నెలవారి పప్పు అమ్మకాలు: 50 వేల కిలోలు
ఆధారపడి జీవించే వారి సంఖ్య: 2 వేలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని