logo

జగనన్న సమర్పించు.. గోతుల రాజ్యం!

జగనన్న పాపాలు ఎన్నని చెప్పేది..  ఎందెందు వెతికినా.. అన్నింటా లోపాలే.. అన్నిచోట్లా అసమర్థ పాలనే! రోడ్లను చూడండి... రాళ్లు తేలి.. గుంతలు పడి... బీటలువారి.. కనీసం ద్విచక్ర వాహనమైనా ముందుకు కదల్లేని దుస్థితి.

Updated : 23 Apr 2024 07:50 IST

ముందుకు సాగని రోడ్ల నిర్మాణం, మరమ్మతులు
బిల్లులు రాక.. గుత్తేదారుల వెనకడుగు

 ఈనాడు, అమరావతి: జగనన్న పాపాలు ఎన్నని చెప్పేది..  ఎందెందు వెతికినా.. అన్నింటా లోపాలే.. అన్నిచోట్లా అసమర్థ పాలనే! రోడ్లను చూడండి... రాళ్లు తేలి.. గుంతలు పడి... బీటలువారి.. కనీసం ద్విచక్ర వాహనమైనా ముందుకు కదల్లేని దుస్థితి. ప్రభుత్వ చేతకానితనాన్ని వెక్కిరిస్తున్నా.. సీఎం మాత్రం ఏమీ చేతకాక... ఇంకేమీ చేయలేక అర్ధనిమీలిత నేత్రాలతో తనదైన ప్రపంచంలోనే మునిగితేలుతున్నారు. ఈ అయిదేళ్లూ అలాగే కాలం గడిపేశారు.

జగనన్న పాలనలో ఓ రంగం మాత్రం మూడు పువ్వులు... ఆరుకాయలుగా వికసిస్తోంది. అదే వైద్య విభాగంలోని కీళ్లు, ఎముకల విభాగం. రోడ్లెక్కి వెళ్లిన ఎంతోమంది నడుము, వెన్నెముక, కీళ్ల నొప్పులతో ఆసుపత్రులకు పరుగులు తీయడమే దీనికి కారణం. అష్టవంకర్లుగా ఉన్న రోడ్ల దెబ్బకు గోతుల్లో పడి ప్రమాదాలకు గురై కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్న వారెంతమందో లెక్కే లేదు. గోతులను తప్పించబోయి ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొట్టి ప్రాణాలు పోగొట్టుకున్నవారి సంఖ్యా తక్కువేమీ కాదు. ఈ పాపం అక్షరాలా జగన్‌ సర్కారుదే. ఎందుకంటే గత అయిదేళ్ల కాలంలో రోడ్ల నిర్వహణకు డబ్బులిచ్చింది లేదు. ఏవో పథకాల ద్వారా వచ్చిన మొత్తాలనూ దారి మళ్లించేసి జనాన్ని కష్టాలపాల్జేసిన ఘనత సీఎందే. దీనికో మంచి ఉదాహరణ న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు రుణంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో చేపట్టిన రోడ్ల పనులు. మిగ్‌జాం తుపాను ధాటికి అవి పూర్తిగా శిథిలమైపోయినా జగన్‌లో ఉలుకూపలుకూ లేదు. చివరకు ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలను నిషేధించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిన దుస్థితి. ఇదీ వైకాపా సర్కారు ఘనత!!  

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 13 రహదారుల అభివృద్ధికి 2021 మార్చిలో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) నిధులు 121.46 కోట్లు మంజూరయ్యాయి. అభివృద్ధి చేయాల్సిన రోడ్ల మొత్తం పొడవు 95.497 కి.మీ. ఒప్పందం ప్రకారం 2023 మార్చినాటికి పనులన్నీ పూర్తి కావాలి.  లాక్‌డౌన్‌ కారణంగా గడువును మరో 9 నెలలపాటు పొడిగించి 2023 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. ఇప్పటికి ఒక్క రహదారి పనులే పూర్తయ్యాయి. మరో రోడ్డు పనులు 90 శాతం పూర్తవగా.. మిగిలినవాటిల్లో కొన్నింటిని అసలు ప్రారంభించనే లేదు. బిల్లులు రాక మరికొన్ని పనులను మధ్యలోనే ఆపేశారు. ఇంకొన్ని నత్తనడకన సాగుతున్నాయి.

తుళ్లూరు - అమరావతి

 అమరావతి-విజయవాడ రహదారిలో తుళ్లూరు నుంచి అమరావతి వరకు రూ. 44.18 కోట్లతో 20 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధికి 2022 అక్టోబరు 27న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. ఇతర రహదారుల పనుల బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారు ఈ రహదారి పనుల్లో జాప్యం చేస్తున్నారు. కల్వర్టులు, పెద్దమద్దూరు వంతెన నిర్మాణాన్ని ప్రారంభించినా ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. గోతుల దెబ్బకు ఆర్టీసీ బస్సులు ఎక్కడ ఎప్పుడు మొరాయిస్తాయో చెప్పలేని పరిస్థితి. ప్రయాణ సమయం, ఇంధనం వృథా అవుతుండటంతో ప్రైవేటు వాహనాల వారు ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లుతున్నారు.  

గుజ్జనగుండ్ల - పెదపలకలూరు

 గుజ్జనగుండ్ల నుంచి పెదపలకలూరుకు వెళ్లే రహదారిలో రత్నగిరికాలనీ నుంచి 1.7 కిలోమీటర్ల మేర విస్తరణ పనులను రూ. 4 కోట్లతో ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇరువైపులా 24 అడుగుల రోడ్డుతోపాటు 7 అడుగుల వెడల్పుతో డివైడర్‌ నిర్మించనున్నారు. ఇది పూర్తయితే అటు పలకలూరు, పేరేచర్ల వైపు నుంచి గుంటూరు నగరంలోకి వచ్చేవారికి సౌకర్యంగా ఉంటుంది. ఇంత కీలకమైన నిర్మాణానికి ప్రభుత్వం బిల్లులివ్వడం లేదు. గుత్తేదారు 500 మీటర్ల మేరకే చేసి పనులాపేశారు. ఈ మార్గంలో వాహనచోదకులు పడుతున్న అవస్థలు దేవుడికే ఎరుక.  

శారదాకాలనీ - రెడ్డిపాలెం

 గుంటూరు నగర శివారులో శారదాకాలనీ నుంచి రెడ్డిపాలెం మీదుగా అంతర వలయ రహదారికి అనుసంధాన రహదారి నిర్మాణ పనులను గతేడాది గుత్తేదారు ప్రారంభించే సరికి ఆర్థిక సంవత్సరం మారిపోయింది. దీంతో 2023-24 బËడ్జెట్‌లో రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు ధ్రువీకరించాలని గుత్తేదారు ఆర్‌అండ్‌బీ అధికారులను కోరారు. ఈ మేరకు ఇంజినీర్లు ఉన్నతాధికారులకు పంపి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు వివరాలివ్వాలని కోరారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో పనులు ముందుకు సాగలేదు.  

అబ్బినేని  గుంటపాలెం  వల్లూరు

 ప్రత్తిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం - వల్లూరు రహదారిని రూ. 2.06 కోట్లతో 11.24 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయడానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే, హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత 2022 డిసెంబరు 1న శంకుస్థాపన చేశారు. ఏడాది గడిచినా ఒక్కడుగూ ముందుకు పడలేదు. ఈ రోడ్డు దారుణంగా తయారై ద్విచక్రవాహనాలు సైతం ముందుకు కదల్లేని దుస్థితి ఏర్పడింది.  

రూ.100 కోట్ల పనులపై ప్రభావం

  •  క్రషరు నుంచి వచ్చే కంకర, అనుబంధ ఉత్పత్తుల ధరలు క్యూబిక్‌ మీటరుకు ఒక్కసారిగా రూ. 250లకు పెరిగినా ప్రభుత్వం మాత్రం పాత ధర రూ. 90 మాత్రమే చెల్లిస్తుండడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో రూ. 100 కోట్లకుపైగా విలువైన పనులను గుత్తేదారులు ఆపేశారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు అదనపు ధరలను భరించలేమని వారు వెనకడుగు వేస్తున్నారు.  
  •  ఉమ్మడి జిల్లాలో మిగ్‌జాం తుపానుకు రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. వరద నీరు పోటెత్తి చప్టాలు, కల్వర్టులు శిథిలమయ్యాయి. వీటి మరమ్మతుల కోసం అధికారులు రూ. 10 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇలాంటి అత్యవసర పనులకు గత ప్రభుత్వాలు వెంటనే అనుమతులిచ్చేవి. ఇపుడున్నది జగన్‌ సర్కారు. ఎంత అత్యవసరమైనా.. అనుమతుల జాడే లేదు. చప్టాలు దెబ్బతిన్న చోట ఎప్పుడు ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. తాత్కాలికంగా మరమ్మతు చేయిద్దామన్నా గుత్తేదారులు ముందుకు రావడం లేదు.  
  •  గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న 4400 కిలోమీటర్ల మేర రహదారులకు ఏటా చిన్న చిన్న ప్యాచ్‌ పనులు, పిచ్చి మొక్కల తొలగింపు, గోతులు పూడ్చడం వంటివి చేపడుతుంటారు. సింగిల్‌ రోడ్డుకైతే కిలోమీటరుకు రూ. 20 వేలు, రెండు వరుసల రోడ్డుకు రూ. 40 వేల చొప్పున ఇస్తుంటారు. ఈ నిధులతో సంబంధిత రహదారిలో 11 నెలలపాటు పనులు దక్కించుకున్న గుత్తేదారు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. వీటికి కార్యనిర్వాహక ఇంజినీరు స్థాయిలో అనుమతులిచ్చి పనులు అప్పగిస్తారు. బాగా అధ్వానంగా ఉన్న రహదారులను అత్యవసర మరమ్మతు కింద అంచనాలు వేసి బాగు చేస్తారు. వీటికి ముఖ్య ఇంజినీరు అనుమతి ఇచ్చి నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. సకాలంలో నిధులు విడుదల కాక.. కొన్ని రహదారుల నిర్వహణ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు.

అభివృద్ధి చేయాల్సిన 13 రోడ్లు ఇవే..

  •  ఉన్నవ నుంచి గుంటూరు-చీరాల రోడ్డుకు అనుసంధానం
  •  తాడికొండ నుంచి రాయపూడి  
  •  తుళ్లూరు - అమరావతి
  •  మంగళగిరి - తాడికొండ
  •  రేవేంద్రపాడు - సీతానగరం
  •  చేబ్రోలు - వట్టిచెరుకూరు
  •  వల్లూరు - వంగిపురం
  •  గనికపూడి - ఉన్నవ
  •  ప్రత్తిపాడు - యడ్లపాడు
  •  చిలకలూరిపేట - కోటప్పకొండ
  •  తెనాలి - సిరిపురం
  • పొన్నూరు - పందిరిపాడు
  •  నిడుబ్రోలు - చందోలు మార్గం
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని