logo

ఉప్పొంగిన ప్రజాభిమానం

ప్రజాభిమానం ఉప్పొంగింది. వైకాపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో జనం కసితో కదిలి కదం తొక్కారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగారు. ఆ ప్రాంతమంతా పసుపు, తెలుపు, కాషాయ వర్ణాలమయమైంది. ఎమ్మార్పీస్‌ దండు సైతం వారి జెండాలతో కదిలారు.

Published : 23 Apr 2024 06:25 IST

 కసితో కదిలొచ్చారు..
 అంగరంగ వైభవంగా పెమ్మసాని చంద్రశేఖర్‌, గళ్లా మాధవి నామినేషన్లు

బృందావన్‌ గార్డెన్స్‌ కూడలిలో పెమ్మసాని ర్యాలీ

పట్టాభిపురం, కలెక్టరేట్‌, ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ప్రజాభిమానం ఉప్పొంగింది. వైకాపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో జనం కసితో కదిలి కదం తొక్కారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగారు. ఆ ప్రాంతమంతా పసుపు, తెలుపు, కాషాయ వర్ణాలమయమైంది. ఎమ్మార్పీస్‌ దండు సైతం వారి జెండాలతో కదిలారు. వీరంతా రావడం ఒక ఎత్తు అయితే యువతీ యువకులు, మహిళలు, వృద్ధులు సైతం స్వచ్ఛందంగా తరలివచ్చారు. తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, తెదేపా గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవిల నామినేషన్ల ఘట్టం అట్టహాసంగా సాగింది.

తెలుగు తమ్ముళ్లలో జోష్‌... సంప్రదాయ నృత్యాలు.. తీన్‌మార్‌ డప్పులు.. ఒడిస్సీ నృత్యాలు.. సైకిల్‌ గుర్తుతో బుట్టబొమ్మలు.. సూపర్‌-6 పథకాలతో ప్రచార రథాలు... గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఎద్దుల బండి నమూనా ఇలా.. పెమ్మసాని చంద్రశేఖర్‌, గళ్లా మాధవిల నామినేషన్ల ర్యాలీలో ప్రతిదీ ప్రత్యేకమే. వీటన్నింటినీ మించి ఆకాశంలో విహరిస్తూ పారాచూట్ డ్రోన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బృందావన్‌ గార్డెన్స్‌లోని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని ఎన్నికల కార్యాలయంలో చంద్రశేఖర్‌, శ్రీరత్న దంపతులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. గళ్లా మాధవి బృందావన్‌ గార్డెన్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె పెమ్మసాని ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రచారరథంపై చంద్రశేఖర్‌, శ్రీరత్న, మాధవి గుజ్జనగుండ్ల సెంటర్‌కు చేరుకున్నారు. తర్వాత ర్యాలీ స్తంభాలగరువు చేబ్రోలు హనుమయ్య సెంటర్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, లక్ష్మీపురం మీదుగా లాడ్జి సెంటర్‌కు చేరుకొంది. అంబేడ్కర్‌ విగ్రహానికి పెమ్మసాని చంద్రశేఖర్‌, గళ్లా మాధవి నివాళులర్పించారు. అప్పటికే సమయం మించిపోవడంతో గళ్లా మాధవి ద్విచక్ర వాహనంపై నగరపాలక సంస్థకు చేరుకున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, గుంటూరు పశ్చిమ ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు మన్నవ మోహనకృష్ణ, మద్దిరాల మ్యాని, నిమ్మల శేషయ్య, తాళ్ల వెంకటేష్‌ యాదవ్‌, కనపర్తి శ్రీనివాసరావు, పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, భాజపా జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర, జనసేన వీర మహిళ రజని తదితరులు ప్రచారరథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్లన్నీ జనజాతర తలపించాయి. ద్విచక్ర వాహనాలకు, సైకిళ్లకు జెండాలు కట్టుకొని యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

రిటర్నింగ్‌ అధికారిణికి నామపత్రాలు అందజేస్తున్న తెదేపా పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి తదితరులు

ఊహించని జనప్రభంజనం.. నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ‘నామినేషన్‌ కార్యక్రమానికి వేలాది మంది తరలిరావడం ఎంతో సంతోషంగా ఉంది. నామినేషన్‌ వేసిన రోజే నా విజయం ఖాయమైంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తా. అమరావతికి వైకాపా ప్రభుత్వం చేసిన అన్యాయంతో జనంలో కసి పెరిగింది. అవినీతికి, స్వార్థానికి తావు లేకుండా శక్తి మేరకు ప్రజలకు సహాయం చేస్తా. చంద్రబాబు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తాం. ఇదే ఉత్సాహం పోలింగ్‌ రోజున కూడా చూపాలి. నామినేషన్‌ సందర్భంగా ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమై ప్రజలు ఇబ్బందులు పడినందుకు క్షమాపణలు చెబుతున్నాం. నామినేషన్ల ఘట్టాన్ని అంచనాలకు మించి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు’..అని తెలిపారు.

 పెమ్మసాని నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు ఆయనతో పాటు ఇతరులను కలెక్టరేట్‌ లోపలకు అనుమతించకపోవడంతో మాజీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్‌, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌లు అసహనం వ్యక్తం చేశారు.  

జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్‌రెడ్డికి నామినేషన్‌ పత్రాలు అందిస్తున్న ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తదితరులు

బుల్లెట్‌పై మహిళ జోష్‌..

నామినేషన్‌ వేసేందుకు భారీ ప్రదర్శనగా వస్తున్న రామాంజనేయులు

ప్రజలకు అభివాదం చేస్తున్న తెదేపా తూర్పు అభ్యర్థి నసీర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని