logo

మిత్ర ద్రోహం

పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు.

Published : 25 Apr 2024 05:14 IST

గోపాలమిత్రుల వేతనం పెంపుపై మాటిచ్చి తప్పిన జగన్‌

నెహ్రూనగర్‌, న్యూస్‌టుడే : పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. గ్రామ స్థాయిలో మూగ జీవాలకు సత్వర వైద్యం అందించే లక్ష్యంతో గోపాల మిత్ర వ్యవస్థను రూపొందించారు. వారి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. 2006లో ఈ వ్యవస్థ ప్రారంభం కాగా.. అప్పట్లో గోపాలమిత్రలకు నెలకు రూ.1,200 జీతం అందించి మూడు నెలలు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత నెలకు రూ. 3,500 జీతం చేశారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలకు రూ.6,500 వేతనం పెంచారు.  నేడు రైతు భరోసా కేంద్రా(ఆర్‌బీకే)లను తీసుకువచ్చి కొత్తగా యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌ (ఏహెచ్‌ఏ) పోస్టులను తీసుకు వచ్చారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న గోపాల మిత్రలను ఏహెచ్‌ఏలుగా తీసుకోకుండా వెటర్నరీ డిప్లొమా కోర్సుల పేరుతో పరీక్షలు నిర్వహించి..వారిని నియమించి తమకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 230 మంది వరకు  గోపాలమిత్రలు సేవలందిస్తుండగా వారిలో సుమారు 30 మంది పరీక్షలు రాసి ఏహెచ్‌ఏలుగా పనిచేస్తున్నారు. పలువురు ఉద్యోగాలు మానేశారని, మిగిలిన వారు చాలీచాలనీ వేతనాలతో, అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని నెలలు తరబడి నిరసనలు, నిరాహార దీక్షలు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు.

అన్యాయం చేశారు

మాకు మూడు నెలలు శిక్షణ ఇచ్చారు. రెండున్నర దశాబ్దాలుగా గోపాలమిత్రగా పనిచేశాను. ఇప్పుడు ఏహెచ్‌ఏలను నియమించుకుంటూ మాకు అన్యాయం చేశారు. ఇదేమి న్యాయమో చెప్పాలి.

శ్రీనివాసరావు


కుటుంబ పోషణ ఎలా?

గోపాల మిత్రలకు రూ.16 వేల వేతనం చేస్తానని జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చి అయిదేళ్లయినా అమలు చేయకుండా మోసగించారు. ఈ రోజుల్లో రూ. 6,500లతో కుటుంబ పోషణ ఎలా సాధ్యమవుతుంది. నిత్యావసరాలతో పాటు కరెంట్‌ ఛార్జీలు, ఇంటి పన్నులు పెంచేశారు.  

సాంబశివరావు


ఉద్యోగ భద్రత లేదు

ఏళ్లుగా గోపాల మిత్రగా సేవలందిస్తున్నా. జగన్‌ అధికారంలోకి రాగానే జీతం రూ. 16,000 చేస్తానంటే ఆశపడి అతనికి ఓటు వేసి గెలిపించాం. అయిదేళ్లుగా ఒక్క రూపాయి వేతనం పెంచలేదు. అనేకమంది ఉద్యోగాలు మానేసి పనులు చేసుకుంటున్నారు.

వెంకటరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని