logo

అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!

రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్‌ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు.

Updated : 25 Apr 2024 06:12 IST

మృత్యుకుహరాలుగా మారిన క్వారీ గుంతలు

రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్‌ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. చిన్నగుంతే కదా అనుకుని దిగారు. అది చాలాలోతు ఉండి నలుగురి విద్యార్థులను బలి తీసుకుంది. ఉన్నత విద్య చదువుతున్న కుమారులు అకాలమృతితో వారి తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం.

దాచేపల్లి మండలం పొందుగల శివారు గ్రామం శ్రీనివాసపురంలో ఇద్దరు బాలురు రెండున్నర ఏళ్ల క్రితం స్థానికంగా ఉన్న క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలోనూ వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది.

న్యూస్‌టుడే, యడ్లపాడు, చిలకలూరిపేట గ్రామీణ

కొండలు.. గుట్టలు.. వాగులు.. వంకలు.. ఏవైనా వైకాపా నాయకుల అక్రమ దోపిడీకి విలవిల్లాడాయి. ఇసుక, మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తవ్వుకుని అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో అక్రమార్కులు ఎంతగా బరితెగించారో తవ్విన ప్రదేశాల్లో ఏర్పడిన గోతులు చూస్తే తెలుస్తోంది. వాటి వద్ద ఎలాంటి రక్షణ చర్యలు లేక ప్రమాదకరంగా మారాయి. గోతుల్లో నీరు నిలవడంతో సరదాగా ఈతకు అని దిగిన అమాయకుల ప్రాణాలు తీశాయి.

వైకాపా పాలనలో గ్రావెల్‌, ఇసుక మాఫియాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అసైన్డ్‌, కొండ, వాగు, పోరంబోకు భూముల్లో నిబంధనలకు విరుద్దంగా యంత్రాలతో తవ్వకాలు సాగించారు. దీంతో లోతైన గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. వాటి వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రాణాలు బలితీసుకున్నాయి. బోయపాలెం, యడ్లపాడు, కోటప్పకొండ, యడవల్లి, పిడుగురాళ్ల, వినుకొండ తదితర ప్రాంతాల్లో భారీఎత్తున మెటల్‌ క్వారీలు ఉన్నాయి. ఆయా క్వారీల్లో నిర్దిష్ట ప్రమాణాలు, నిబంధనలు పాటించకుండా లోతుగా తవ్వకాలు చేపట్టారు. వర్షాకాలంలో కురిసిన వానలకు వాటిల్లో నీరు నిలిచి పైకి సాధారణ గుంతల మాదిరిగా కనిపిస్తున్నాయి. యువకులు, విద్యార్థులు వేసవిలో ఈత కోసం వాటిలో దిగుతున్నారు. ఈ క్రమంలో లోతు అధికంగా ఉండడంతో మృత్యువాత పడుతున్నారు గత ఐదేళ్లలో జిల్లాలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

చిలకలూరిపేట ఓగేరు వాగులో అక్రమార్కులు బావి తవ్వి ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా వదిలేశారు. పట్టణంలోని శారదా పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి రెండేళ్ల కిత్రం ఆడుకోవటానికి స్థానిక ఓగేరు వాగు వద్దకు వెళ్లాడు. వాగులో బావి ఆనవాళ్లు కనిపించ లేదు. ఈత కొట్టడానికి వాగులో దిగడంతో లోతైన బావిలో మునిగి మృతి చెందాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు మృతితో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. కూలీపనులు చేసుకుని జీవిస్తున్న వారు కుమారుడి మరణాన్ని తట్టుకోలేక పోయారు.  

యడ్లపాడు: సంగం గోపాలపురంలో అక్రమ మట్టి తవ్వకాలతో ఇలా..

రక్షణ చర్యలు శూన్యం

నిరుపయోగంగా ఉన్న క్వారీ గుంతలు, మట్టి తవ్వకాల వద్ద నిబంధనల ప్రకారం రక్షణ ఏర్పాట్లు తప్పనిసరి. ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రజలు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేయాలి. పశువులు దిగటానికి వీలు లేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. అయితే నిబంధనలు ఎక్కడా అమలు కావటం లేదు. కనీసం నివాస  ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలకు సమీపంలోని క్వారీ గుంతల వద్ద కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని