logo

యూజీడీ మూలన.. మాటలు మరుగున

నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్‌కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం.

Published : 25 Apr 2024 05:53 IST

వైకాపా వచ్చాక కదలని భూగర్భ డ్రైనేజీ పనులు
జనం ప్రాణాలు పోతున్నా ప్రజాప్రతినిధులకు పట్టదు

యూజీడీ పనుల పూర్తికి ఇంకా రూ.287 కోట్లు అవసరం. ఆ మేరకు నిధులు మంజూరు చేయండి.

2022 నవంబరు 11న గుంటూరులో నిర్వహించిన మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎం జగన్‌ను సభా ముఖంగా గుంటూరు నగర ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్దాళి గిరిధర్‌లు కోరారు. నిధులిస్తామని చెప్పిన జగన్‌ పైసా విదల్చలేదు.

గుంటూరు నగరంలో జరుగుతున్న యూజీడీ పనులపై విచారణ చేయిస్తాం. అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయితే గుత్తేదారును మారుస్తాం. టెండర్లు పిలిచి మరో గుత్తేదారుకు పనులు అప్పగించి పనులు పూర్తి చేస్తాం.

ఇదీ వైకాపా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నగర పర్యటనకు వచ్చిన అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చిన హామీ. ఆయన ఆ పదవిలో ఉన్నంత కాలం పనుల దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు.

ఇదీ పొన్నూరు రోడ్డు. మురుగు నీటి కాల్వలో పారుదల లేక రోజుల తరబడి నిలిచిపోతోంది.  నీళ్లు పచ్చగా మారిపోయాయి. నగరపాలక అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.

ఈనాడు -అమరావతి, న్యూస్‌టుడే

నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్‌కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. రాష్ట్రంలోనే ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదొకటి. ఎప్పుడో దశాబ్దాల నాటి పురాతన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూడిపోయింది. తరచూ తాగునీటి పైపుల్లో మురుగునీరు కలిసిపోయి సరఫరా అవుతోంది. డయేరియా బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోయినా వైకాపా ఎమ్మెల్యే ముస్తఫాకు మాత్రం సమస్య తీవ్రత పట్టలేదు. ప్రజారోగ్యం క్షీణిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆ మధ్య కుమార్తెతో కలిసి పాతగుంటూరులో ఎమ్మెల్యే పర్యటిస్తుండగా కోడిగుడ్లు విసిరి మరీ నిరసన తెలిపారు. గత పదేళ్లుగా ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నా డ్రైనేజీ పనుల పూర్తికి శ్రద్ధ పెట్టలేదు.

ఎక్కడెక్కడ ఎంతెంత..?

గుంటూరు నగరానికి యూజీడీ పథకాన్ని మంజూరు చేసిన కేంద్రం రూ.500 కోట్లు విడుదల చేసింది. కేటాయించిన మొత్తం నిధులు ఖర్చయ్యాయి. పశ్చిమ, తూర్పు, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే డివిజన్లలో మొత్తం 1083 కి.మీ మేర చేపట్టేలా 2017లో పనులకు శ్రీకారం చుట్టారు. పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గ డివిజన్లలో మాత్రమే భూగర్భంలో పైపులైన్లు వేసి, మ్యాన్‌హోల్స్‌, ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్లు నిర్మించి కనెక్షన్లు ఇచ్చారు. రెండు నీటి శుద్ధి ప్లాంట్లు 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. మొత్తంగా ప్రాజెక్టు పనులు 60 శాతానికి మించి పూర్తికాలేదు. ఒక్క తూర్పు నియోజకవర్గం మాత్రమే తీసుకుంటే పనులు 45శాతం లోపే ఉంటుంది.

  • తూర్పులో మూడు నీటి శుద్ధి ప్లాంట్లు(ఎస్‌టీపీ) కట్టాలి. ఇంకా 50 శాతానికి పైగా పైపులైన్ల పనులు వేయాలి. చౌత్రాసెంటర్‌, పాతగుంటూరు, సంగడిగుంట, ఆర్‌ అగ్రహారం తదిదర ప్రాంతాల్లో అసలు పైపులే వేయలేదు.
  • ఇటీవల శారదాకాలనీ, సంగడిగుంట, నెహ్రూనగర్‌ ప్రాంతాల్లో డయేరియా కేసులు రాగా అప్పట్లో ముగ్గురు చనిపోయారు. వారంతా తూర్పు నియోజకవర్గానికి చెందినవారే. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా ఎమ్మెల్యేకు పట్టలేదు. పనుల పూర్తికి నిర్దేశించుకున్న గడువు పూర్తయింది. కేంద్రం కేటాయించిన నిధులు ఖర్చయిపోయాయి. తిరిగి ఈ పనులు పట్టాలెక్కించాలంటే నగరపాలిక వాటాతో పాటు రాష్ట్రం నిధులివ్వాలి. వైకాపా పాలకులు పూర్తిగా దీన్ని విస్మరించడంతో ప్రజలు అసంపూర్తి పనులతో గుంతల దారుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.

ఎమ్మెల్యే ముస్తాఫా నివాసం ఉండే మంగళదాస్‌నగర్‌లోనే మురుగుకాల్వలు లేని దుస్థితి. డ్రెయిన్‌లో వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఎమ్మెల్యే వద్ద సమస్యపై మొత్తుకున్నా డ్రెయిన్ల నిర్మాణానికి చొరవ చూపలేదన్న అసంతృప్తి స్థానికుల్లో నెలకొంది.


ఇదీ పాతగుంటూరు శివాలయం రహదారి. కాల్వలు సరిగా లేక మురుగు నీరంతా రోడ్ల మీదకు వచ్చి చేరడం ఇక్కడ నిత్యకృత్యమే. ఈ మురుగునీటితో స్థానికంగా పారిశుద్ధ్యం క్షీణించి ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తోంది.


ఇదీ పాతగుంటూరు బీఆర్‌ స్టేడియం రోడ్డు. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కల్వర్టులు లేక రోడ్డుపై మురుగు నీరు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. తరచూ నీళ్లు ఇలా రోడ్ల మీదకు చేరతాయి. ఏడాది పొడవునా తమకు మురుగు నీటి ఇక్కట్లు తప్పడం లేదని స్థానికులు వాపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని