logo

జగనన్న పాలన.. మూడుసార్లు వడ్డన

తెదేపా ప్రభుత్వ పాలనలో అన్ని ఛార్జీలు పెంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట కల్పిస్తాం. పెంపు జోలికి వెళ్లం.

Updated : 28 Apr 2024 06:16 IST

ప్రయాణికుల జేబులకు చిల్లు..
పల్లె వెలుగు సర్వీసుల కోత
కాలంచెల్లిన బస్సులతో కష్టాలు

తెదేపా ప్రభుత్వ పాలనలో అన్ని ఛార్జీలు పెంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట కల్పిస్తాం. పెంపు జోలికి వెళ్లం.

ఇదీ సీఎం జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాట.

ఈనాడు, అమరావతి- న్యూస్‌టుడే, ప్రత్తిపాడు,  పొన్నూరు, తెనాలి టౌన్‌: బాదుడే.. బాదుడు.. కుడిచేత్తో మైకు పట్టుకుని.. ఎడమ చేయి గాల్లోకి అలా ఊపుతూ రాగాలు తీస్తూ చెప్పిన ఈ మాటలు ఇంకా ఓటర్ల చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు ఇప్పటికీ వైరల్‌ అవుతూనే ఉన్నాయి.. జగన్‌ చెప్పారంటే చేయరంతే అని చెప్పడానికి ఆర్టీసీ ఛార్జీలే నిదర్శనంగా నిలుస్తాయి. జగన్‌ అయిదేళ్ల పాలనలో ముచ్చటగా మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. గతంలో కనీస ఛార్జీ రూ.5 ఉన్నదాన్ని ప్రస్తుతం రూ.15 చేశారు. ఊరట మాట నమ్మి ఓటేసిన పేద, మధ్య తరగతి ప్రజలకు పెరిగిన ఛార్జీలు అశనిపాతంలా మారాయి. సగటు మహిళ  2 కి.మీ దూరం వెళ్లి రావడానికైనా పర్సులో రూ.30 పెట్టుకుంటేనే బయటకు వెళ్లే పరిస్థితి నెలకొంది.

సామాన్యులు అధికంగా ఆధారపడే ఆర్టీసీ ప్రగతిరథ చక్రాలకు జగనన్న పాలనతో పంక్చర్‌ పడింది. కొత్తబస్సుల కొనుగోలు మాటే లేదు. పాత డొక్కు బస్సులతోనే డ్రైవర్లు బిక్కుబిక్కుమంటూ నడుపుతున్నారు. 15 లక్షల  కి.మీ తిరిగేసిన తుక్కు బస్సులను తిప్పుతుండడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. రోడ్డు మధ్యలో ఆగిపోతున్న బస్సులు.. స్టీరింగ్‌ పట్టేసి.. టైర్లు ఊడిపోయి కాలువల్లోకి దూసుకెళ్తున్న ఉదంతాలు నిత్యకృత్యంగా దర్శనమిస్తున్నాయి. పల్లెవెలుగు బస్సుల కొరతతో రోజురోజుకు ఆయా గ్రామాలకు సర్వీసులు కుదించేయాల్సిన దుస్థితి నెలకొంది. ఆయా పల్లెల నుంచి  తక్కువ ఖర్చుతో బస్సులో గుంటూరు నగరానికి రోజూ వెళ్లొచ్చే విద్యార్థులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు ప్రస్తుతం జేబుకు చిల్లుపెట్టుకుని షేరింగ్‌ ఆటోల్లో కిక్కిరిసి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.

1వ సారి తొలి ఏడాదిలోనే... అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2019 డిసెంబరులో వైకాపా ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. కొన్ని సర్వీసులకు కి.మీ.కు 10పైసలు, కొన్ని సర్వీసులకు 20పైసలు చొప్పున వడ్డించారు. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, అల్ట్రాడీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి భారం బాగా పెరిగింది.

2వ సారి బాదుడే... బాదుడు.. డీజిల్‌ సెస్సు, భద్రతా సుంకంతో పాటు కిలోమీటరు చొప్పున 2022 ఏప్రిల్‌ 14న రెండోసారి వడ్డించారు. ప్రధానంగా పల్లెవెలుగు ఛార్జీలు పెంచి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది.

3వ సారి మూడు నెలల్లోపే మరోసారి.. డీజిల్‌ సెస్‌ పేరుతో మూడు నెలల లోపే 2022 జూన్‌ 30న మరోసారి జగనన్న బాదేశారు. పల్లె వెలుగు బస్సుల్లో 35 నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5, 61 నుంచి 70 కి.మీ వరకు రూ.10, 100 కి.మీ దాటితే రూ.20 సెస్‌ విధించారు.

గుంటూరు-1 డిపో నుంచి ప్రత్తిపాడు మీదుగా గనికపూడి గ్రామానికి ఆర్టీసీ బస్సు నిలిపేశారు. గతంలో ఇక్కడ నుంచి రోజూ ఒక బస్సు నాలుగు ట్రిప్పులు తిరిగేది. ఇక్కడి నుంచి విద్యార్థులు, చిరు వ్యాపారులు సుమారు 50 మంది వరకు గుంటూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. గుంటూరుకు వెళ్లాలంటే 6 కి.మీ దూరంలోని ప్రత్తిపాడుకు వెళ్లాలి. షేరింగ్‌ ఆటోకు ఒక్కొక్కరికి రూ.30 ఖర్చవుతోంది. గుంటూరు నుంచి ప్రత్తిపాడుకు బస్సు టికెట్‌ రూ.35కు పెంచారు. వీరు గుంటూరు వెళ్లి రావడానికి రోజుకు రూ.130 ఖర్చు చేయాల్సి వస్తోంది. గతంలో గ్రామం నుంచి నేరుగా బస్సు ఉన్నప్పుడు రూ.80 మాత్రమే ఖర్చయ్యేదని గనికపూడి మాజీ సర్పంచి మేరిగ వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్తిపాడు మండలం వంగీపురం గ్రామానికి గతంలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఉండేది. రోజుకు నాలుగు ట్రిప్పులు తిప్పేవారు. ఇక్కడి నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు ప్రస్తుతం సర్వీసు నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరు వంగీపురం నుంచి 12 కి.మీ దూరంలోని ప్రత్తిపాడుకు వెళ్లి అక్కడి నుంచి గుంటూరుకు బస్సులో వెళ్లాలి. ఆటో నిండితేనే వాహనం కదులుతుంది. ఇరుగ్గా కూర్చుని ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. షేరింగ్‌ ఆటోలు, బస్సులకు వెళ్లాంటే తడిసి మోపెడవుతోంది.

అయిదేళ్లలో ఒక్కటీ కేటాయించలేదు

షేక్‌ యాసిన్‌బాబా, పొన్నూరు

పొన్నూరు ఆర్టీసీ డిపోనకు కొత్త బస్సులు ఏర్పాటు చేయమని అనేకసార్లు అధికారులను కలిసి కోరాం. అయిదేళ్లలో ఇప్పటి వరకు ఒక్క బస్సు కేటాయించలేదు. సమయానికి బస్సులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నాం. బస్సులు రద్దీగా ఉండడంతో అందులో రాకపోకలు నిర్వహించడానికి ఇబ్బందికరంగా ఉంది. బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో సమయానికి గ్యమస్థానానికి చేరుకోలేకపోతున్నాం.

సగానికి పైగా డొక్కు బస్సులే..

ఉమ్మడి గుంటూరు పరిధిలో 12లక్షల కి.మీ కంటే ఎక్కువ తిరిగిన బస్సులు సగానికి పైగా ఉన్నాయి. వీటిని కొనసాగించడం వల్ల తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో నిర్వహణ భాగంగా మారింది. ఇలాకాలం చెల్లిన వాటినే పల్లెవెలుగు సర్వీసుల కింద నడిపిస్తున్నారు. అత్యవసర పనుల మీద వీటిని ఎక్కే ప్రయాణికులకు రోడ్డు పక్కన ఆగిపోయి చుక్కలు చూపిస్తున్నాయి.

పరిణితి లేని పాలనతో ఆర్టీసీ నిర్వీర్యం

వీరవల్లి మురళి, ఆర్టీసీ కార్మిక పరిషత్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు

గతంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా హయాంలో ఆర్టీసీ అన్ని విధాలుగా నష్టపోయింది. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఉద్యోగ విరమణ చేస్తున్న సిబ్బంది స్థానాల్లో కొత్త నియామకాలు లేవు. మరోవైపు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులూ అందుబాటులోకి తీసుకురాలేదు. టిక్కెట్ల ధరలను పెంచేశారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేక ప్రజలు ఇతర వాహనాలను ఆశ్రయించి ప్రమాదాల గురవుతున్నారు. ప్రణాళిక, పరిణితి లేని వైకాపా పాలనే కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని