logo

నా ఎస్సీలంటూనే.. నిలువునా మోసం

ఎక్కడ మాట్లాడినా.. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూ ఎక్కడ లేని ప్రేమను మాటల్లో ఒలకబోసే జగన్‌.. వాస్తవంలోకి వచ్చేసరికి వారికి రిక్తహస్తాలే చూపారు.

Published : 29 Apr 2024 06:01 IST

వైకాపా హయాంలో పథకాలు.. స్వయం ఉపాధి రుణాలు నిలిపేసిన వైనం
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే

ఎక్కడ మాట్లాడినా.. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూ ఎక్కడ లేని ప్రేమను మాటల్లో ఒలకబోసే జగన్‌.. వాస్తవంలోకి వచ్చేసరికి వారికి రిక్తహస్తాలే చూపారు. వైకాపా పాలనలోని అయిదేళ్లూ ఎస్సీ అభివృద్ధి పథకాలు విస్మరించడం, స్వయం ఉపాధి రుణాలు నిలిపివేయడమే దీనికి నిదర్శనం. దేశంలో సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీలను అభివృద్ధి స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంటాయి. గత అయిదేళ్లలో నిరుపేద ఎస్సీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలను నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకాలను సైతం అమలు చేయకపోవడంతో ఎస్సీ వర్గాల అభివృద్ధికి శరాఘాతంగా మారింది.

గత తెదేపా హయాంలో..

గత తెదేపా ప్రభుత్వ హయాం 2014-19లో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకాల ద్వారా 775 మందికి రూ.33,41,27,089 రుణాలు పంపిణీ చేశారు. 173 మందికి రూ.10 లక్షల విలువ గల నాలుగు చక్రాల వాహనాలు ఇవ్వడంతో యజమానులుగా మారారు. రుణాలు పొందిన వారిలో ఎక్కువ మంది స్వయం ఉపాధి యూనిట్లతో జీవోనోపాధి కల్పించుకుని కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నారు. రవాణా విభాగంలో రుణాలు పొందిన వారు నాలుగు చక్రాల వాహనాలను నడుపుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందారు.

వైకాపా అధికారంలోకి వచ్చాక..

2019 సాధారణ ఎన్నికల్లో వైకాపా గెలుపొంది ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గత ప్రభుత్వాలు అమలు చేసిన స్వయం ఉపాధి పథకాల రుణాలు నిలిపివేసింది. దాంతో నిరుపేద ఎస్సీలకు జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నయాపైసా కూడా రుణాలు విడుదల చేయని పరిస్థితి. 2019-24 మధ్య కాలంలో ఎస్సీలకు ఎలాంటి రుణాలు మంజూరు చేయలేదు. కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించకపోవడం గమనార్హం.

కార్పొరేషన్‌ విభజన..  నిధులు శూన్యం

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ని మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం జిల్లా స్థాయిలో విభజన చేయలేదు. నిధులు కూడా కేటాయించకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్‌ నామమాత్రంగా మిగిలిపోయింది. సిబ్బంది తెదేపా ప్రభుత్వం హయాంలో పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి బకాయిలను లబ్ధిదారుల నుంచి రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సిబ్బందికి కూడా మూడు, నాలుగు నెలలకు జీతాలు విడుదల చేస్తుండటంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

ఆసరా లేకుండా చేశారు

షెడ్యూల్డ్‌ కులాల్లో 59 కులాల ప్రజలున్నారు. ప్రధానంగా మాల, మాదిగలతో పాటు ఉప కులాల ప్రజలు సంచార జీవనం సాగిస్తూ అభివృద్ధికి దూరంగా ఉన్నారు. వారి అభివృద్ధికి పాటు పడాల్సిన ప్రభుత్వం పథకాలను నిలిపివేయడంతో జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. స్వయం ఉపాధి పథకంలో కనీసం రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు పొందే అవకాశముంది. ఆ రుణాలతో చేతి వృత్తులు, సూక్ష్మ, లఘు పరిశ్రమలను స్థాపించి ఉపాధి పొందడంతో పాటు మరో పది మంది నిరుద్యోగులకు ఉపాధి చూపించేందుకు అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకం ద్వారా రుణాలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గత అయిదేళ్లలో ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో రుణాలందని పరిస్థితి. దీనివల్ల రెల్లి కులానికి చెందిన వారు పారిశుద్ధ్య కార్మికులుగా.. చర్మకారులు పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన చెప్పులు కుట్టుకుంటూనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొందరు కూలి పనులకు వెళుతున్నారు. మాల సామాజిక వర్గం వారికి పొలం పనులే దిక్కయ్యాయి. వైకాపా ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాల స్థానంలో ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను ఆయా శాఖల ద్వారా నిధులు సమకూర్చి నవరత్నాల కార్యక్రమంలో ఇతర వర్గాల వారికీ ఖర్చు చేస్తుండటంతో ఎస్సీలు నష్టపోయారు.  


ఉప ప్రణాళిక నిర్వచనమే మార్చారు

ఎస్సీల అభివృద్ధికి కేటాయించిన ఉప ప్రణాళిక నిధులు అభివృద్ధి పనులకు కేటాయించాలి. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు పంపిణీ చేయకపోవడంతో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి లేకుండా పోయింది. ప్రభుత్వం అమ్మఒడి, నవరత్నాల కార్యక్రమాలకు ఖర్చు చేసి వాటినే రూ.కోట్లలో చూపుతోంది. దీనివల్ల ఎస్సీల అభివృద్ధి కుంటుపడింది. ఎస్సీలను ప్రభుత్వం మోసం చేసింది.  

 కె.కృష్ణమోహన్‌, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని