logo

ప్రశ్నిస్తే పగ.. స్వేచ్ఛకు సెగ

ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడడానికీ వీల్లేదు. వారి అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడాన్ని సహించరు. అయిదేళ్ల జగన్‌ పాలన అక్షరాలా ఇలాగే సాగింది.

Published : 29 Apr 2024 06:38 IST

సామాజిక మాధ్యమాల్లో పోస్టులపైనా కన్నెర్ర
అర్ధరాత్రి అరెస్టులతో సామాన్యులకు వేధింపులు
అయిదేళ్ల జగన్‌ పాలనలో దారుణాలు ఎన్నో
ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, నెహ్రూనగర్‌, పెదకాకాని, పట్టాభిపురం

ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడడానికీ వీల్లేదు. వారి అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడాన్ని సహించరు. అయిదేళ్ల జగన్‌ పాలన అక్షరాలా ఇలాగే సాగింది. వైకాపా పాలన, ప్రభుత్వ నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫార్వార్డ్‌ చేసిన వారిని వెతికి వెంటాడి వేధించింది. సీఐడీని పావుగా వినియోగించుకుంది. అర్ధరాత్రి వేళ వారి ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేసింది. యువకుల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదిలిపెట్టలేదు. ఉమ్మడి గుంటూరులోనే సీఐడీ ప్రాంతీయ కార్యాలయం మొదలుకుని ఆయా స్టేషన్ల పరిధిలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడమే దీనికి నిదర్శనం.

నిరసన తెలిపినా నేరమే..

ప్రభుత్వ పాలన, నిర్ణయాలు, విధానాలపై ఆందోళనలు, ధర్నాలు చేసిన పాపానికి ఉద్యోగులపైనా కేసులు పెట్టారు. ప్రశ్నించడమే పాపం అనేలా పోలీసులు ప్రధానంగా విపక్షాల నాయకులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల నోరు మూయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలకు పిలుపునిస్తే వాటిల్లో పాల్గొనకూడదంటూ విపక్ష నేతల ఇళ్ల ముంగిటకు వేకువజామునే పోలీసుల్ని పంపారు. వారు రోడ్డెక్కకుండా అడ్డుకున్నారు. పోలీసులు గోడలు దూకి నేతల ఇళ్లల్లోకి ప్రవేశించి మరీ భయభ్రాంతులకు గురిచేశారు.

వేతనాల పెంపు కోరితే ఆశా కార్యకర్తలను ఈడ్చేస్తూ.. (పాతచిత్రం)

ప్రజాస్వామ్యంలో నియంతలా..

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజాప్రతినిధులు సేవకులు మాత్రమే. పాలనలోని లోపాలను విమర్శించడం.. ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు. కానీ అధికార పీఠమెక్కిన జగన్‌కు ప్రజాస్వామ్యంపై కానీ, ప్రాథమిక హక్కులపైగానీ విశ్వాసం లేదనేలా అయిదేళ్ల పాటు వ్యవహరించారు. అధినేతను అనుసరించే అమాత్యులు, ప్రజాప్రతినిధులూ అలాగే వ్యవహరించారు. పోలీసులను తమ దారికి తెచ్చుకున్నారు. ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం చూస్తే జగన్‌ పాలనలో పోలీసులు ఎంత గుడ్డిగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.

2023 అక్టోబర్‌ 3

పార్టీ మారలేదని 32 కేసులు పెట్టారు: గణేష్‌ బాబు, విద్యానగర్‌

అధికార పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అనకాపల్లిలో రాత్రివేళ అరెస్టు చేసి కక్ష సాధించారు. వేకువజాము 3-30గంటలకు గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆయనకు మందులు ఇవ్వడానికి వచ్చిన కుమారుడిని సైతం కలవనీయలేదు.

  • మాది అమరావతి మండలం లింగాపురం.  వైకాపాలో చేరాలని ఒత్తిడి చేశారు. మేము ఒప్పుకోలేదు. మాపై కక్షగట్టిన పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సోదరుడు బాబు, కుమారుడు కల్యాణ్‌ పోలీసులపై ఒత్తిడి చేసి తప్పుడు కేసులు పెట్టారు. అయినా మేము భయపడలేదు. నాతో సహా ఆరుగురిపై రౌడీషీట్లు తెరిచారు. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదని అడ్డుకున్నారు. ఓటు హక్కు కూడా వినియోగించుకోకుండా చేశారు. మహిళలను కూడా ఇబ్బందులు పెట్టారు. ఒక కేసులో బెయిల్‌ వస్తే వెంటనే మళ్లీ కేసు పెట్టేవారు. ఏ తప్పు చేయకపోయినా 22 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. గ్రామంలో నివసించే పరిస్థితి లేకపోవడంతో గుంటూరు వచ్చి పిల్లల్ని చదివించుకుంటున్నాం.

ఆమె వయసుకూ గౌరవం ఇవ్వలేదు..

ఆమె పేరు రంగనాయకమ్మ.  శంకర్‌ విలాస్‌ హోటల్‌ అధినేత్రి. వయసులో చాలా పెద్దావిడ. ఆమెకు సైతం సర్కారీ వేధింపులు తప్పలేదు. విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాద ఘటనలో బాధితుల ఇబ్బందులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ పోస్టును చూసి చలించి ఆమె ఫార్వార్డ్‌ చేశారు. అలా చేయడమే పెద్ద నేరం అన్నట్లు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని గంటల తరబడి సీఐడీ కార్యాలయంలో విచారిÅంచారు.

బీసీ నేత ఫిర్యాదుతో రైతులపై అట్రాసిటీ కేసు..

పెదకాకాని మండలం తక్కెళ్లపాడుకి చెందిన మేరిగ సుబ్బారావు గతంలో బీసీ కుల ధ్రువీకరణ పత్రం పొంది సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. 1995 నుంచి 2000 వరకు పదవిలో కొనసాగారు. ప్రస్తుతం వైకాపా నాయకుడిగా ఉన్నారు. ఇదే గ్రామంలోని సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా పని చేస్తున్నారు. నిధులు దుర్వినియోగం చేసి పొలాలకు వెళ్లే రోడ్డులో తన కార్యాలయ ప్రహరీ నిర్మించారు. దీనిపై గతేడాది మార్చి 25న సహకార పరపతి సంఘం ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులైన రైతులు నిలదీశారు. విచారణ జరిపించాలని గతేడాది ఏప్రిల్‌ 3న రైతులు లింగయ్య, వేణు, మల్లేశ్వరరావు, లక్ష్మయ్యలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే బీసీ అయిన ఛైర్మన్‌ ఫిర్యాదు మేరకు పెదకాకాని సీఐ బండారు సురేష్‌బాబు రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం గమనార్హం. వైకాపా ఎమ్మెల్యే రోశయ్య ఆదేశాలతోనే పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

2023 డిసెంబరు 14

ఆస్పత్రిలో నౌషాద్‌ను పరామర్శిస్తున్న శాసన మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌

ఆయన పేరు నౌషాద్‌. గుంటూరు నివాసి. ఆటోమొబైల్‌ విడిభాగాల దుకాణం ఉంది. ఎంపీ నందిగం సురేష్‌ అనుచరుడు సన్నీ అతని వద్ద నుంచి రూ.25లక్షలు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా వేధించాడు. దీంతో నౌషాద్‌ గత్యంతరం లేక పోలీసు స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీని తర్వాత సన్నీ నుంచి వేధింపులు తీవ్రమవడంతో నౌషాద్‌ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

2024 జనవరి 23

ఆమె గుంటూరు తూర్పు వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా ఇంట్లో పనిమనిషి. ఎమ్మెల్యే నివాసం ఉండే మంగళదాస్‌నగర్‌లో ఏర్పాటు చేసిన తెదేపా ఫ్లెక్సీలో ఆమె కుమారుడు మన్సూర్‌ ఫొటో ఉండడాన్ని ముస్తఫా కుమార్తె నూరిఫాతిమా జీర్ణించుకోలేకపోయారు. మన్సూర్‌ తెదేపా కార్యకర్తలతో కలిసి తిరగడంపైనా రగిలిపోయారు. దీంతో మన్సూర్‌ తల్లిని ఇంటికి పిలిపించుకుని ఆమెపై చోరీ కేసు పెట్టారు. ఆమెను పోలీసులతో కొట్టించారు. బాధితులు మీడియా ముందుకు వచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని