logo

పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..

జిల్లాలో పోలింగ్‌కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

Updated : 19 May 2024 05:57 IST

జిల్లాలో  పోలింగ్‌ రోజు పలుచోట్ల హింసాత్మక ఘటనలు
బాధ్యులు వైకాపా వారు కావడంతో కొమ్ముకాస్తున్న అధికారులు
కేసుల నమోదుకు మీనమేషాలు లెక్కిస్తున్న పోలీసు యంత్రాంగం
ఈనాడు-బాపట్ల

గవినివారిపాలెంలో పోలింగ్‌ రోజు ఘర్షణ(పాతచిత్రం)

జిల్లాలో పోలింగ్‌కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అయినా పోలీసులు ఈ ఉదంతాలను తీవ్రంగా పరిగణించలేదు. అందుకు బాధ్యులైన వ్యక్తులపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు చోద్యం చూడటంపై విమర్శలు వచ్చాయి. ఆయా ఘటనల వెనుక వైకాపా నాయకులు, కార్యకర్తలే ఉండటంతో పోలీసులు కేసుల జోలికి వెళ్లకుండా మిన్నకుండిపోయారు. ఈ ఉదంతాలను పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. పల్నాడులో పోలింగ్‌ రోజున, ఆ తర్వాత జరిగిన పలు హింసాత్మక సంఘటనలకు పోలీసు అధికారుల్ని బాధ్యులుగా చేసి వారిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఈసీ తాజాగా విచారణకు ఆదేశించింది. ఆ ఉదంతాలను చూసైనా బాపట్ల జిల్లాలో పోలీసులు కళ్లు తెరిచి పోలింగ్‌ రోజున, అంతకు ముందు చోటుచేసుకున్న ఘటనలపై కేసులు నమోదు చేస్తారనుకుంటే ఆ ఊసే లేకుండా పోయింది.

మచ్చుకు కొన్ని ఉదంతాలు..

చీరాలలో కూటమి అభ్యర్థి ఎం.ఎం.కొండయ్య ప్రయాణిస్తున్న వాహనంపై చీరాల మండలం గవినివారిపాలెంలో వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వి ఆయనపై దాడికి తెగబడ్డారు. ఆయనపైనే కాదు కుమారుడు మహేంద్రనాథ్‌ వాహనంపైనా అదే గ్రామంలో వైకాపా కార్యకర్తలు రాళ్లురువ్వి విధ్వంసం సృష్టించారు. ఈ రెండు ఘటనలు. చీరాల పోలీసులు, కేంద్ర బలగాల సమక్షంలోనే జరిగాయి. అయినా పోలీసులు బాధ్యులను గుర్తించి అరెస్టులు చేయకుండా ప్రేక్షకపాత్ర వహించటం గమనార్హం. సాక్షాత్తు కూటమి అభ్యర్థి కొండయ్య వాహనంపైనే గవినివారిపాలెంలో రాళ్లు రువ్వి పోలింగ్‌ కేంద్రాల పరిశీలనకు రాకుండా ఆ గ్రామ వైకాపా నాయకులు అడ్డుకుంటే తీవ్రంగా పరిగణించి ఇప్పటికే బాధ్యుల్ని అరెస్టు చేయాల్సి ఉన్నా కేవలం ఘటన జరిగిన రోజున ఇద్దరు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని అనంతరం వదిలేశారు. ఈసీ నిబంధనల ప్రకారమైతే దాడులకు పాల్పడిన వారిని అరెస్టులు చేసి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సెక్షన్లు పెట్టి కేసులు పెట్టాల్సి ఉన్నా ఆ పని  చేయలేదు. 


  • కొల్లూరు మండలంలో పోలింగ్‌ వేళ పలు గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. తెదేపా ఏజెంట్లను బయటకు లాగి కొట్టడం, బూత్‌ల్లో ఉండకూడదని అభ్యంతరం వ్యక్తం చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. అయినా ఆ మండలంలో దాడులకు పాల్పడిన ఏ ఒక్క వైకాపా కార్యకర్తను అరెస్టు చేయలేదు.

  • చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెంలో తెదేపా ఏజెంట్‌పై రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. కానీ ఆ ఉదంతంలో పోలీసులు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోలేదు.

  • పోలింగ్‌కు ముందు కర్లపాలెం మండలంలో వైకాపా అభ్యర్థి కోన రఘుపతి సోదరుడు సినీ రచయిత కోన వెంకట్‌ అరాచకం సృష్టించారు. ఆ మండలంలో వైకాపా తరఫున ఎన్నికల బాధ్యతలు చూస్తున్న వెంకట్‌ గణపవరానికి చెందిన రాజేశ్‌ అనే ఎస్సీ యువకుడు తెదేపాలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోయారు. పోలింగ్‌ వేళ పార్టీ మారారనే అక్కసుతో ఆ యువకుడిని బలవంతంగా స్టేషన్‌కు రప్పించి పోలీసుల సమక్షంలోనే ఆ యువకుడిపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెంకట్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదుకే పరిమితమయ్యారు. ఆ కేసులో ఇప్పటికీ అరెస్టులు చేయలేదు. నిందితులు అందరూ వైకాపాకు చెందినవారు కావడంతోనే పోలీసులు ఆ కేసులో ముందుకెళ్లలేదు. 

  • చీరాల పట్టణం, వేటపాలెం మండలంలో వైకాపా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బాహాబాహీకి దిగి ప్రజలకు అసౌకర్యం కలిగించారు. చీరాల 6వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ఱమోహన్‌ వైకాపా కార్యకర్తపై చేయిచేసుకున్నారు. ప్రతిగా వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయి ఆమంచి కృష్ణమోహన్‌ ప్రయాణించే వాహనంపై రాళ్లురువ్వి భయానక వాతావరణం సృష్టించడంతో పోలింగ్‌ రోజున చీరాల పట్టణంతో పాటు వేటపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అందుకు బాధ్యులను గుర్తించి పోలీసు స్టేషన్లకు తరలించకుండా వైకాపా అభ్యర్థి కరణం వెంకటేశ్, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ను గృహనిర్బంధం చేసి వారిని కట్టడి చేయటానికే పరిమితమయ్యారు. వైకాపా వాళ్లపై కేసులు నమోదు చేయటానికి ఇష్టపడని కారణంగానే పోలీసులు అలా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ రోజు వారి నివాసాలకు సమీపంగా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టి వాహనదారులను ఇబ్బందులకు గురిచేశారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని